27, ఆగస్టు 2023, ఆదివారం

నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు

 40. నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు

___________________________


గురుసన్నిధిలో మనసు ప్రయత్నంగా

తాను పుట్టుచోటుకి వెళ్లిపోతుంది.


గురుసన్నిధిలో మౌనం కూడా

ప్రవక్తలా ప్రవచిస్తుంది.


గురుసన్నిధిలో దైవం కూడా

శిష్యునిలా మెలగుతుంది.


* * *


ప్రతిసారీ ఏదో ఒక సందర్భంలో గురువుగారు తరచూ చెప్పే మాటలు నాలుగున్నాయి...


1. నీ కనుచూపు పారినంతమేరకు ఉన్నదే ప్రపంచం.


2. "అందరూ" ఎక్కణ్ణుంచి వచ్చారు?

ఉండేది నీవొక్కడివే.


3. ముందు నీవు వచ్చాకే, సకలమూ వచ్చింది.

నీవు పోయాక ఇక్కడ ఉండేది కూడా ఏదీ ఉండదు.


4. జాగ్రత్-స్వప్న-సుషుప్తులు మూడూ కలిపి ఓ పెద్దకల అని ఎఱుకే 'నిజమైన మెలకువ'.


* * *


పై నాలుగు వాక్యాలను జీర్ణం చేసేసుకుంటే చాలు...

మనిషి ఋషైపోవడానికి...


ఒక్క సంకీర్తనైనా చాలు...నన్ను ఒద్దిక రక్షింపగ...

తక్కినవన్నీ భండారాన దాగీ ఉండనీ అన్నాడు అన్నమయ్య.


సద్గురు సాహిత్యం కూడా  అంత పెద్ద మొత్తం మనకు అవసరం లేదు...

జ్ఞానప్రసూనాల్లో ఒక్క సూక్తి చాలు...తరించడానికి.


బట్టలషాపుకెళ్లి, మనకు సరిపోయే దుస్తులను కొనుగోలు చేసి బయటపడతాం...మిగతా దుస్తులతో మనకు పనిలేదు.


అలాంటిదే ఈ "జ్ఞానప్రసూనాలు" గ్రంథం కూడా.

మనక్కావలసిన వాక్యాన్ని తీసుకొని ఈసంసారం నుండి బయట పడాలి. మిగతా వాక్యాలతో మనకు పనిలేదు...ఎన్నైనా ఉండనీ, ఎలా అయినా ఉండనీ...ఎంత గొప్పగా ఉండనీ...


* * *


"బాబుతో ఉండు...బాబుగా ఉండొద్దు"

అన్నారు గురవుగారు  నాతో ఓసారి...

ఆ ఒక్క ఉపదేశమే నా జీవితానికి సరిపోయింది.


అంటే బాబుగా ఉండొద్దు...సాక్షిగా ఉండు...

ఆ సాక్షిగా ఉన్నవాడు బాబు కాదు, బ్రహ్మమే.

ఆ బ్రహ్మమే నీవు.

అని ఆ ఉపదేశభావము.


ఆ ఉపదేశసారాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే-

"నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు".


* * *


కొంతమంది శిష్యుల ప్రోద్బలంతో మూడుసార్లు గురువుగారితో కలిసి అరుణాచలం వెళ్లే భాగ్యం కలిగింది నాకు.


అనంతనికేతన్ ఆశ్రమంలో చిలకమ్మకు అతిథులుగానే గడిపాం మూడుసార్లు...


స్వామీ...! తమరితో కలిసి అరుణాచల ప్రదక్షిణం చేయాలని ఉంది...అని పట్టెయ్య కోరినప్పుడు-

"అరుణాచలమే నా చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది...

 మీరు వెళ్లి రండి..." అన్నారు.


ప్రపంచానికి అరుణాచలం కేంద్రం అయితే,

అరుణాచలానికి కేంద్రం సద్గురుదేవులే.


* * *


"తమరు టచ్ చేసిన సబ్జక్టు, రమణులు కూడా టచ్ చేయలేదు" అని బాబు అంటే,


"రమణులే నా రూపంలో టచ్ చేస్తున్నారు..."

అని ఠక్కున పలికారు, క్షణం కూడా ఆలస్యం చేయకుండా...


అంతగా వారు ఏకాత్మవస్తువుతో మమేకం అయి వుంటారు....


తాతగారు అన్నట్టు- వారు శుభ్రమైన మణి.


* * *


ఓ గురుదేవా!


మిమ్ము స్తుతించుట యొక్క అర్థము

మౌనంగా ఉండడమే.


మిమ్ము పూజించుట యొక్క అర్థము

కర్మలు లేకుండా ఉండడమే.


మీ సాన్నిధ్యమును పొందుట యొక్క అర్థము

మీలో లీనమై శూన్యత్వమును పొందటమే.


అంటారు జ్ఞానేశ్వరులు.


* * *


కొంచెం కూడా కర్తృత్వభావం లేకపోవడమే శరణాగతి.

శరణాగతికి ఆటంకమైన అహాన్ని తొలగించేది

సద్గురు సన్నిధి.


తనను తాను పోగొట్టుకొని

తనను తాను పొందాలి.

ఇదే జీవితపరమార్థం.


అది సద్గురు సన్నిధిలో మాత్రమే నెరవేరబడుతుంది.


* * *

-జ్ఞానశిశువు-9533667918

కామెంట్‌లు లేవు: