30, ఆగస్టు 2020, ఆదివారం

అర్థం చేసుకోరూ...


‘బుజ్జి కుక్కపిల్లలు అమ్మబడును’ అని రాసి ఉన్న తోట వద్దకు వచ్చాడొక బాలుడు. చెంగుచెంగున ఆడుతూ ఎంతో ముద్దొస్తున్న పప్పీలను చూశాడు. ఒకటి కుంటిది. కాలు ఈడుస్తూ వస్తోంది. ‘అదే కావాలి’ అన్నాడు పిల్లాడు. అమ్మకందారుడు ఆశ్చర్యపోయాడు. ‘సరిగ్గా నడవలేదు, నీతో సమానంగా పరుగెత్తలేదు. మంచిదాన్ని తీసుకో’ అని సలహా ఇచ్చాడు. పిల్లవాడు నవ్వాడు. పంట్లాం పైకి లాగి తన కాలు చూపించాడు. అది కర్రకాలు. ‘కుంటిదానితోనే నేను బాగా ఆడుకోగలను, దాన్ని నేనే చక్కగా అర్థం చేసుకోగలను, అదే ఇవ్వండి’ అన్నాడు. ఒక ఆంగ్లకథ సారాంశమిది. ‘అర్థం చేసుకోవడం’ అనే పదానికి భాష్యమది. అర్థం చేసుకోవడం తెలిస్తే ఈ ప్రపంచంతో అందమైన సయోధ్య కుదురుతుందని బోధించే గొప్ప పాఠమది. ‘గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో’ అన్న దాశరథి కంటితడిని ఆ బాలుడు తన పలుకుల్లో పరిచయం చేశాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోవడమనే మాట ఒక వేదమంత్రం. అది ఆనందానికి అసలు సూత్రం. పెళ్ళి మంత్రాల్లోని ‘సఖ్యం’ అనే మాటకు తాత్పర్యం అదే. కొన్నిసార్లు కలతలు రావచ్ఛు అపార్థాలు ఏర్పడవచ్ఛు ‘కలసినయంత మాత్రమున కాదు సుమీ చెలికారము! అంతరంబులను అతుకంగ జాలిన అపూర్వపు లంకెయె స్నేహమౌ...’ అని రాయప్రోలు అన్నట్లుగా, సఖ్యం స్నేహం ప్రేమ వంటి దీప వికాసాలకు అర్థం చేసుకోవడమే సరైన ఇంధనం. ఇద్దరి మధ్య చక్కని అవగాహనే సంసార రథానికి ఇరుసు. చక్రాలను సజావుగా నడిపే కందెన.
‘ఆడ మనసును అర్థం చేసుకోవడం కష్టం’ అనేది చాలామంది అభిప్రాయం. ద్రాక్షాపాకం కదళి(అరటిపండు) పాకంలా కాదు...’ నారికేళ పాకము సుమీ! కామినీ హృదయ కావ్యరస గ్రహణంబు...’ దింపు తీసి డొక్క వలిచి టెంక చీల్చి కొబ్బరిముక్కను తిన్నంత కష్టం అన్నారు కవులు. శృంగార పటిమ కాదు, స్త్రీని అర్థం చేసుకోవడమే అసలైన మగతనం. తనతో అడవికి రావద్దని రాముడు శతవిధాల వారిస్తుంటే, సీతమ్మ వంటి సాధ్వి ‘నీవు మగాడివి అనుకొన్నాడే నా తండ్రి’ అంది. ఎదురయ్యే ప్రమాదాల వర్ణన కాదు, వాటినుంచి కాపాడగల మగటిమిని రాముడినుంచి ఆశించిందామె. సరుకులంటే నగలు. ‘సరుకులేమి కావాలే ఎలుతురు పిట్టా?’ అని అడిగితే ‘మరమ మిడిసి మనసునివ్వు నాయుడు బావా’ అంది యెంకి. పురాణ మహిళలు, జానపద స్త్రీలు అందరూ నిర్మలమైన మనసు కోరుకుంటారు. వారికి కావలసినవి కానుకల ధరలు కావు- వాటితో పెనవేసుకొనే జ్ఞాపకాల విలువలు. ఆడతనాన్ని అందలం ఎక్కించే మగతనం కావాలి వారికి. దీన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది పొరపడతారు, తడబడతారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏణ్నర్ధం క్రితం పెళ్ళాడిన భార్యపై ఆమె భర్త అలవికానంత ప్రేమను ఒలకబోస్తూ వచ్చాడు. ఇంటిపనీ వంటపనీ మొత్తం తానే చక్కబెట్టేస్తూ వచ్చాడు. భార్యలా కాకుండా మరీ దేవతలా చూస్తూ వచ్చేసరికి ఆమెకు విసుగెత్తి విడాకుల కోసం కోర్టుకెక్కింది. ‘అరవడు కరవడు నన్నెప్పుడూ కొట్టడు తిట్టడు ఆఖరికి ఏదైనా తప్పు చేసినా నన్ను ఏమీ అనడు... నేనింక ఎవరితో పోట్లాడాలి?’ అని న్యాయమూర్తి ముందు వాపోయిందావిడ. మొగుడు మొగలి పొత్తులా ఉండాలి గాని మల్లెపూవులా ఉంటే ఎలా... అనేది ఆమె ఆవేదన. హాస్యంగా కాదు, ఒక ఆధునిక యువతి ఆంతర్యంగా అర్థం చేసుకోవాలి దాన్ని. ఆమెకు కావలసింది బానిస కాదు, నికార్సయిన భర్త. మొగుడు మగాడిలాగే ఉండాలి, భార్య మనసును అర్థం చేసుకొంటూ!
******************

కామెంట్‌లు లేవు: