14, ఆగస్టు 2023, సోమవారం

సులభోపాయం పారాయణం.

 *నిత్యాన్వేషణ:*


పారాయణం అంటే ఏమిటి? ఈ పారాయణలను చేసే పద్ధతులు తెలపండి?


పరా అయన సంబంధమైనది పారాయణం. అయనం అంటే ప్రయాణం. పరాగతి , పరా శక్తి లలో ఉండేదే ఈ— *పరా* అనేది. అన్నిటికంటే శ్రేష్ఠమైన అని ఈ మాటకు అర్ధం. ఉత్తమ గతి పొందడానికి చేసే ప్రయాణం పారాయణం. నామ స్మరణాత్ అన్యోపాయం న హి పశ్యామః భవతరణే ..అని కలి యుగంలో కడతేరడానికి ఇష్టం దైవం నామం స్మరించడం తేలిక ఐన మార్గం. ఏకాగ్రతతో భగవన్నామాలు గానీ భగవంతుని లేదా భాగవతుల విషయాలు గానీ స్మరించడం, చింతించడం పారాయణం అని వ్యవహరిస్తున్నాము. పారాయణ. అర్థం చేసుకొంటూ చేసినపుడు ఆ కథలో తేలికగా లీనమై ఆనందం పొందగలం.. కొంతైనా ఆ భాషలో పరిజ్ఞానం పాఠకుడికి ఉన్నపుడే అందులోని విషయం బోధ పడుతుంది.

ఎవరికీ బొత్తిగా అర్థం కాకుండా ఉండదు. అర్థం తెలిసే కొద్దీ ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. చదవడానికి సరిగా రానివాళ్ళు ఇతరులు పారాయణం చేస్తూ ఉంటే విని ఆనందిస్తారు.

భగవద్గీత, రామాయణము, భాగవతము, దేవీ భాగవతం, దుర్గా సప్త శతి - పారాయణం చేస్తారు. దేవతల సహస్ర నామాలు గూడా పారాయణం చేస్తారు..వేదం , పురాణాలూ పారాయణ క్రమంలో ఉండవు.  ..రామాయణం , విష్ణు సహస్ర నామ స్తోత్రం , వేదంలో కొన్ని పన్నాలు నిత్య పారాయణం చేయడం కొందరు విధిగా పెట్టుకొని పాటిస్తారు. దేవీనవరాత్రులలో, చైత్ర మాసం శ్రీ రామోత్సవాలలో ఈ పారాయణాలు విశేషంగా చేస్తారు.

భాగవతం ఏడు రోజులలో చదివి పూర్తి చేయడం ఒక సంప్రదాయం. రామాయణం సుందర కాండ మాత్రమే పారాయణం చేయడంలో కొన్ని పద్ధతులు పాటిస్తారు.

ప్రతి రోజూ ఏడు సర్గలు మాత్రమే చదువుతూ ఆ విధంగా. ఏడు సార్లు పారాయణం చేస్తారు. చివరలో రామ పట్టాభిషేకం ( యుద్ధ కాండ లోది ) చదువుతారు. ఒక సర్గ చదివేటప్పుడు అది పూర్తి అయ్యేవరకు మధ్యలో లేచిపోరు.. మరుసటి సర్గ మొదటి శ్లోకం ప్రారంభించి నాటి పారాయణం నివేదన మంగళ హారతులతో పూర్తి చేస్తారు. కొన్ని నియమాలు పెట్టుకొని అవి పాటించడం వల్ల ఏకాగ్రత పెరుగుతూ వచ్చి ధ్యానానికి మనసు నిలబడుతుంది.

సన్మార్గంలో నడవడానికీ , ఉన్నతి సాధించడానికీ సులభోపాయం పారాయణం.

కామెంట్‌లు లేవు: