🙏 మహాభారతం - శాంతి పర్వం 🙏
మూడవ భాగం
భీముడు మాటలకు కూడా ధర్మరాజు లో ఏమీ మార్పు రానందున అర్జునుడు అందుకుని " ధర్మజా ! నాకు తెలిసిన ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వం కొంత మంది బ్రాహ్మణ బ్రహ్మచారులు తమ కులముకు ఉచితమైన ఆచారములను వదిలి అడవులకు వెళ్ళారు. వారి మీద దయ కలిగిన ఇంద్రుడు ఒక పక్షి రూపంలో వారి వద్దకు వెళ్ళి" మీరు ఎంచుకున్న మార్గం తప్పు " అని చెప్పాడు. ఆ బ్రహ్మచారులు ఆ పక్షిని మహాత్ముడిగా గుర్తెరిగి తమకు తగిన మార్గం ఉపదేశించమని అడిగారు. అప్పుడు పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు ఇలా చెప్పసాగాడు " చతుష్పాదములలో గోవు, శబ్ధములలో మంత్రం, మనుష్యులలో బ్రాహ్మణుడు అత్యంత శ్రేష్టమైన వారని వేదవిదులు చెప్తారు. కనుక బ్రాహ్మణుడు మంత్రోపాసన చేసి తనకు నిర్ధేశించిన కర్మలు చెయ్యడం అతడి కర్తవ్యం. కానీ నిర్లక్ష్యంచేత కాని, కోపంచేత కానీ, శోకంచేత కానీ, తనకు నిర్దేశించిన విద్యుక్త కర్మలను చెయ్యకపోవడం మహాపాతకం. అజ్ఞానులు, అర్ధహీనులు సన్యాసం గురించి తెలియక ఉభయభ్రష్టులు ఔతున్నారు. ఎవరైతే గృహస్థు ధర్మాలను పాటిస్తూ అతిథులను, దేవతలను, పితృదేవతలను సంతృప్తిపరుస్తాడో అతడికి పుణ్యలోకములు అరచేతిలో ఉంటాయి. మంచి కర్మలు చేసి వాటిని బ్రహ్మార్పణం చేస్తే మహదానందం కలుగుతుంది " అని చెప్పాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణ బ్రహ్మచారులు గృహస్థాశ్రమం స్వీకరించి తమతమ విద్యుక్త ధర్మం నిర్వర్తించుటకు వెనుకకు వెళ్ళారు. కాబట్టి ధర్మరాజా ! నీవు నీ రాజ్యమును జనరంజకంగా పాలించు. యజ్ఞ యాగాదులు చేసి పుణ్యలోకాలను సంపాదించు " అని పలికాడు.
తరువాత ధర్మరాజు మనస్థాపం నివారించుటకు నకులుడు ఇలా చెప్పాడు. " అన్నయ్యా ! బ్రాహ్మణులు తమ విద్యుక్త ధర్మమైన యజ్ఞయాగాదులు చేసినపాపము నుండి విముక్తులు ఔతున్నారు. కేవలం యజ్ఞయాగాదులు చేసినందువలన ఏమి ప్రయోజనం ఉంటుంది. ఫలాపేక్ష లేకుండా ధనమును సంపాదించి యజ్ఞయాగాదులు చేసి బ్రాహ్మణులను తృప్తిపరిచిన అది నిస్సంగప్రవృత్తి ఔతుంది కాని మనలోని కామక్రోధాలను, శోకమోహాలను విడిచి పెట్టకుండా అడవులకు పోయి తపస్సు చేసినందువలన ప్రయోజనం ఏమిటి ? అదియును కాక గృహస్థాశ్రమధర్మం, బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసధర్మాలలో గృహస్థాశ్రమం శ్రేష్టమైంది. క్షత్రియులు ధనమును కూడబెట్టి క్రతువులు చెయ్యకపోయిన పాపం వస్తుందని వేదములు చెప్తున్నాయి, గాఢాంధకార బంధురమైన ఈ విశాలవిశ్వానికి వెలుగునిచ్చే ఈశ్వరుడే ఆశ్రమధర్మాలను వర్ణవ్యవస్థను ఏర్పాటు చేసాడు. ఈ యుద్ధం కూడా ఆయన కల్పించినదే ! భగవంతుడు నిర్ణయించిన యుద్ధమున జరిగిన హింసను తలచి నీవిలా శోకించి నీ ఆశ్రమధర్మమును విడుచుట తగునా ! యుద్ధంలో హింస జరిగిందని బాధపడుతున్నావు. మనకు ముందు పాలించినరాజులు యుద్ధములు చేయలేదా వారు ఉత్తమగతులు పొందలేదా ! నీకు ఈ యుద్ధమున ఏమీ పాపం అంటదు. ధర్మాత్ముడవైన నీకు తప్పక ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. క్షత్రియుని పాలనలో ప్రజలు రక్షణ కోరుకుంటారు. ప్రజలు సుఖంగా జీవించడానికి కావలసిన పరిస్థితులను కల్పించడం రాజువిధి. అది నెరవేర్చకపోవడం పాపంకాదా ! దానధర్మాలు చెయ్యడం క్షత్రియధర్మం. అర్హులైన వారికి నీవు దానధర్మాలు చెయ్యాలి. అవన్ని వదిలి నీవిలా అడవులకు పోవడం ఉత్తమధర్మమా ! నీకిది భావ్యమా ! " అని పలికాడు నకులుడు.
తరువాత సహదేవుడు " అన్నయ్యా ! మానవుడు పైపైన ఉన్న కోరికలు విడిచి జీవించిన అది మోక్షకారకం ఔతుందా ! అన్నయ్యా ! నీవు కూడా శారీరక సుఖం వదిలి నీ వంశధర్మములు నిర్వర్తించు. మమత బంధమును కలిగిస్తుంది. మమతను విడిచిన మోక్షం లభిస్తుంది. నీవు అడవులకు వెళ్ళినా ఈ లోకంలోని వస్తువులను, సౌఖ్యాన్ని నీ మనస్సు కోరిన అది నీకు ఉత్తమలోక ప్రాప్తికి ప్రతి బంధకం ఔతుంది. అన్నయ్యా ! నీవు నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, చెలి, చుట్టం. నా మాట విని నీ మనస్సుమార్చుకో. నేను చెప్పింది అబద్ధమో, నిజమో నాకు తెలియదు. నేను భక్తితో పలికిన ఈ మాటలను నీవు కరుణతో విశ్వసించు " అని పలికాడు. నకులసహదేవుల మాటలకు ధర్మరాజు బదులు చెప్పలేదు.
అప్పటి వరకు పెదవి విప్పని ద్రౌపది లేచి ధర్మరాజు వద్దకు వచ్చి " నాధా ! మీరు అనుమతి ఇచ్చిన నాకు తోచినమాటలు చెప్తాను " అని, ధర్మజుని అనుమతితో ఈ విధంగా చెప్పసాగింది. " నాధా ! మనం ఆడవులలో ఉన్నకాలాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అరణ్య అజ్ఞాతవాసాలు ముగియగానే సుయోధనుడిని చంపి మన రాజ్యసంపదలను తిరిగి కైవశం చేసుకుంటామని మీరు మీ తమ్ములకు నచ్చచెప్ప లేదా ! చెప్పినట్లు రాజ్యాన్ని కైవశం చేసుకుని ఇప్పుడిలా మాటతప్పి రాజ్యత్యాగం చేసి అడవులకు పోతానని చెప్పడం ధర్మమా ! ధర్మం సత్యం వ్రతముగా పెట్టుకున్న మీకు ఈ విధంగా పలకడం న్యాయమా ! రాజు ఎప్పుడూ పేదమనసుతో ఉండ కూడదు. రాజు తన రాజ్యమును, ప్రజలను రక్షించాలి, దుర్మార్గులను నిర్ధయగా శిక్షించి సన్మార్గులను దయతో రక్షించాలి. బ్రహ్మదేవుడు లోకాన్ని రక్షించడానికే క్షత్రియ కులాన్ని సృష్టించాడు. రాజు మనుష్యరూపంలో ఉన్న దేవుడు. అలాంటి రాజు చేతకాని వాడైన దుర్మార్గులు విజృంభిస్తారు. రాజునందు దేవుడు రాజనీతిని ప్రతిష్ఠించాడు. అపరాధులను శిక్షించడం రాజధర్మం దానిని నెరవేర్చిన ఇహపరములు సిద్దిస్తాయి. తప్పు చేసిన బ్రాహ్మణుడి నయినా రాజు శిక్షించడమే రాజధర్మం. ఇప్పుడు నీవు అదే రాజధర్మాన్ని నిర్వర్తించావు. రజస్వలను, ఏకవస్త్రను అయిన నన్ను సభకు ఈడ్చి వలువలు ఊడదీసి, తొడచూపి అవమానించిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణులను నీవు ఒక రాజుగా శిక్షించావు. అది పాపంకాదు కనుక నీవు చింతించ పనిలేదు. విషప్రయోగం చేసిన వారిని, గృహదహనం చేసిన వారిని, రాజకీయ రహస్యములను బహిరంగపరచిన వాళ్ళను, హంతకులను, పరసతిని కోరిన వారిని, బందువులను చంపిన వాడిని శిక్షించడం రాజధర్మం. అది పుణ్యకార్యం. దండించ వలసిన వారిని దండించక పోవడం మహాపాపం. రాజు దండనీతిని అవలంబించడం పేదలకు, సాధువులకు, తాపసులకు మేలుచేస్తుంది. వారికి రక్షణ కలిగిస్తుంది, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్య వలసిన రాజు బ్రాహ్మణుల వలె ఇంద్రియనిగ్రహం పాటించడం ధర్మమా ! కనుక నీ మనసులోని శంకను తొలగించు. నాధా ! నా మాదిరి జీవితంలో కష్టపడిన వారు ఉన్నారా ! కాని నేను అన్నీ మరచి గృహస్థు ధర్మాలను విడువక నిర్వర్తించడం లేదా ! కౌరవులు వారి గోతిని వారే తవ్వుకున్నారు. వారిపాపం వారే అనుభవించారు. అందుకు మీరు బాధపడటం ఎందుకు. కనుక మీరు రాజ్యభారం వహించి ప్రజలను జనరంజకంగా పాలించండి. మీకు తెలియని యుద్ధనీతి లేదు. పూర్వం బృహస్పతి, శుక్రుడు యుద్ధనీతిని లోకానికి తెలిపారు. ఆ నీతిని కూలంకుషంగా అభ్యసించిన మీరు ఈ రాజ్యాన్ని పాలించుట ధర్మం " అని చెప్పింది.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి