19, అక్టోబర్ 2023, గురువారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 68*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 68*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఉద్యోగాన్వేషణలో ఒక రోజు వర్షంలో బాగా తడిసిపోయి రాత్రి  ఇంటికి తిరిగివస్తున్నాను. శరీరం బాగా డస్సిపోయింది. మనస్సు దానితో చేరిపోయింది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో, ప్రక్కనే ఉన్న ఒక ఇంటి అరుగు మీద కుప్పకూలిపోయాను. బాహ్యస్మృతి ఉందో లేదో తెలియదు. కాని ఏవేవో ఆలోచనలు ఒకటి వెంట ఒకటిగా తలెత్తడమూ, తొలగిపోవడమూ జ్ఞాపకం ఉంది. వాటిని త్రోసివేయడానికి ఏదో ఒక భావనలో మనస్సును ప్రగాఢంగా లీనం చేయలేకపోయాను. 


ఆ సమయంలో ఏదో ఒక దివ్యశక్తి నా ఆంతరికమైన తెరలను ఒకటి వెంట ఒకటిగా తొలగిస్తున్నట్లుగా అనిపించింది. ఇన్ని

రోజులుగా నా మనస్సును గందరగోళానికి లోను చేస్తున్న 'మంచితనం మూర్తీభవించిన భగవంతుని సృష్టిలో చెడు ఎందుకు ఉంటుంది? భగవంతుని కఠోర న్యాయంతోపాటు అపార కారుణ్యమూ ఎలా కలగలసి ఉంటుంది?' లాంటి పలు సంశయాలకు శాశ్వతమైన పరిష్కారాలను నా హృదయాంతరాళంలో కనుగొన్నాను. కట్టలు తెగిన ఆనందంతో లేచాను. శరీరంలో అలసట కాస్త కూడా లేకుండా పోయింది. మనస్సు ఒక అద్భుతమయిన శక్తితోను, ప్రశాంతతతోను  భాసించింది. 


 సాధారణమైన మనుషుల్లా డబ్బు సంపాదించడానికీ, కుటుంబాన్ని పోషించడానికి, సుఖాలను అనుభవించడానికి  నేను జన్మించలేదనే భావన నా మనస్సులో పాతుకుపోయింది. నా తాతలా సర్వసంగ పరిత్యాగానికి నేను రహస్యంగా తయా రయ్యాను. అందుకోసం తేదీ కూడా నిర్ణయించుకున్నాను.


కాని ఆశ్చర్యం! ఆ రోజు శ్రీరామకృష్ణులు కలకత్తాలో ఒక భక్తుని ఇంటిని పావనం చేయబోతున్నారని తెలియవచ్చింది. మంచిదే, గురువు దర్శనానంతరం శాశ్వతంగా ఇంటిని పరిత్యజించగోరాను. కాని నేను ఆయనను చూడగానే, 'ఈ రోజు నువ్వు నాతోపాటు దక్షిణేశ్వరం వచ్చే తీరాలి' అని గట్టిగా పట్టుబట్టారు. ఎన్నో కుంటిసాకులు చెప్పిచూశాను. కాని ఆయన ఏదీ వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక ఆయనతోపాటు వెళ్లాను. బండిలో పోతున్నప్పుడు కూడా ఆయను ముక్తసరిగానే మాట్లాడారు. దక్షిణేశ్వరం వెళ్లాక కాసేపు ఇతరులతోపాటు ఆయన గదిలో కూర్చున్నాను. 


ఇంతలో శ్రీరామకృష్ణులకు పారవశ్య స్థితిలో  కళ్ల వెంట నీరు ధారలు కట్టగా,నన్ను ఆప్యాయంగా పట్టుకొన‌్నారు.“హృదయంలో పొంగిపొరలుతున్న ఉద్వేగ ప్రవాహాన్ని ఇక ఆపుకోలేక పోయాను. ఆయన మాదిరి నా కళ్లలోనూ నీరు ధారకట్టింది. అంతా ఆయనకు తెలిసిపోయిందని స్పష్టంగా నాకు అర్థమయింది. మా ఇద్దరి మధ్య ఏం జరుగు తున్నదో ఎవరికీ అంతుబట్టలేదు. 


శ్రీరామకృష్ణులు మామూలు స్థితికి వచ్చాక కొందరు, 'విషయం ఏమిటి?' అని అడిగారు. ఆయన నర్మగర్భంగా నవ్వుతూ, 'ఓ అదా, అది మా ఇద్దరికీ సంబంధించింది' అన్నారు. రాత్రి అందరూ సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాక, నన్ను దగ్గరకు పిలిచి, గద్గద స్వరంలో, 'నాకు తెలుసు. నాయనా! నువ్వు జగజ్జనని కార్యం నిమిత్తమే వచ్చావని నాకు బాగా తెలుసు. నువ్వు లౌకిక జీవితం గడపలేవు. అయినప్పటికీ నేను ఉన్నంతదాకా నా కోసం ఇంట్లోనే ఉండు' అని చెబుతూ, కన్నీరుమున్నీరయినారు.”🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: