19, అక్టోబర్ 2023, గురువారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


భోగః కాలవశాదేతి తత్రైవ ప్రతియాతి చ |

నాత్ర శోకస్తు కర్తవ్యో నిష్షలే భవవర్మ్తని

వైకత్ర సుఖసంయోగో దుఃఖియోగస్తు వైకతః ।

ఘటికాయంత్రవత్కామం భ్రమణం సుఖదుఃఖియోః||


మహారాజా! క్షణభంగురమే అయినా మానవజన్మ కడుంగడు దుర్లభం. అది లభించినవారికి

ఎప్పుడైనా ఏకైక కర్తవ్యం ఆత్మసాధన మాత్రమే. ఇంద్రియాలూ అవయవాలూ అన్నీ పశువులకు

ఉంటాయి. మానవదేహానికి అధికంగా ఉన్నది ఒకే ఒక్కటి జ్ఞానం. అంచేత జ్ఞానివై ఈ శోకాన్ని త్యజించు.

ఇదంతా ఒక మహామాయ అని గ్రహించు. ఆదిపరాశక్తి ఈ మాయతో అఖిలజగత్తునూ అన్ని కాలాలలోనూ

నమ్మోహపరుస్తోందని తెలుసుకో. వెళ్ళు. ఇంటికి వెళ్ళి హాయిగా రాజ్యం ఏలుకో.

శ్రీహరి చేసిన ఉపదేశంతో తాళధ్వజుడు తేరుకున్నాడు. సాష్టాంగనమస్కారం చేశాడు. సరోవరంలో

స్నానం చేసి, రణరంగంలో మరణించిన పుత్రపౌత్రమిత్రబంధుగణానికి నువ్వులూ నీళ్ళూ విడిచిపెట్టిరాజధానికి వెళ్ళిపోయాడు. బతికిబట్టగట్టిన ఒక మనుమడికి రాజ్యం అప్పగించేసి తత్త్వజ్ఞానియై

తపస్సుకోసం అడవులకు వెళ్ళిపోయాడు.

• శ్రీహరి చెప్పిన మాయావిలాసం

శ్రీమన్నారాయణుడు నావైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. రెండు చేతులూ జోడించి

నమస్కరించాను. జగన్నాథా! చాలా అందంగా వంచించావు నన్ను. సంతోషం. మాయాబలం ఎంతటిదో

దాని మహత్తు ఏమిటో బాగా తెలిసివచ్చేట్టు చేశావు. స్త్రీరూపం పొందినప్పటి నా అనుభవాలన్నీ

జ్ఞాపకంలోనే ఉన్నాయి. అవునూ! ఈ సరోవరంలోనేగదా అలనాడు మునిగాను. మునగడంతోనే స్త్రీగా

మారిపోయాను. పూర్వవిజ్ఞానమంతా చిటుక్కున మాయమయ్యింది. అదెలా జరిగిందో అంతుబట్టడం

లేదు. స్త్రీరూపాన్ని పొంది సంసారసమ్మోహంలో మునిగిపోయాను. అనురూపభర్తను పొందాను. శచీ

పురందరుల్లా రాజభోగాలు అనుభవించాము. ఇప్పుడు మళ్ళీ అదే మనస్సు. అదే చిత్తం. అదే పురాతన

పురుష శరీరం. స్త్రీగా మారినప్పుడు పురుషజ్ఞానం ఎందుకు పోయింది? పురుషుడిగా మారిన ఇప్పుడు

రూప పరిజ్ఞానం ఎలా మిగిలింది? ఇది చాలా వింతగా ఉంది. అప్పటి జ్ఞాననాశానికి కారణం ఏమిటో

మహానుభావుడవు నువ్వే చెప్పాలి. స్త్రీరూపంలో రకరకాల భోగాలు అనుభవించాను. సురాపానం చేశాను.

అభక్ష్య భక్షణం అకాల భోజనం ఇత్యాదులన్నీ చేశాను. నేను నారదుడిని అనే స్పృహయే లేకపోయింది.

జరిగినదంతా ఇప్పటిలా అప్పుడు జ్ఞాపకం లేకపోయింది. కారణమేమిటో రవ్వంత వివరించు మహాప్రభో!

కామెంట్‌లు లేవు: