పేపర్ బోట్
------------------------
చదివే పేపర్ అయిపోకూడదనిపిస్తుంది
ఉష్ట్ర పక్షిలా దానిలో తల దూర్చి
ప్రపంచాన్ని మర్చిపోవాలనిపిస్తుంది!
చదవడం పూర్తయ్యాక దాని సమాచారమంతా
మెదడులో చేరి మనసును తొలిచేస్తుంటుంది!
ఈ సమాజం ఏమి మారలేదని
దుర్మార్గులు,దుష్టులు ఎప్పటిలాగే రాజ్యమేలుతున్నారని
బడుగులు,బలహీనులు అణగారి పోతున్నారని
అది ప్రతిరోజు తేట తెల్లం చేస్తుంటుంది!
అంతాబానే ఉందని,ఒకప్పటి రోజులు
ఇప్పుడు లేవని నన్ను నేను నమ్మించుకుంటూ
ఉదయాన్నే తాపీగా,కాఫీతో పాటు పేపర్ తీసుకుంటా!
చదివేకొద్దీ ప్రశాంతమైన సరస్సులో
బండ రాళ్లు వేసినట్టు మనసంతా అల్లకల్లోలమైపోతుంది!
చదవడం పూర్తయి పేపర్ మడిచే సమయానికి
ఎదో ఒక క్రోధం నిలువెల్లా ఆక్రమిస్తుంది!
దాని వెనకాలే ఏమి చేయలేని అశక్తత ఆవరిస్తుంది!
మార్పుకోసం మహోధృతంగా ఉద్యమించిన
యవ్వనకాలమంతా వృధాగా తోస్తుంది!
ఎక్కడవేసిన గొంగడి అక్కడే అంటూ
ఆ పేపర్ ఎగతాళిగా నవ్వుతున్నట్టనిపిస్తుంది!
ప్రపంచంతో అనుసంధానం పెరిగి
ప్రసారమౌతోన్న అపరిమిత జ్ఞానంతో
మరింత గందరగోళం పెరిగి
ఏది నిజమో, ఏది అబద్దమో అర్ధంగాక
ఊర కుక్కలంతా ముట్టడించి మొరుగుతున్నట్టనిపిస్తుంది!
కూర్చున్న కుర్చీలోనే కూరుకుపోతూ
చేష్టలుడిగి భూస్థాపితమైపోతున్నట్టనిపిస్తుంది!
*************
సత్య భాస్కర్ ఆత్కూరు ,9848391638
(సాహిత్య ప్రస్థానం -మే సంచికలో ప్రచురణ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి