శ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత
శివానందలహరీ
01
కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే
శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్
సీ. శ్రీకరాన్విత లసత్ చిత్ సర్వ కళలతో
విభవోన్నతంబుగా వెలుగు వారు
శిఖలోన విధురేఖ చెలువమై ధరియించి
యత్యంత శోభతో నమరు వారు
ఒండొరుల్ తపముచే నొనగూరు చుండియు
నిజ తపః ఫలమున నెగడు వారు
సకల జీవాళికి న్నకలంక శుభమిచ్చు
మంగళాకృతులందు మనెడు వారు
ధ్యాన హృత్ కుహరాన తాముండి సతతంబు
ప్రకటిత రూపాన పరగు వారు
విమలమౌ నానంద విస్ఫురణంబున
స్వస్వరూపపు బోధ సల్పు వారు
తే. శ్రీయుమామహేశ్వరుల నాచిత్త మందు
ధ్యాన మొనరించి యత్యంత తన్మయమున
భవములను బాపి శాశ్వత శివములీయ
ప్రణతులర్పించు చుంటిని భక్తి తోడ 01*
02
గళంతీ శంభో ! త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతామ్
దిశంతీ సంసారభ్రమణ పరితాపోప శమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహారీ.
సీ. శంకరా ! భవదీయ సౌందర్య చరితమ్ము
దేవనదీ భాతి దివిని సాగె ,
దుస్సహ కిల్బిష ధూళి నణచి బుద్ధి
యను పెనుకాల్వగా నవని సాగె
జనన మరణ చక్ర సంసృతి భ్రమణాన
సాగి హృత్ పరితాప శాంతి నిచ్చె
మామక మనసను మడుగులో జేరి తా
నవ్యయానంద భాగ్యమ్ము పంచె
తే. సర్వ జనులకు నధ్యాత్మ సంప దిచ్చి
విభవ మొప్పంగ జగమునన్ వెల్గు చున్న
సుందరంబైన శ్రీ "శివానందలహరి"
యనుభవింతురు గాకిల నఖిల జనులు 02
గోపాలుని మధుసూదన రావు శర్మ 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి