*యో రుద్రో విశ్వాభువనావివేశ తస్మై రుద్రాయ నమో అస్తు*
ఏ రుద్రుడు సమస్త భువనములందు అంతటా ప్రవేశించి ఉన్నాడో ఆ రుద్రునకు నమస్కారములు(యజుర్వేదం)
పరమేశ్వరుడైన రుద్రుడే అన్ని భువనాలలో, ప్రత్యణువునా వ్యాపించి ఉన్నాడు.
'యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు...' అని ప్రారంభించి సాగే పై మంత్రం 'అగ్ని యందు, జలము లందు, ఓషధులందు' వ్యాపించిన పరమేశ్వరుని ప్రస్తుతించింది.
ఈ తత్త్వమే యజుర్వేదంలోని రుద్రనమక మంత్రాలలో విస్తృతమై కనిపిస్తుంది.
ఈశ్వరచైతన్యం ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. 'వ్యాపించిన ఈశ్వరు'ని విష్ణువు అంటారు. కనుక ఈశ్వరుడే విష్ణువు. ఈ భావమే 'నమో భగవతే రుద్రాయ విష్ణవే' అని శ్రుతి మరొక చోట చెప్పింది. 'శివాయ విష్ణురూపాయ' అనే మాటలోని
ఆంతర్యమిదే. ముజ్జగాలకీ, మూడు గుణాలకీ అతీతమైన బ్రహ్మమే 'శివుడు'. ఆయన విశ్వమందు ఘోర, అఘోర రూపాలతో వ్యాపించి ఉన్నాడు. పంచభూతాలలో,
సూర్యచంద్రాది జ్యోతిర్గణాలలో అనంత విశ్వమందంతటా అనంతంగా వ్యాపించాడు.
ఈ ఘోరాఘోర స్వరూపుడైన శివుడే 'రుద్ర' నామంతో వ్యవహరించబడుతున్నాడు.
జీవుల కర్మలకు అనుగుణంగా ఈ ప్రకృతిలో వ్యాపించిన ఈశ్వరశక్తి సుఖదుఃఖాలుగా లభిస్తుంది. దుఃఖానుభవమే ఘోరం - సుఖానుభవమే అఘోరం. అగ్ని
మేలూ చేస్తుంది - కీడూ కలిగిస్తుంది. ఇలా ప్రకృతిలో ప్రత్యంశంలోనూ ఈ రెండు లక్షణాలు ఉంటాయి. ఈ రెండు లక్షణాలు అనివార్యం. కానీ ఈ రెండు ఒకే ఈశ్వరశక్తి స్వరూపాలేనని గ్రహించడమే 'శివజ్ఞానం'.
రుద్ర శబ్దానికి ఘోరపరమైన అర్థం 'దుఃఖకారకుడు'. ఈశ్వరుడు (ప్రభువు) ధర్మరక్షణ కోసం పాపకర్ములను శిక్షిస్తాడు. అదే పాపానుభవ ప్రదానం. అదేవిధంగా ధర్మపరులను, భక్తులను ఆనందింపజేసే 'శాంతస్వరూపుడు' - ఇది రుద్ర శబ్దానికి అఘోరపరమైన
అర్థం. నిజానికి ఈ శిక్షగానీ - రక్షగానీ జీవుల కర్మానుగుణంగా లభించేదే కానీ-ఆ రుద్రుడు సుఖదుఃఖాలకు అతీతుడైన పరమాత్మ (శివుడు). ఈ రెండు రకాల జీవులను అనుగ్రహించడానికేనని 'శివ' నామ తాత్పర్యం.
'శివుడు రుద్రుడై విష్ణువైనాడు' అనేది చక్కని సమన్వయం. 'త్రిగుణాతీతుడైన పరమాత్మ మంగళస్వరూపుడు (శివుడు) కనుకనే, ఘోర అఘోర రూపాలతో జగతిని శాసిస్తున్న ఈశ్వరుడై (రుద్రుడై), విశ్వమంతా వ్యాపించి (విష్ణువై) నిర్వహిస్తున్నాడు”.
పై రుద్రమంత్రంలో‘వివేశ” శబ్దం - 'ప్రవేశించుట' అనే అర్థంలో ప్రయోగింపబడింది.
విశ్వవ్యాపకుడైన రుద్రుని ఆరాధించడం వల్ల - ఘోర, అఘోర అనుభవాలు కూడా పరిణామంలో 'మంగళం'(శివం)గా లభిస్తాయి. ఇదే శివోపాసన, వేదమతం ప్రకారం
'శివ' 'రుద్ర' 'విష్ణు' శబ్దాలు ఒకే పరమేశ్వరునికి చెందినవి.
పంచభూతాలలో, సూర్యచన్దులలో, క్షేత్రజ్ఞుడైన జీవునిలో ఉన్న ఈశ్వర చైతన్యాన్నే 'అష్టమూర్తులు'గా ఉపాసించాలి. ఈ ఎనిమిది స్వరూపాలు ఈశ్వరుని ప్రత్యక్షమూర్తులు.వీటిలో 'ఘోరాఘోరం'గా ఉన్న రుద్రుడే అష్టమూర్తి స్వరూపుడు. ఈ ఎనిమిది మూర్తులు మనలోనూ, మనచుట్టూ ఉన్న విశ్వంలోనూ వ్యాపించి ఉన్నారు. వారు మనలను
శివ(శుభ) రూపాలుగా అనుగ్రహించాలనీ, తద్వారా శాంతం, సుఖం లభించాలనీ అష్టమూర్తి స్వరూపుడైన ఈశ్వరుని ఆరాధిస్తాం. క్రమంగా 'అంతా ఈశ్వరమయం'
అనే జ్ఞానం (ఈశావాస్యమిదం సర్వం) లభిస్తుంది. అదే శివజ్ఞానం (ఆత్మజ్ఞానం).అంతటా వ్యాపించిన ఆత్మయే శివం. ఘోరాఘోరాలకు అతీతమైన ఆత్మతత్త్వమిది.
దీనిని ప్రకటించడానికై వేదంలో రుద్రమంత్రాలు చెప్పబడినాయి. బ్రహ్మజ్ఞులైనరమణమహర్షి ఈ అంశాన్నే -
'జగత ఈశధీ యుక్త సేవనం
అష్టమూర్తి భృత్ దేవ పూజనం' (ఉపదేశసారం) - అని తెలియజేశారు.
'శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశాన, మహాదేవ, పశుపతి' - ఈ ఎనిమిది
క్రమంగా 'భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు,యజమాని(క్షేత్రజ్ఞుడు)' - అనే ఎనిమిది మూర్తులుగానున్న రుద్రుని నామాలు.
ఇహంలో ఈ ఎనిమిది మనకు అనుకూలంగా ఆనందాన్ని అందించడం లౌకిక ప్రయోజనం. అంతా శివమయం అనేది పారమార్థిక లక్ష్యసిద్ధి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి