☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(54వ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*భక్త అంబరీషుడి చరిత్ర*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*సప్తద్వీపాలతో భూమండలం అంతటికీ అంబరీషుడు ప్రభువైనప్పటికీ రాజ్యభోగాలను అతను ఆశించలేదు. ఐహిక సుఖాలను తృణప్రాయంగా త్యజించాడు. హరిస్మరణ తప్ప అంబరీషునికి మరొక ధ్యాసే ఉండేది కాదు. హరిని పూజిస్తూ, హరికథలు వింటూ హరిభక్తులను పూజించడమే అతని దినచర్య అయింది. హరికి ఇష్టమైన వ్రతాలూ, దానధర్మాలూ ఎన్నో చేశాడు అంబరీషుడు. చేసిన ఆ వ్రతాలూ, దానధర్మాల్లో ఏమాత్రం స్వార్ధచింతనను కనబరిచేవాడు కాదు. అతనికి ఏకాదశీవ్రతం అంటే మహా ఇష్టం. ఏకాదశినాడు ఉపవాసం చేయడం, హరిని మనసారా పూజించడం, ద్వాదశినాడు హరిభక్తులకు అన్నదానం చేయడం అంబరీషునికి పరిపాటి.*
*అతన్ని అన్ని విధాలా అనుసరించేది భార్య. ఆమె మహాపతివ్రత. హరిని అనుక్షణం ఆరాధించేదామె.*
*అంబరీషుని భక్తిని మెచ్చుకున్నాడు శ్రీహరి. అతనికి భీతరక్షణమూ, శత్రుశిక్షణమూ చేసే సుదర్శన చక్రాన్ని బహూకరించాడు. అంబరీషుడు సతీసమేతంగా ద్వాదశీవ్రతాన్ని ఆచరిస్తూ ఏడాది పాటు మహానిష్ఠ చేపట్టాడు. వ్రతం ముగిసింది. ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి తరువాత తన ప్రజలందరికీ అన్నదానం చేయాలి. ఉపవాస దీక్ష కొద్ది గడియల్లో ముగియనుండగా దుర్వాసుడు అక్కడికి విచ్చేశాడు.*
*దుర్వాసమహాముని సంగతి తెలిసిందే! అతను మహాకోపిష్టి. ఏ చిన్న తప్పు జరిగినా క్షమించడు. శపిస్తాడు. దుర్వాసుణ్ణి చూస్తూనే విస్తరి ముందు లేచి నిల్చున్నాడు అంబరీషుడు. అతనికి ఎదురేగి అర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. భోజనం చేయమని ప్రార్థించాడతన్ని. సరేనన్నాడు దుర్వాసుడు. యమునానదికి వెళ్ళి వస్తానన్నాడు. వెళ్ళిపోయాడక్కణ్ణుంచి.*
*యమునాతీరానికి చేరుకున్న దుర్వాసుడు, మాధ్యాహ్నికక్రియలు ఆచరించి, ఆ తర్వాత ధ్యానంలో నిమగ్నమయిపోయాడు. యమునానదికి వెళ్ళిన మహర్షి ఎంతకీ రాకపోయేసరికి ఆందోళన చెందాడు అంబరీషుడు. ద్వాదశఘడియలు వెళ్ళిపోతున్నాయి. ఆ ఘడియల్లోనే తను భోజనం చెయ్యాలి. చేయకపోతే వ్రతఫలితం దక్కదు. ఫలితం కోసం భోజనం చేస్తే, భోజనానికి పిలిచి, మహాముని భోజనం చేయకుండా తను చేయడం తప్పు. పాపం కూడా. ఏం చేయాలో పాలుపోలేదు అంబరీషునికి. బాగా ఆలోచించాడు. చివరకి ధర్మచ్యుతి కలగకుండా నీరు తాగి, ముని రాకకోసం నిరీక్షించసాగాడు.*
*దుర్వాసుడు వచ్చాడప్పుడు. వస్తూనే అంబరీషుడు నీరు తాగి కడుపు నింపుకున్నాడని తెలుసుకున్నాడు. భోజనానికి పిలిచి, తను రాకుండానే నీరు తాగాడని, తనని అవమానించాడని ఆగ్రహించాడు.‘‘అతిథిని అవమానించినందుకు తగిన శిక్ష అనుభవించు.’’ అన్నాడు దుర్వాసుడు.*
*తన జడను ఒకదాన్ని పెరికి, దానిని అంబరీషునిపై ప్రయోగించాడు. జడ జ్వాలారూపాన్ని ధరించి, అంబరీషుని దహించేందుకు ముందుకు ఉరికింది. చేసేది లేక హరిధ్యానంలో మునిగిపోయాడు అంబరీషుడు. అతన్ని రక్షించేందుకు అగ్నిజ్వాలను ఎదుర్కొన్నది సుదర్శనచక్రం. నిర్మూలించింది దానిని. తర్వాత దుర్వాసుణ్ణి సంహరించేందుకు అతని మీదికి దూసుకు వెళ్ళింది. ప్రాణాన్ని కాపాడుకోవడానికి నలుదిక్కులా పరుగుదీశాడు దుర్వాసుడు. అతను ఎటు పరుగుదీస్తే అటుగా వెంటాడసాగింది చక్రాయుధం. ముల్లోకాలూ తిరిగాడు దుర్వాసుడు. అతన్ని వదలిపెట్టలేదు చక్రం. దిక్పాలకుల్ని వేడుకున్నాడు. చక్రాయుధం నుండి తనని రక్షించమన్నాడు దుర్వాసుడు. తమ వల్ల కాదన్నారు వారు. బ్రహ్మను ఆశ్రయించాడు. శివుణ్ణి ఆశ్రయించాడు. చక్రాయుధాన్ని ఆపడం తమ వల్ల కాదన్నారు వారు. ఆఖరికి శ్రీహరినే ఆశ్రయించాడు దుర్వాసుడు. రక్షించమని చేతులు జోడించాడు.*
*‘‘మహర్షీ! నేను భక్తపరాధీనుణ్ణి. నాకంటే నా భక్తులే బాగా ప్రభావాన్ని కలిగి ఉంటారు. నిన్ను కాపాడగలిగేది నా భక్తుడేకాని నేను కాదు. నువ్వు అంబరీషుణ్ణే శరణు వేడుకో! ఆ భాగవతోత్తముడే నిన్ను కాపాడతాడు.’’ అన్నాడు శ్రీహరి.*
*దుర్వాసుడు వెనుతిరిగాడు. అంబరీషుణ్ణి ఆశ్రయించాడు. తన అపచారాన్ని మన్నించమన్నాడు. అంబరీషుడు చక్రాయుధాన్ని అనేక విధాల స్తుతించాడు. మహామునిని కాపాడమని ప్రార్థించాడు. శాంతించింది చక్రాయుధం. దుర్వాసుణ్ణి విడిచిపెట్టింది.*
*ఊపిరి పీల్చుకున్న దుర్వాసుణ్ణి భోజనానికి ఆహ్వానించాడు అంబరీషుడు. అతనికి భోజనం పెట్టి నమస్కరించాడు.*
*(తర్వాత కథ రేపు)*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి