🌸అమృతం గమయ - భక్తి యోగం🌸
భక్తి - దైవ సాన్నిధ్య మార్గం
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ।।
భగవద్గీత 12వ అధ్యాయం 13వ శ్లోకం
సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ।।
భగవద్గీత 12వ అధ్యాయం 14వ శ్లోకం
ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.
మానవ జన్మ పరమ లక్ష్యమైన మోక్ష సాధనకు తొలి మెట్టు భక్తి. దైవము పట్ల భక్తిని కలిగి నిష్కామ కర్మలను ఆచరిస్తూ జీవించడం దైవాన్ని సాధించడానికి అత్యంత విశేష మార్గం. కఠిన సాధకులు, మహర్షులు, యోగులు మరియు మునులు తమ తమ కఠిన సాధనా విధానాల్లో పరమపదం సాధిస్తే, సామాన్య మనుజులు తమ తమ నిత్య కర్మలని నిష్కామ భావంతో ఆచరించే సామర్థ్యాన్ని కలిగించేది భక్తి యోగం. అట్టి విశేష భక్తి తో పరమపదాన్ని చేరవచ్చు.
శ్రవణం కీర్తనమ్ విష్ణోః
స్మరణం పాదసేవనం,
అర్చనం వందనం దాస్యం,
సఖ్యం ఆత్మ నివేదనమ్
శ్రవణం - భగవానుడి గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలు వినుట.
కీర్తనమ్ - భగవంతుడి గుణగణాలను కీర్తించుట.
స్మరణం - అనునిత్యం భగవన్నామాన్ని స్మరించడం.
పాదసేవనం - భగవానుడి చరణాలను సేవించడం.
అర్చనం - భగవానుని సద్గుణ సంపన్నుడిగా విధిగా అర్చించడం.
వందనం - త్రికాలాల్లో మనస్ఫూర్తిగా ప్రణామములను అర్పించడం.
దాస్యం - భగవంతుడికి ఎల్లప్పుడూ దాసులవటము.
సఖ్యం - భగవంతుడితో స్నేహభావం కలిగి ఉండటం.
ఆత్మనివేదనం - తనని తాను భగవంతునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం.
ఇవి నవవిధ భక్తి మార్గాలని మనకి తెలియజేయబడ్డాయి. ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఏ ఒక్క మార్గాన్ని ఆచరించినా పరమ పదాన్ని చేరుస్తుంది.
అటువంటి భక్తిని కలిగి ఉండి పరిపుష్టిని సాధించటానికి ప్రధానమైనటువంటి మార్గము సజ్జన సాంగత్యం. భక్తికి సత్సాంగత్యం తోడైతే అది విశేష ఫలితాలు ఇస్తుంది. మానవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ ఆలోచనను సన్మార్గంలో నడిపించేది సజ్జన సాంగత్యం. ధ్యానం, ప్రార్థన మరియు సత్సంగ సభలు మొదలైనవి సామూహికంగా చెయ్యడంలో ప్రధాన ఉద్దేశం అదే. మానవుడి ఆలోచనా పరిధి అతి విస్తృతమైంది. మనసు ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి అనేక అవరోధాలు వస్తాయి. ప్రవర్తనలో మరియు ఆలోచన సరళిలో మార్పులు వస్తాయి. లౌకిక మరియు ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. వీటిని అధిగమించి భగవంతుడి సాన్నిధ్యంలో గడపడానికి ముఖ్యమైన సాధనం మంచివారిని కలవడం వారి మాటలు వినడం. దీనివల్ల సత్కర్మాచరణ అలవడుతుంది.
రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల క్రమక్రమంగా మనసు పరిశుద్ధమవుతుంది. ఒకరికొకరి దివ్య అనుభవం, జ్ఞాన జిజ్ఞాస ఇతరులకు చేరతాయి. దీనివల్ల ఇతరమైన ప్రాపంచిక ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజజీవితంలో ఏదైనా కర్మ చేసేటప్పుడు అందరికీ మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల భక్తి దృఢమయ్యి మోక్షమార్గం సులువవుతుంది.
కుటుంబాన్ని పోషించడానికి సామాన్య జీవితం చాలుననే దృక్పథంతో కైవల్య పదం చేరడాన్ని నిర్ణయించుకున్న పోతన మరియు త్యాగరాజు లాంటివారు ఆచరణీయులు. తప్ప, ప్రాపంచిక నిత్య నైమిత్తిక వ్యవహారాల్లో మునిగితేలుతూ అనేకంతో మమేకమై ఉంటే క్రమేపీ దర్పంతో కూడిన జీవనం అలవడి సన్మార్గం, భగవచ్ఛింతనలు దూరమవుతాయి. అందుకే పేద ధనిక కులమత ప్రసక్తి లేకుండా సజ్జనులతోడి సాంగత్యం మన అంతరంగ శత్రువులైన అరిషడ్వర్గాదులను అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే శత్రువులను అణచివేసి మనసుని నిర్మలం చేస్తుంది. నిర్మలమైన మనసు భక్తి బాటలో పయనిస్తుంది. సజ్జనులతోడి సాంగత్యం మనలోని లోపాలను గుర్తించేందుకు దోహదపడుతుంది. ఆత్మప్రక్షాళనకు దారిచూపిస్తుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్లో ఇతరుల అనుభవాలు మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తాయి. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి. సజ్జన సాంగత్యంలో ఉండే విశేషం ఇదే.
ఇతరుల బాధలను పంచుకోవడం, అనాథలకు ఆర్తుడవై ఉండటం, వృద్ధులకు చేయూత ఇవ్వడం, కర్మలను నిష్కామంగా భగవద్దత్తం చేయడం తద్వారా భగవద్భక్తి పరిపుష్టమవడం ఇవన్నీ పరమపదానికి సోపానాలు.
శుభం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి