🙏మహాకవి భారవి 🙏
మొదటి భాగము
మహాకవి భారవిచే రచింపబడిన ప్రసిద్ధ శ్లోకం యొక్క వృత్తాంతం చూద్దాము. తరువాత భాగాల్లో అతని కాలము కావ్యాలు పరిశీద్దాము
సహసా విదధీత న క్రియా మవివేకః పరమపదాం పదమ్
వృణుతే హి నిమృశ్యకారిణో గుణ లుబ్ధా: స్వయమేవ సంపదః
అర్ధం
తొందరపడి ఏ పనీ చేయకూడదు. అవివేకమున్నచోట ఆపదలు కాపురముంటాయి.
సంపదలకు సుగుణాలంటే యిష్టం.కనుక ఆలోచించి పనులు చేసేవారిని స్వయంగా సంపదలు వరిస్తాయి. అని దాన్ని భావం.ఈ శ్లోకం వెనుక ఒక కథవున్నది.
భారవి మహా కవి. చిన్నప్పటినుంచే కవిత్వం వ్రాస్తూ కొన్ని గ్రంథాలు రచించాడు.ఊళ్లోని వాళ్ళందరూ భారవి తండ్రితో నీ కొడుకు మహాఘటికుడయ్యా.చాలా మంచి కవిత్వం వ్రాస్తున్నాడు అనేవారు.
అలాగ వాళ్ళన్నప్పుడు భారవి తండ్రి వాడింకా చిన్నవాడు.వాడికేమి తెలుసు?ఇంకా నేర్చుకోవాలిసినది చాలావుంది. అనేవాడు. నలుగురు తనను మెచ్చుకుంటూ ఉంటే తండ్రి మాత్రం వాడికేమీ తెలియదు చిన్నవాడు అనడం భారవికేమాత్రం నచ్చలేదు.తనను మెచ్చుకోక పోగా తేలికగా తీసి పారెయ్యడం చాలా చిన్నతనంగా భావించాడు.
రోజు రోజుకూ తండ్రి మీద కోపం పెరిగి కసిగా మారింది. తండ్రి నెలాగైనా చంపాలనుకుని, రాత్రి ఆయన వంటింటిలో భోజనం చేస్తుండగా పెరట్లో ఒక పెద్ద రాయితో కాచుకొని కూర్చున్నాడు చెయ్యి కడుక్కుందుకు పెరట్లోకి వస్తే తండ్రిని ఆ బండతో కొట్టి చంపెయ్యాలనుకున్నాడు. భారవి తల్లి భర్తకు వడ్డిస్తూ ఎందుకండీ మీరు అందరిముందూ వాడిని చిన్నబుచ్చి మాట్లాడుతారట.వాడు అంతబాగా కవిత్వం వ్రాస్తూంటే మెచ్చుకోకపోగా వాడికేమీ తెలియదని అంటున్నారట. వాడు చాలా బాధపడుతున్నాడు. అని అంటూంది. దానికి భారవి తండ్రి నవ్వి పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?పిల్లలను తండ్రి పొగిడితే వాళ్లకి ఆయుక్షీణమంటారు.పైగా నేనుకూడా పొగిడితే వాడికి తనకన్నీ తెలుసనీ గర్వము వచ్చేస్తుంది.అది వాడి అభివృద్ధికి మంచిది కాదు.అని అంటున్నాడు. వారి సంభాషణ విన్న భారవి తాను చేయబోయిన పని తలుచుకుంటే సిగ్గేసింది ఇలాటి తండ్రినా తాను చంపాలనుకుంది అని పశ్చాత్త్తాపం తో రగిలి పోయాడు.వెంటనే ఆ బండరాయిని అక్కడే పడవేసి,తండ్రిదగ్గరికి వెళ్లి తనను క్షమించమని కాళ్ళమీద పడ్డాడు.తాను చేయబోయిన పనికి తనకు ఏదైనా శిక్ష వెయ్యమని ప్రాధేయ పడ్డాడు.తండ్రి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం వేరే లేదు పరవాలేదులే యని ఊరడించాడు. లేదు నాన్నగారూ నాకు శిక్ష పడి తీరవలిసిందే. అని పట్టు బట్టాడు.
అప్పుడు తండ్రి సరే అయితే నీ భార్య పుట్టింట్లో వుంది కదా! నీవు అక్కడికి వెళ్లి ఎవరికీ
నీ భార్యకు కూడా ఏమీ చెప్పకుండా ఆరునెలు వుండి రా అదే నీకు శిక్ష అన్నాడు.
ఇంత చిన్న శిక్షనా? అని అడిగాడు. ఆయన నవ్వి అది చాలులే వెళ్ళు అన్నాడు.
భారవి కవి తన తండ్రి తనకు వేసిన శిక్ష ప్రకారం
అత్తవారింట్లో ఆరునెలలుండడానికి వెళ్ళాడు. అక్కడ అత్తవారింట్లో కొన్నాళ్ళు అల్లుడు వచ్చాడని రోజుకొక రకం పిండివంట చేసి పెట్టారు. ఎన్నాళ్ళకీ అల్లుడు కదలక పోయేసరికి అన్ని మర్యాదలూ పోయి పొలం పనులకు కూడా పంపేవారు.భారవి అవమానాలన్నీ భరిస్తూ వుండి పోయాడు. ఇంతలో శ్రావణమాసం వచ్చింది. భారవి భార్య
మంగళగౌరీ వ్రతం చేసుకుందా మని వ్రతానికి కావాల్సిన సరుకులకు తల్లినడిగింది.
తల్లి ఈసడింపుగా నీమొగుడు ఒక మహాకవి గదా! సరుకులకు డబ్బులిమ్మని ఆయన్నే అడుగు అని అంది.ఆమె బాధపడుతూ భర్తతో ఆ విషయము చెప్పింది. భారవి బాధపడి
ఒక తాటాకుమీద పై శ్లోకం వ్రాసి యిది నేనిచ్చానని అంగడివానికిచ్చి సరుకులు తెచ్చుకోమని చెప్పాడు. ఆమె ఆశ్లోకం ఆ వర్తకుడికిచ్చింది. అతను బాగా చదువుకున్నవాడు. ఆ శ్లోకం చదివి సంతోషించి కావలిసిన సరుకులిచ్చి పంపాడు.ఆ తాటాకును పటము కట్టి గోడకు తగిలించుకున్నాడు.
తరువాత కొన్నాళ్ళకు ఆ వర్తకుడు వాణిజ్యం చేయుటకు విదేశాలకు వెళ్ళాడు.అప్పుడు
అతనికి 12 ఏళ్ళ కొడుకున్నాడు. విదేశాలకు వెళ్లి 5 ,6 ఏళ్లకు తిరిగి వచ్చాడు. అతను వచ్చేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. భార్యను లేపడమెందుకని పెరటివైపు గోడ దూకి యింట్లోకి ప్రవేశించాడు.
గదిలోకి వెళ్లి చూసేసరికి తనభార్య పక్కన ఒక యువకుడు పడుకొని ఉండడం చూశాడు. నేను లేకపోయే సరికి యిది ఎవరినో బాగా మరిగింది అనుకొని మొలలో వున్న కత్తి తీసి భార్యను పొడవబోయాడు. ఆకత్తి గోడనున్న పటానికి తగిలింది. అప్పుడు అతను ఆ శ్లోకం చదివి తొందరపడకూడదని కత్తి మొలలో దోపి
భార్యను లేపాడు. ఆమె లేచి భర్తను చూసి ఆశ్చర్య పోయింది.
ఇతడెవరని ఆ యువకుని చూపించి అడిగాడుఆ వర్తకుడు . దానికి ఆమె మన కుమారుడే నండీ రాత్రి కొంచెం సుస్తీ చేస్తే మందు రాస్తూ యిక్కడే పడుకుండి పోయాను అన్నది.
అతడు తప్పిన ప్రమాదానికి సంతోషించి భారవి వ్రాసి యిచ్చిన శ్లోక వల్ల కదా యింత ప్రమాదం తప్పిందనుకొని భారవిని అపార ధనరాసులతో సత్కరించాడు.
భారవి తన తండ్రి పెట్టిన గడువు పూర్తయినందున అత్తవారి దగ్గర సెలవు తీసుకొని, భార్యతోనూ,తనకు లభించిన అపారసంపదతోనూ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.త్వరలోనే దేశమంతా ఆ శ్లోకమున్న కిరాతార్జునీయమనే కావ్యముద్వారా అతనిని మహాకవిగా గుర్తించింది.
అది భారవి పేర పంచమహా కావ్యాల్లో నాల్గవదిగా గుర్తింపు పొందింది.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి