14, నవంబర్ 2023, మంగళవారం

రామకోటి పై మార్గదర్శనం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*రామకోటి పై మార్గదర్శనం..ప్రలోభపు ఆలోచన!..*


*(ఇరవై ఏడవ రోజు)*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


శ్రీ స్వామివారు రామకోటి వ్రాయడం గురించి వివరించిన తరువాత కూడా..తన ఉపదేశాన్ని కొనసాగించారు..


"రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముట్టాయని వాపోయావు కదా తల్లీ!..నీకు అలా వ్రాయడానికి అర్హత వుందో.. లేదో..ముందుగా భగవానుడు పరీక్షిస్తాడమ్మా..అసలు ఈ జన్మకు నువ్వు ముక్తిమార్గం వైపు పయనించే అర్హత లేదనుకో..భగవన్నామాన్ని చేత పట్టుకుని కూడా..చిన్నపాటి వ్యాధులొచ్చాయనో..లేదా..కుటుంబంలో సమస్యలు వచ్చాయనో..ఇవేవీ కాకుంటే..ఇతరులు చెప్పిన కల్పిత మాటల ప్రభావం చేతనో..చేతిలోవున్న దివ్య నామాన్ని వదిలి..ఈ లౌకిక విషయ వాసనల్లో చిక్కుకుపోతావు..ఈ వ్యాధులు..ఈ కుటుంబ సమస్యలు..ఇవన్నీ..ప్రతి గృహస్తుకూ వుండేవే.. మానసిక అశాంతి అనేది అందరికీ వుంటున్నదే.. కొత్తగా రామకోటి వ్రాసినంతమాత్రాన అవి రావు..ఆ సమస్యల తీవ్రత తగ్గించి..మానసిక ప్రశాంతతను చేకూర్చే మహత్తర నామం..రామనామం తల్లీ!.."


"వద్దు అమ్మా..వద్దు!..లేనిపోని శంకలు పెట్టుకొని..ఆ దివ్యనామాన్ని వదలకు!..నిష్ఠతో ప్రారంభించు!..చేత పట్టుకున్న ఆ రామనామాన్ని వ్రాయడం మొదలుపెట్టు!..కోటి పూర్తి చెయ్యి!..అది ఒక్కటీ వున్నా..దైవం కరుణ పూర్తిగా ఉన్నట్లే!..దైవ కరుణ లేకుండా ఎన్ని అష్టైశ్వర్యాలు వున్నా వ్యర్ధమే తల్లీ!..రామనామం కోటి పూర్తయ్యాక..తిరుమంత్రం..అష్టాక్షరి కోటి ప్రారంభిద్దువు గానీ..ఈలోపు..అష్టాక్షరిని రోజుకు 108 సార్లు నియమంగా జపం చేస్తూవుండు!.." అని చెప్పారు..అప్పటికే దాదాపు రాత్రి 11గంటలు దాటి పోయింది..


"అమ్మా!..ఒక గ్లాసు పాలు ఇవ్వు..నేను వెళతాను.." అని స్వామివారు పాలు త్రాగి తన గది దగ్గరకు వెళ్లిపోబోతూ..అక్కడే ఉన్న పారిజాతం చెట్టు వద్ద ఆగారు..ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు..వెన్నెల ఆ పారిజాతం చెట్టు ఆకుల మీద ఉన్న మంచుబిందువుల్లో వింతగా మెరుస్తోంది..


శ్రీ స్వామివారు చాలాసేపు ఆ చెట్టు చుట్టూరా పసి పిల్లాడు పట్టరాని ఆనందంతో తిరుగుతున్నట్టు ప్రదక్షిణగా తిరగసాగారు..కొన్ని పారిజాతపు పూలు కోసుకుని గదిలోకి వెళ్లి వాటిని అక్కడ ఉంచి..మరలా తిరిగివచ్చి..ఆ చెట్టు దగ్గర చాలా సేపు నిలబడి చూస్తూ..పచార్లు చేస్తూ..ఉండిపోయారు..ఆ తరువాత ఆ  ఆవరణ మొత్తం కలియతిరుగుతూ వున్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు శ్రీ స్వామివారి ఉపదేశం అద్భుతంగా అనిపించింది..సత్యనారాయణమ్మ గారు కూడా శ్రద్ధగా ఆలకించారు.. భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకున్నారు..ప్రభావతి గారికి రామనామం గురించి..ఆవిడ మనసులో వున్న సందేహాలన్నీ మటుమాయం అయ్యాయి..ప్రక్కరోజే..కందుకూరు నుంచి రామకోటి పుస్తకాలు తెప్పించుకున్నారు..శ్రీధరరావు గారు కూడా.."మళ్లీ మొదటినుంచీ ప్రారంభించు ప్రభావతీ!.." అన్నారు..అత్తగారు సత్యనారాయణమ్మ గారు కూడా.."స్వామివారి ఆశీస్సులు..ఆ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడి కరుణ..నీ చేత కోటి పూర్తి చేయిస్తాయమ్మా..మొదలుపెట్టు!.." అన్నారు..


సద్గురువు (శ్రీ స్వామివారు) ఆదేశము..తన తోడూ నీడ గా వుండే భర్త అంగీకారము ప్రభావతి గారికి కొండంత విశ్వాసాన్ని కలిగించాయి..మంచిరోజు చూసుకొని రామకోటి వ్రాయడం మొదలుపెట్టారు..


శ్రీ స్వామివారు తాను ధ్యానం నుంచి లేచివచ్చిన తరువాత..ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి శ్రీధరరావు దంపతులకు బోధిస్తూ వుండేవారు..ఒక్కొక్కసారి మౌనం పాటించేవారు..శ్రీ స్వామివారు తనంతట తాను నోరువిప్పి మాట్లాడితే తప్ప, వీరిద్దరూ ఏ విషయమూ ఆయనతో ప్రస్తావించేవారు కాదు..ఇలా ఒకటి రెండు రోజులు గడిచాయి..


ఒక సాయంత్రం వేళ..శ్రీ స్వామివారు హఠాత్తుగా శ్రీధరరావు దంపతులతో.."మీరిద్దరూ నిస్వార్ధంగా నా తపస్సుకు సహకరిస్తున్నారు కనుక..మీకేమైనా బాధలుంటే చెప్పండి..నేను పరిష్కారం చెపుతాను.." అన్నారు..


వెంటనే శ్రీధరరావు గారు.."స్వామీ!..మేము గృహస్థులము..ఎన్నో సమస్యలుంటాయి..బాధలు..సంతోషాలూ అన్నీ ఉంటాయి..మా సమస్యలను మేమే తీర్చుకోవాలి..అది మా బాధ్యత!..మాకోసం, మీ తపశ్శక్తిని ధారపోయడం నాకు ఇష్టం లేదు!.." అని చెప్పారు..శ్రీ స్వామివారు ఎంతో సంతోషంగా ఆశీర్వాదం ఇచ్చారు..


నిజానికి ప్రభావతి గారు శ్రీ స్వామివారు అడిగినవెంటనే..తమకున్న ఆర్ధిక కష్టాలు చెప్పుకోవాలని ఉవ్విళ్ళూరారు..స్త్రీ సహజమైన ఆందోళన, బాధ్యతల తాలూకు భయమూ..కొద్దిపాటి ప్రలోభమూ ఆవిడను చుట్టుముట్టాయి..కానీ శ్రీధరరావు గారు ఆవిడ ఆలోచనను నిర్ద్వందంగా తోసిపుచ్చారు.."లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు ప్రభావతీ!..మనం ఆయననుంచి ఏదో ఆశించి ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేదు..ఆయన తపస్సుకు మనం ఆలంబన కావాలి..అంతేకానీ మన బరువు బాధ్యతలు మోపకూడదు..మనం నమ్ముకున్న లక్ష్మీనృసింహుడి కి మన సమస్యలు తెలుసు..కాకుంటే స్వామివారి మనసులో మనకు మేలు చేయాలని ఉన్న ఒక్క భావనే చాలు మన పదితరాలు తరించిపోవడానికి.." అన్నారు..ప్రభావతి గారు అప్పటికి సరే అన్నారు గానీ..లోలోపల మాత్రం ఎలా అయినా శ్రీ స్వామివారి వద్ద తన కోరికను వెళ్లబుచ్చాలని గట్టిగా నిర్ణయించుకున్నారు..


అష్టైశ్వర్యాలు..అష్టసిద్ధులు..రేపటిభాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: