31, జులై 2020, శుక్రవారం

ప్రైవేటు బడిపంతులు

బ్రతుకు పోరాటంలో
       ప్రైవేటు బడిపంతులు
               *   *     *
కరోనా !
వేశావు
ప్రైవేటుపై విషపు కాటు
చేశావు
అక్షరాన్నినడ్డివిరిచి
నడిరోడ్డు చేటు !
దశాబ్దాల అనుభవముంటేనేమి
ఆత్మాభిమానంతోనే
బ్రతుకుతున్నారు
అరిగిన చెప్పుల్లోనైనా !
బాలల విద్యా తోటమాలియై
విజ్ఞాన భాండాగారమై
శక్తి కణాలను
ఒక్కొక్కటిగా దానం చేసి
నిస్సహాయకులై
రోజు కూలీలయ్యారు !
ఓనమాలు
దిద్దించే బ్రతుకు
చితికి పోతుండె
ఆహారన్వేషణలో !
ముద్దకోసం
తడిసి ముద్దయిపోతుండే
అక్షరాలు
చెమట చుక్కల్లో !
పరుషాలు నేర్పడమే కానీ
పరుషంగా
మాట్లాడనేరడు
నీతి శతకాలు
బోధనయే కానీ
అవినీతి
చేయనెరుగడు !
అక్షర కిరణాలతో
అజ్ఞానంధకారాన్ని
పారద్రోలు -గురువు !
అందలేని దానికై
ఆరాటపడక
పొందలేని వాటికై
ప్రాకులాడక
అందిన దానితో ఆనందిస్తూ...
పొందిన వాటితో పరవసిస్తూ...
ఆకాశమంత విశాల చీకటిలో
మిణుగురంత ఆశతో
బ్రతుకీడుస్తున్న
ఓ దివ్వె-గురువు !
ఎడారి జీవితంలో
అవకాశాలు
ఎండమావులైనా....
కన్నీళ్ళు ఒడిసిపట్టి
కుటుంబ దాహార్తిని తీర్చే
ఒయాసిస్సు -గురువు !
పూలమ్మిన చోటే
కట్టెలమ్మే పరిస్థితి
సర్కారైనా ఏకాక్షితో
ఓరచూపు చూడని దుస్థితి !
''విద్వాన్ సర్వత్రా పూజ్యతే''
నేటి కరోనావస్థలో
బరువులు మోస్తున్న
గురువు శోకాన్ని చూసి
శ్లోకాన్ని సవరించుకుంటున్నాయి
పురాణాలు !
నల్లబల్లపై
తెల్లని వర్ణాలు వ్రాసేటి
శిధిల సౌధం తెల్లని జీవితంలో
అలుముకున్నాయి
నల్లనిచ్ఛాయలు !
నిత్య కృత్య భూభ్రమణంలో
పాఠశాల చుట్టూ సాగిన
పరిభ్రమణం
అక్షరాలు అక్షం మారి
ప్లూటో గ్రహాలయ్యాయి !
తప్పించేదెవరు ఈ ఘోరం
భగవంతునికి తప్పదు భారం !!

కామెంట్‌లు లేవు: