22, ఆగస్టు 2024, గురువారం

యమున

 *🍁యమున🍁* 

  🦚🌹🌻💜🌈


 *రాత్రి 11 గంటలు. కాబ్ ఆ ఇంటిముందు ఆపి హారన్ కొట్టాడు గోపి..2 నిముషాలు చూసాడు..ఎవ్వరూ బయటకు రాలేదు...అదే చివరి ట్రిప్ ఆ రోజుకి..ఈ ఒక్క బేరం చూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు..ఇంకోసారి హారన్ కొట్టాడు..ఇంకా ఎవ్వరూ రాలేదు..తన దారిన తాను వెళ్ళిపోవచ్చు...కానీ మనసు ఒప్పలేదు..కాబ్ దిగి వెళ్ళి ఇంటి బెల్ కొట్టాడు..వస్తున్నా అని ఒక పెద్దావిడ గొంతు నీరసంగా వినిపించింది...ఏదో నేల మీద లాక్కొస్తున్న శబ్దం తెలిసింది...ఒక నిముషం తర్వాత తలుపు తెరిచింది ఆవిడ.. యమున ఆవిడ పేరు..పాత సినిమా హీరోయిన్ లా ఉంది..అప్రయత్నంగా ఇంట్లోకి చూసాడు గోపి...ఆ ఇంట్లో చాలా రోజుల నుంచి ఎవరూ లేనట్లు ఉంది...గూళ్ళల్లో సామాన్లు ఏవీ లేవు..ఒక పెద్ద అట్టపెట్టెలో ఫొటోలు, గాజు సామాన్లు ఉన్నాయి...యమున పక్కన ఒక సూట్కేస్ ఉంది..దాన్నే అనుకుంటా తలుపు దాక లాక్కొచ్చినట్టుంది ఆవిడ అనుకున్నాడు గోపి...ఈ పెట్టె కార్లో పెట్టు బాబు అంది యమున...పెట్టె కారులో పెట్టి...యమున దగ్గరికి వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకుని నెమ్మదిగా కారు వరకు తీసుకొచ్చాడు...క్షమించు, ఇబ్బంది* *పెడుతున్నట్టున్నాను..అంది యమున....పర్లేదు...మీలాంటి వారిలో నేను మా అమ్మను చూసుకుంటాను, నాకు ఇబ్బంది లేదు...చెప్పాడు గోపీ....కారులో కూర్చోబోతూ సూర్యనారాయణ వీధి వైపు నుంచీ పదా అంది యమున...అటు నుంచీ చాలా దూరం అన్నాడు గోపీ...పర్లేదు నాకేమీ తొందర లేదులే, నిదానంగా వెళ్ళచ్చు అంది యమున..ఆవిడ సమాధానానికి చిన్నగా కోపం, తర్వాత నవ్వు కూడా వచ్చాయి గోపీకి...సరే కానీ అని తనకి తాను సర్దిచెప్పుకుని కాబ్ మీటర్ ఆఫ్ చేసేసాడు గోపీ...కాబ్ నెమ్మదిగా నడుపుతున్నాడు...మారుతీ వీధిలో ఎక్కడికమ్మా మీరు వెళ్ళేది అని అడిగాడు గోపీ యమునని...యమున చెప్పింది..అక్కడ ఒక ధర్మశాల ఉంది , అందులో నాలాంటి అవసానదశలో ఉన్న రోగులు ఉంటారు...అని* *చెప్పింది..గోపీకి అర్ధమయ్యింది ఆవిడ జీవితపు చివరంచుల్లో ఉంది అని...* 


 *బాబూ ఆ సందులోకి కాస్త తిప్పు బాబు అంది యమున కుడివైపు చూపిస్తూ...ఆ సందులోకి వెళ్ళాక నాలుగిళ్ళ తర్వాత ఒక ఇంటి ముందు ఆపమంది...ఆ ఇంటిని ఒక నిముషం తదేకంగా చూసింది...నేను మావారు పెళ్ళైనకొత్తలో ఇక్కడే ఉండేవాళ్ళము...అని గోపీకి చెప్పింది...ఆ ఇంటి పక్కన మేడ పైకి వెళ్ళేందుకు మెట్లు ఉన్నాయి..ఆ మెట్ల మీదకి నన్ను తీసుకెళ్ళు గోపీకి చెప్పింది యమున...కాసేపు గోపీ, యమున ఆ మెట్ల మీద కూర్చున్నారు...ఎదురుగా ఉన్న చీకటిలోకి చూస్తూ మౌనంగా *కాసేపు కూర్చుంది యమున .. బహుశా ఆ మౌనంతో నిశ్శబ్దంగా యమున ఏ కబురులు చెప్పుకుంటోందో, ఏ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోందో మరి.. కాసేపు తర్వాత నెమ్మదిగా మెట్లు దిగి మళ్ళీ కాబ్ లో బయలుదేరారు గోపి, యమున..* 


 *ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక పాత స్కూల్ ముందు నుంచీ కాబ్ వెళుతుంటే ఆ స్కూల్ గేట్ ని ఇష్టంగా చూస్తూ చెప్పింది యమున...చిన్న వయసు నుంచీ, ఓపిక ఉన్నంతవరకూ మొదట్లో జీడీలు , పప్పుచెక్కలు, తరువాత చింతపండు చాక్లెట్లు తయారు చేసి ఈ స్కూల్ గేట్ దగ్గర గట్టు మీద కూర్చుని అమ్మేదాన్ని...ఎన్ని అమాయకపు నవ్వులు నన్ను పలకరించేవో, ఎన్ని పసి చేతులు నా దగ్గర అప్పు పెట్టి మిఠాయిలు తీసుకునేవో, ఎన్ని ముద్దుముద్దు మొహాలు ముచ్చటగా ఒక చేత్తో వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో నాకు టాటాలు చెప్పేవో...పిల్లలు లేని నాకు దేవుడిచ్చిన పిల్లలు ఎంతమందో ఈ స్కూల్ దగ్గర నాకు ప్రేమను పంచి ఇచ్చి గులాబీల జ్ఞాపకాలు ఇచ్చారో అంది యమున తన బాగ్ లోంచీ ఎండిపోయిన కొన్ని గులాబీలను బయటకు తీసి తన గుండెలకు హత్తుకుంటూ....* 


 *ఇంకొంచెం ముందుకెళ్ళాక ఒక చిన్న పార్క్...బాబూ కొంచెం నెమ్మదిగా వెళ్ళు అని చెపుతూనే...ఇక్కడ నేనూ, నా ప్రాణం ఎన్ని సాయంత్రాలు ఈ పార్కులోని పచ్చగడ్డిపై నడుస్తూ కబుర్లు చెప్పుకున్నామో...అలిసిపోయి చెట్టుకింద కూర్చుని బాక్సులో తెచ్చుకున్న పకోడీలు తింటూ పక్కనే తెచ్చిపెట్టుకున్న రేడియోలో చిన్నగా వస్తున్న ఇష్టమైన పాటలు వింటూ మధ్యమధ్యలో ఆ పాటలతో గొంతు కలుపుతూ...ఈ పాట నాకిష్టం అని తానంటే ఇంకో పాట నాకు ఇష్టం అని నేనంటూ...కొన్నిసార్లు వాదనలు చేసుకుని...అలిగి మూతి బిగించుకుని కూర్చుని...నాకున్న తీపి జ్ఞాపకాలు...అంటూ యమున ఆపకుండా చెబుతూ ఉంది...గోపీ వింటూ ఉన్నాడు...* 


 *జీవితపు మంచీ చెడు అనుభవాలతో పండిపోయిన తెల్ల జుట్టూ, నవ్వుకుని ఏడ్చుకుని ముడతలు పడ్డ మొహమూ, అక్కడక్కడా ఉన్న నాలుగు పళ్ళతో ఉన్న సగం బోసినోటితో నవ్వే నిండైన నవ్వూ....ఎంతో అందం, స్థిరమౌన, చెదరని శాంతమైన అందం యమునలో...ఎన్ని చూసిందో మరి ఆవిడ ఈ వయసువరకూ...నాకు తెలీని బతుకునటనమా అన్నట్టు గాంభీర్యంగా , అనారోగ్య భారంతో కుంగిపోయిన శరీరంతో... అన్నిటి కలయికలో...వెలుగూనీడల కలబోతకు అసలైన అర్ధం చెబుతున్న యమునను చూస్తుంటే గోపీకి చాలా బావుంది అనిపించింది...* 


 *తెల్లవారబోతోంది అనే సమయంలో ఆవిడ చెప్పిన ధర్మశాల వచ్చింది...ఇద్దరు వ్యక్తులు ఆవిడ కోసమే అనుకుంటా కాబ్ శబ్దం వినపడినట్టుంది...బయటకి వచ్చారు...యమున కాబ్ లోంచి దిగి వెళ్ళి వారు తెచ్చిన వీల్ చెయిర్ లో కూర్చుంది...పెట్టెను కాబ్ లోంచీ తీసి యమున దగ్గర పెట్టాడు గోపి...ఎంతైంది అడిగింది యమున...ఏమీ వద్దు...చెప్పాడు గోపీ...నువ్వూ బతకాలిగా, డబ్బు వద్దంటే ఎట్లా...అడిగింది యమున...* 

 *వేరే ప్రయాణీకులు ఉన్నారుగా చెప్పాడు గోపీ....* 


 *వెనక్కి తిరిగి వెళ్ళబోతూ యమున వైపు చూసాడు గోపీ....మొత్తం జీవితాన్ని ఒక్క రాత్రిలో తనలో తాను మననం చేసుకుంటూ...ఒక నిండు జీవితాన్ని తనకూ పరిచయం చేసిన యమున తనకు చాలా దగ్గర బంధువు అనిపించింది...కిందకు వంగి వీల్ చెయిర్ లో ఉన్న యమునను దగ్గరకు తీసుకున్నాడు....యమున కూడా గోపీని ఆప్యాయంగా హత్తుకుని...ఒక ముదుసలికి, ఒక వృద్ధ ప్రాణికి నీ వలన ఒక చిన్న ఆనందం కలిగింది, ధన్యవాదాలు బాబు...అంది యమున కళ్ళ నిండా చిన్న తడితో కూడిన నవ్వుతో.....గోపీ ఆవిడ చెయ్యిని పట్టుకుని ...ఇంక వెళతాను అని వీడ్కోలు చెప్పి కాబ్ లో కూర్చుని *బయలుదేరాడు....వెనక నుంచీ తలుపు మూసిన చప్పుడు తెలిసింది గోపీకి....బహుశా ఒక జీవితం ముగిసిపోబోయే సమయం అనుకున్నాడు భారమైన మనస్సుతో గోపీ...* 


 *ఇల్లు చేరి విశ్రాంతి తీసుకుంటూ అనుకున్నాడు గోపీ...ఒకవేళ నిన్న ఆవిడ కోసం కాబ్ లో ఒక కోపిష్టి డ్రయివర్ వెళ్ళుంటే, ఒక అసహనం ఉన్న డ్రయివర్ వెళ్ళుంటే ఏమయ్యుండేదో...ఆవిడ తన అనుభవాలను నెమరువేసుకోగలిగేదా....బహుశా లేదేమో.....అనుకుని....ఊపిరి గట్టిగా పీల్చి వదిలాడు గోపీ....ఎన్నోసార్లు జీవితంలో గొప్ప క్షణాల కోసం వెతుకుతాము....కానీ ఒక్కోసారి ఆ గొప్ప క్షణాలే వెతుక్కుంటూ మనదగ్గరికి వస్తాయి....అలా వచ్చినప్పుడు ఒడిసిపట్టుకోవటమే జీవితం అందించే బహుమతులు అనుకున్నాడు గోపీ....* 


 *#సేకరణ🎣*


🦚🌹🌻💎💜🌈

కామెంట్‌లు లేవు: