18, జనవరి 2025, శనివారం

ప ద్య సౌ ర భ ము

 


ప ద్య సౌ ర భ ము

          -‍చొప్పకట్ల.


జోటీభారతి!యార్భటిన్మెరయుమీ!చోద్యంబుగానేను, క

ర్ణాటాధీశ్వరుఁబ్రౌఢదేవనృపతిన్ ,నాసీరధాటీచమూ

కోటీఘోటక ధట్టికా ఖురపుటీకుట్టాక సంఘట్టనా

స్ఫోటీ ధూతధరారజశ్చుకిళితాంబోధిన్

బ్రశంసించెదన్!


  చాటుపద్యం-


              - శ్రీనాథకవిసార్వభౌముడు!

"దీనారటంకార

లతీర్థమాడించిన,కర్ణాటకసార్వభౌముని, "ప్రౌఢదేవరాయని" ప్రశంసించినపద్యరత్నము.

            రాయలుగొప్పపరాక్రమవంతుడు.,సముద్రమేహద్దుగా విశాలకర్ణాటకము నేలినసార్వభౌముడు.కవిపండితాభిమాని.రాయలఔదార్యమును,అతడుశ్రీనాధునకొనరించిన కనకాభిషేకము ఋజువుపరచినది. మరియతని యవక్రవిక్రమమో?అది పైపద్యము వలన బోధపడుచున్నది.

       తల్లీ!భారతీ నన్నుగ్రహింపుము.ఆసముద్రముద్రిత వసు ధావలయమంతయు నేలు కర్ణాటసార్వభౌముడగు ప్రౌఢదేవరాయని

పరాక్రమును పొగడబోవుచున్నాను.కాన నీవు నావాక్స్థానమున నిలచి"ఆరభటీవృత్తి"తోనన్ననుగ్రహింపుము.అని కవిసార్వభౌముని,వినతి .

        ఈసార్వభౌముడు సముద్రసీమితమైనధరావలయమున కధినాధుడు.

       తన సేనాపరివారములోని గుఱ్ఱములడెక్కలతాకిడికి లేచిన ధరణీపరాగముచే,ఔపోసించినసముద్రముగలవాడు.(అనగా గుర్రములడెక్కలధూళి సముద్రమునుగూడ కనిపించనీయకున్నదనిభావము)

అతిశయోక్తి అలంకారము.

ఆరభటీ వృత్తి!

కఠినపదములకు అర్ధము:

జోటీ-స్త్రీవాచకము, వనితా!

ఆరభటి-ఇదియొకశబ్దవృత్తి,పద్యరచనావిధానమునకఠినమైనపెద్దపెద్దసమాసములతోసాగును,వీర భయానకరసవర్ణనకు ఉపయుక్తము.

చోద్యంబుగా-ఆశ్చర్యకరముగా.

ఆసీర-ఆసముద్రపర్యంతము-సరహద్దు.

ధాటీ -పరుగెత్తు,

చమూ-సైన్యం.

కోటీ -సమూహం.

ఘోటక-గుర్రముల.

ఖురపుటీ-దొప్పలవంటిడెక్కల,

కుట్టాక-కఠినమైన.

సంఘట్టనాస్ఫోటీ-ఒరిపిడివలన.

ధూత-పైకిలేచుచున్న.

ధరారజః-నేలనుండివచ్చినదుమ్ము.

చుకిళిత-పుక్కిలిబట్టుచున్న.(మ్రింగబడుచున్న)

అంబోధిన్-సముద్రుని,

ప్రశంసించెదన్-పొగిడెదను.

                    

                        స్వస్తి!!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: