18, ఫిబ్రవరి 2025, మంగళవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*వెనుకటి శ్లోకం లో శంకరులుతన మనస్సు ను  శివుణ్ణి తన అధీనంలోకి తీసికోమని కోరారు. ఈ శ్లోకంలో తన మనస్సు , గుడ్డతో నిర్మించిన డేరా వలె మంచి వాస యోగ్యమైనదని, దానిలో ప్రమథ గణములు సేవిస్తుండగా అమ్మ పార్వతి తోపాటు నివాసం ఉండుమని ఈశ్వరుని ప్రార్థించారు.*


*శ్లోకం : 21*


*ధృతి స్తంభాధారాం _ దృఢ గుణ నిబద్ధాం సగమనాం*

                        

*విచిత్రాం పద్మాఢ్యాం _ ప్రతి దివస సన్మార్గ ఘటితామ్,*

                        

*స్మరారే ! మచ్చేత _ స్స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం*

                        

*జయ స్వామిన్ ! శక్త్యా  _  సహశవగణైస్సేవిత విభో !!*


*పదవిభాగం  :~*


*ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం _ సగమనాం _ విచిత్రాం _ పద్మాఢ్యాం _ ప్రతిదివస సన్మార్గ ఘటితామ్ _ స్మరారే మచ్చేతస్స్ఫుట పటకుటీం _ ప్రాప్య  _ విశదామ్ _ జయ _ స్వామిన్ _ శక్త్యా _ సహ _ శివగణైః _ సేవిత _ విభో.*


*తాత్పర్యం :~*


*ఈ శ్లోకంలో మనస్సు పటకుటీరముతో (గుడ్డ డేరాతో) పోల్బబడింది.*


*ఓ మదనాంతకా ! శివా ! ధైర్యము అనే స్తంభము ఆధారంగా గలదియూ, స్థిరములైన త్రాళ్ళచే కట్టబడినదియూ, ఎక్కడికైననూ పోవునదియూ (ఎక్కడికైనా తీసికొని పోవడానికి వీలయినదియూ), ఆశ్చర్యకరమైనదియూ, చిత్ర వర్ణములతో కూడినట్టిదియూ , పద్మమువలె సుందరమైనదియూ (పద్మాకార చిత్రములచే సుందరమైనదియూ),  ప్రతి దినమున ఉత్తమ మార్గమున ఉంచబడునదియూ ( యోగ్యమైన విధమున ఏర్పరుపబడినదియూ) అయిన నా చిత్తము అనే స్ఫుటమైన డేరాలో ప్రవేశించి , ప్రమథగణ సేవితుడవైన ప్రభూ ! దేవా ! శక్తి యైన పార్వతీ దేవితో కలిసి నివసించి యుండుము. నా చిత్తము అనే డేరా, నీవు నివసించడానికి సుఖకరంగా ఉంటుంది. కాబట్టి గణసేవితుడవై , పార్వతితో కలసి, అందు నివసింపుము.*


*వివరణ :~*


*మన్మథుణ్ణి జయించి, సర్వ స్వతంత్రుడవై, పరమానంద స్వరూపుడవైన ఓ పార్వతీవల్లభా  ! నా చిత్తమిపుడు ఒక గుడారంలా వుంది. అది ఎల్లాగంటే , గుడారము ఒక నిట్రాడు కొయ్యపై నిలచియుంటుంది కదా! అలాగే నా చిత్తము అనే కుటీరం కూడా, విషయ నిత్యత్వావధారణము అనే నిట్రాడుపై నిలచియుంది.*


*గుడారము త్రాళ్ళతో బిగించి నిలుపబడుతుంది. చిత్తము కూడా ,సత్త్వ రజః, తమో గుణములవల్ల పుట్టిన దేహాదులతో నిలుపబడి యుంది. గుడారమును ఎక్కడికి కావలసింటే అక్కడికి తీసికొని పోవచ్చు. అలాగే చిత్తము అక్కడక్కడికి పోతూ వుంటుంది. గుడారము అనేక రంగులు కలిగి , పద్మములవంటి చిత్రములను కలిగి , మంచి రాజమార్గములందు అమర్చబడి యుంటుంది.  అలాగే చిత్తము కూడా నానా విధములైన జన్మాంతర దుర్వాసనలతో కూడి సంపదను కోరుతుంది. చిత్తము బ్రహ్మ విచారమునందు నిమగ్నమై ఉంటుంది . ఇటువంటి తన చిత్తము అనే కుటీరంలో శక్తితోపాటు నిలచి యుండమని శంకరులు శివుణ్ణి ప్రార్థించారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: