28, ఏప్రిల్ 2024, ఆదివారం

శ్రీ కాళహస్తీశ్వర శతకము

 శు భో ద యం🙏


శ్రీ కాళహస్తీశ్వర శతకము

                       (200)

(400 సంవత్సరాల కిందట శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరైన  "ధూర్జటి" మహాకవిచే ఆవిష్కరించబడినది.


వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్

వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్

నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం

జెనకుం జీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


తాత్పర్యం

శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది.  రానున్న దుర్మరణము తలుచుకొనగా - ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మంచి సాధించనివాని నగుదునే?? నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును.


(శివ భక్తుడైన శ్రీ ధూర్జటి ఆత్మ నివేదన -మీలో కొందరిని 'పద్య భాగం'  అలరింపచేయలేక పోయివుండవచ్చు గాక. కానీ భావం ద్వారా నైనా ఆయన హృదంతరాళాల్లోని ఆర్తిని మీరు గ్రహించి వుంటారు. ఎందుకంటే చాలా సందర్భాలలో..మనకు కూడా వర్తిస్తుంది కనుక!


శతకసాహిత్యం సౌజన్యంతో-

కామెంట్‌లు లేవు: