2, జూన్ 2024, ఆదివారం

అపర ఏకాదశి

 🌸 *నేడు (జూన్ 02 ఆదివారం) అపర ఏకాదశి సందర్భంగా...* 🌸


*ఏకాదశి వ్రత మహిమ | అపర ఏకాదశీ వృత్తాంతం*


*పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలా వైశాఖ బహుళ ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో 'భద్రకాళి జయంతి'గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటంనుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించినా భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుపుకుంటారు.*


*ఒడిషాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అని అర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని పండితులు చెబుతారు.*


*అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా మరో అర్థం ఉంది. అపర ఏకాదశి రోజు భగవంతుని ఆరాధిస్తే మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందని.. శాస్త్ర వచనం. అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పినట్టు పురాణ వచనం. 'అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగి పోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాడట.*


*ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలంనుంచి ఉపవాసం ఆరంభించాలి. ఏకాదశి. రోజు తలార స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఆచరించాలి. వండిన పదార్థాలను, బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రి వేళ జాగరణ ఉండి, ద్వాదశ ఘడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా, ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు, పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేసినా శుభాలు చేకూరుతాయని పురాణ వచనం.*


*అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ కోసం తూర్పు వైపు ఒక పీటాన్ని ఉంచి దానిపై పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై విష్ణువు, లక్ష్మి విగ్రహాన్ని ఉంచాలి. తరువాత కలశాన్ని ప్రతిష్టించాలి. అనంతరం స్వామికి ధూప దీపం వెలిగించి, పండ్లు, పూలు, తమలపాకులు. కొబ్బరికాయ, లవంగం మొదలైన పూజా సామగ్రిని సమర్పించాలి. ఉపవాసం ఉన్నవారు పసుపు ఆసనంపై కూర్చోవాలి. భక్తులు తమ కుడిచేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి. సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి. లేదా వినాలి.*


🌹🌺🌹 *అపర ఏకాదశీ వృత్తాంతం* 🌹🌺🌹


*శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండపురాణంలో వర్ణించబడింది. దాని మాహాత్మ్య మేమిటి, ఆ వివరాలు నాకు చెప్పవలసింది" అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు.*


*దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. "ధర్మరాజా! నీవు అడిగిన వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా! ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డంబములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, స్వంతశాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైనా ఈ ఏకాదశీ వ్రతపాలనతో నశించిపోతాయి. మోసగాడు, మిథ్యాజ్యోతిష్కుడు, దొంగవైద్యుడు వంటివారు తప్పుడు సాక్ష్యమిచ్చే - వారంతటి పాపాత్ములే అయినప్పటికిని ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమౌతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తియైనా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు”.*


*"రాజా! గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపియైనా కూడ అపర ఏకాదశి పాలన ద్వారా పాపవిముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్రా! కార్తీకమాసంలో పుష్కరతీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకరసంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రివ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాథక్షేత్ర దర్శనఫలం, బదరీనాథ్ క్షేత్ర దర్శనపూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుఱ్ఱములు, గోవులు, సువర్ణం, భూమి మున్నగువాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడ అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది, పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం, ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు, పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది. రాజా! ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు.*


*అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టి ఈ ఏకాదశీ మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాపవిముక్తుడౌతాడు.*

కామెంట్‌లు లేవు: