శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
త్రిమూర్తులే ఈ మాయామోహానికి అతీతులు కారంటే ఇక నువ్వూ నేనూనా! అందుచేత దుఃఖించకు.
తత్వజ్ఞానివై ఈ మోహార్ణవాన్ని తరించు.
(అధ్యాయం 30 శ్లోకాలు- 53)
జనమేజయా! ఆనాడు నా ఆశ్రమానికి వచ్చి నారదుడు చేసిన ఉపదేశం యథాతథంగా నీకు
చెప్పాను. నా మనస్సుకి బాగానాటుకున్న ఉపదేశం ఇది. నా కళ్ళు తెరిపించిన ఉపదేశం ఇది. నా దుఃఖాన్ని
చేత్తో తీసివేసినట్టు తొలగించిన దివ్యోపదేశం ఇది. విన్నావుగదా! అటుపైని నారదుణ్ణి నేను ఏమి అడిగానో
తెలుసా
నారదమహర్షీ ! విష్ణుమూర్తి ఇంకా ఏమి చెప్పాడు? మీరిద్దరూ కలిసి అక్కడి నుంచి
ఎటువెళ్లారు? అన్నాను.
నారద చతుర్ముఖ సంభాషణ
వ్యాసమహర్షీ ! గరుడుడిని అధిరోహించి వైకుంఠానికి ప్రయాణమై శ్రీహరి, నారదా! నువ్వు
ఎటైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదంటే నాతో వైకుంఠానికి రా అన్నాడు. నేను వీడ్కోలు తీసుకుని
బ్రహ్మలోకం చేరుకున్నాను. విష్ణుమూర్తి నన్ను ఆశీర్వదించి వైకుంఠం చేరుకున్నాడు. సుఖదుఃఖాలను
నెమరువేసుకుంటూ వెళ్ళి నేను మా తండ్రిగారి దర్శనం చేశాను. మునుపటిలానే నమస్కరించి సన్నిధిలో
నిలబడ్డాను.
కుమారా ! ఎక్కడికి వెళ్ళావు? చింతాకులచిత్తుడివై కనిపిస్తున్నావేమిటి కారణం ? మనస్సు
బాగున్నట్టు లేదే ! ఎవరైనా వంచించారా? అద్భుతమేదైనా తిలకించావా ? ఏమిటి ఇలా ఉన్నావు? బాగా
వెలిగిపోయినట్టు కనిపిస్తున్నావు? అని ఆత్రుతగా అడిగాడు మా తండ్రి. చెయ్యి పట్టుకుని ఒడిలో
కూర్చోబెట్టుకున్నాడు.
అవును తండ్రీ ! విష్ణుమూర్తి నన్ను వంచించాడు. స్త్రీరూపం పొంది శతాధికవత్సరాలు సుఖాలు
అనుభవించి, కడపటికి పుత్రవినాశరూపమైన మహాదుఃఖాన్ని చవిచూశాను. మళ్ళీ అతడే నా కళ్ళు
తెరిపించాడు. మృదువాక్యామృతాలతో దివ్యోపదేశం చేశాడు. మళ్ళీ సరోవరంలో మునిగి నారదుణ్ణి
అయ్యాను. తండ్రీ ! అప్పుడు అలా మోహపడటానికీ, పూర్వవిజ్ఞానాన్ని విస్మరించడానికీ కారణమేమిటో
తెలియలేదు. ఈ దురత్యయమైన మాయాబలం ఎంతకీ అర్థంకావడం లేదు. అంతా తెలిసిపోయినట్టే
ఉంటోంది ఏమి తెలియడంలేదు. జ్ఞానహానికరమైన ఈ మహామోహానికి మూలం ఏమిటి ? అనుభవించానే
తప్ప కారణం తెలుసుకోలేకపోయాను. నువ్వు దీన్ని ఎలా జయించగలిగావు? ఆ ఉపాయమేదో నాకూ
చెప్పు అని అభ్యర్థించాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి