21, అక్టోబర్ 2023, శనివారం

నలువ చెలువ యందము !


నలువ చెలువ  యందము !

------------------------------------------ 

        

   మ:  నవలావణ్య  రసాలయంబు , గుణరత్న స్థాన , మాస్య  క్షపా


                  ధవ  బింబోదయ , మున్నతస్తన గిరీంద్రవ్యక్తి , వాచాసుధా


                   భవ దేశంబు , వళీతరంగము , తనూభద్ర ప్రభా  ఫేన దీ


                    ప్తి విలాసం , బగు తత్కళత్రము సుధాబ్ధిం  బోలి సద్భక్తితోన్;


                           శ్రీ కాళ హస్తీశ్వర మాహాత్మ్యము  2 ఆ: 5- పద్యం:  ధూర్జటి.


                      

                               కథాసందర్భంగా  ద్వతీయా శ్వాసంలో  ఈపద్యం చోటుచేసికొన్నది. బ్రహ్మ గారికి తనభార్య సరస్వతి  పాల్కడలివలె  దర్శన మిచ్చిందట!  


            అర్ధములు: లావణ్యము- శరీరపు మెఱపు,; రసాలయం - నీటితోనిండినది సముద్రము; గుణరత్నములు- సద్గుణములనేరత్నములు; ఆస్యము -ముఖము;  క్షపాధవ బింబోదయము- చంద్రబింబముయొక్కఉదయము; గీరీంద్రవ్యక్తి- పర్వతములు కనబడుట; వాచాసుధ- అమృతమువంటిమాటలు; భవదేశము-పుట్టుచోటు;  వళీతరంగము- పొట్టపై ముడతలనే  కెరటములు; తనూభద్ర ప్రభాదీప్తి  ఫేన దీప్తి విలాసము- శరీరకాంతి యనే నురుగులు; కళత్రము- భార్య ;  సుథాబ్ధి-పాలకడలి;


                     సరస్వతిని కవి పాల సముద్రంతో  పోల్చి చెపుతున్నాడుకవి.  ఇదో అపురూపమైన పద్యం!  భార్యను పాలకడలితో పోల్చిచెప్పిన కవులెవ్వరూ కానరారు. సముద్రముతో పోల్చినప్పుడు దానిలక్షణాలు భార్యయందు ఉండాలికదా? ఉన్నాయని రూపకంలో నిరూపిస్తున్నాడు.


          పాల సముద్రంయొక్క లక్షణాలు  ఈవిధంగా ఉన్నాయి. అపారమైన నీరు, రత్నములకు నెలవగుట , చంద్రుని పుట్టుక , పెద్దపర్వతములు కానవచ్చుట, అమృత ము ఉదయించుట, కెరటములు , నురుగులు స్థూలముగానిదీదానిస్వరూపము. ఆలక్ణణములన్నియు కళత్ర స్థానమున నున్న సరస్వతి యందుకూడ నున్నవట! యెట్లు? 


                  నవలావణ్యమనే  నీరు సమృధ్ధిగా నీమె శరీరమున నున్నదట. గుణములనే రత్నములున్నవట.( ఆమెసద్గుణములు రత్నములవంటివే యని ) ముఖమే  చంద్రోదయముతో  సమానమట. ఆమె సమున్నతమైన  స్తన సంపదయే పర్వతములట, ఆమెమాటలే  అందుదుదయించిన యమృతమట! (ఆమెమాటలు అమృతతుల్యములని చెప్పుట) ఆమె యుదరస్థమైన  ముడుతలే  కెరటములట, ఆమె శరీర కాంతియే  నురుగట. ఈవిధముగా పాల సముద్రము వలె సరస్వతి యట కరుదెంచి భర్త బ్రహ్మగారికి కనువిందుచేసింది. 


                       భార్యను పాల సముద్రముతో  పోల్చుట  యెంత గొప్పయూహ! ఎంతఉదాత్తమైనది!


                            సద్గుణగణములుగల భార్య పాల సముద్రము వంటిదే! పాల సముద్రము దేవతలకు అమృతానిచ్చింది. భార్య కూడా ఆనందామృతాన్ని జీవితాతం భర్తకు అందిస్తూనే ఉంటుంది.పాలసముద్రం కల్పవృక్షాదుల నిచ్చింది. వాటి ఉపయోగం?కోరికలుదీరటం. భార్యకూడా కల్పవృక్షమే  నీకోరికల నన్నిటినీ తీరుస్తూనే ఉంటుంది. ఉదాత్తమైన భావనతో భార్యను భర్త

గౌరవిస్తూ ఉంటే భార్య గృహ లక్ష్మియై సకల భోగ భాగ్యాలకు కారక మౌతుంది. పాలసముద్రం మనప్రక్కనున్నా  గమనించలేని ధూర్తులకు  జీవనం వ్యధాభరితమే! భార్యతో అనురాగాన్ని పంచుకుంటే  ఆజీవితం సుధాభరితమే!* అనే చక్కని సందేశాన్ని యీపద్యంద్వారామనకు అందజేసిన ధూర్జటి  కవీనాంకవి యనుటలో  నత్యుక్తి లేదు.


                                                                  స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: