28, నవంబర్ 2020, శనివారం

శ్రీ శివ మహాపురాణం - 14 వ అధ్యాయం*

 _*శ్రీ శివ మహాపురాణం - 14 వ అధ్యాయం*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*మూడు యజ్ఞములు - ఏడు వారములు*




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




*ఋషులు ఇట్లు పలికిరి -*


ఓ మహానుభావా! అగ్ని యజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మ యజ్ఞములను, గురుపూజను, బ్రహ్మ తృప్తిని గురించి మాకు క్రమముగా వివరింపుము.


*సూతుడిట్లు పలికెను*


అగ్ని యందు హోమద్రవ్యమును సమర్పించే కర్మకు అగ్ని యజ్ఞమని పేరు. ఓ ద్విజులారా! బ్రహ్మ చర్యము అనే మొదటి ఆశ్రమము నందు ఉండువారు అగ్ని యందు సమిధలను హోమము చేయవలెను . వ్రతములను పాలించవలెను. గృహస్థాశ్రమమును స్వీకరించి, ఔపాసన కర్మను చేయునంతవరకు విశేష యజ్ఞములను చేయవలెను . ఓ ద్విజులారా! ఆత్మ యందు ఆవాహన చేయబడిన అగ్నులు గల వాసప్రస్థులకు, యతులకు హితకరము, పవిత్రమునగు ఆహారమును మితముగా సకాలములో భుజించుటయే అగ్ని యజ్ఞము అగును . ఔపాసనాగ్నిని స్థాపించిన నాటి నుండి ఒక భాండములో గాని, గర్తములో గాని ఆరిపోకుండా సురక్షితముగా నుంచినచో, దానికి అజస్రము అని పేరు .


రాజ భయము వలన గాని, దైవము ప్రతికూలమగుట వలన గాని, అగ్నిని సంరక్షించలేని పరిస్థితిలోఆత్మ యందు, లేక అరణి యందు న్యాసము చేయబడిన అగ్నికి సమారోపితమని పేరు . ఓ ద్విజులారా! సాయంకాలమందు అగ్ని యందీయబడిన ఆహుతి సంపత్తును కలిగించును. ఉదయము ఈయబడిన ఆహుతి ఆయుర్వృద్ధిని కలిగించును . పగలు అగ్ని సూర్యుని యందు ఉంచబడును. కావున, ఈ ఆహుతులకు అగ్ని యజ్ఞము అని పేరు వచ్చినది. స్థాలీపాకాది క్రతువులలో ఇంద్రాది దేవతల నుద్దేశించి అగ్ని యందు హోమము చేయుదురు . అది దేవయజ్ఞ మనబడును. చూడా కరణాది సంస్కారములలో లౌకికాగ్ని యందు చేయబడే హోమము కూడ దేవయజ్ఞమనబడును.


బ్రాహ్మణుడు దేవతల తృప్తి కొరకు నిత్యము బ్రహ్మయజ్ఞమును చేయవలెను. వేదాధ్యయనమునకు బ్రహ్మయజ్ఞమని పేరు . ఉదయము నిత్యకర్మను ఆచరించి, తరువాత సాయంకాలము వరకు వేదమును పఠించవలెను. రాత్రి యందు వేదపఠనమునకు విధి లేదు. అగ్ని లేకుండగనే చేయు దేవయజ్ఞమును సాదరముగా వినిపించెదను శ్రద్ధగా వినుడు.


సర్వజ్ఞుడు, కరుణా సముద్రుడు, సర్వ సమర్థుడు నగు మహాదేవుడు సృష్ట్యాది యందు సర్వప్రాణుల క్షేమము కొరకై వారములను కల్పించెను . సంసారమనే రోగమునకు వైద్యుడు, సర్వజ్ఞుడు, సర్వ సమర్థుడు నగు శివుడు ఔషధములలో కెల్ల ఔషధమై ఆరోగ్యము నిచ్చు తన వారమును ముందుగా చేసెను . తరువాత సంపత్తుల నిచ్చే, తన మాయ యొక్క వారమును, ఆ తరువాత జన్మ సమయములో శిశువు యొక్క కష్టములను దాటుట కొరకై కుమారవారమును చేసెను . లోక కల్యాణమును చేయగోరి సర్వ సమర్థుడగు శివుడు, సోమరితనమును పోగొట్టే, రక్షకుడగు విష్ణువు యొక్క వారమును మానవుల పుష్టి కొరకు, రక్షణ కొరకు కల్పించెను . జగన్నాథుడగు శివుడు తరువాత, ముల్లోకములను సృష్టించి ప్రాణుల ఆయుష్షులను నిర్ణయించే  పరమేష్ఠియగు బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరమగు వారమును మానవులకు ఆయుష్షు లభించుట కొరకై కల్పించెను .


సృష్ట్యాది యందు ముల్లోకముల అభివృద్ధి కొరకు పుణ్యపాపములు కల్పింపబడెను. తరువాత, వాటి పాలకులగు ఇంద్ర, యములకు వారములు కల్పింపబడెను . ఈ రెండు వారములు మానవులకు భోగముల నిచ్చి, మృత్యువును హరించును. మానవులకు సుఖదుఃఖములను సూచించునట్టియు, శివస్వరూపులైనట్టియు, వారములకు ప్రభువులైన ఆదిత్యాది దేవతలను శివుడు సృష్ట్యాది యందు గ్రహమండలము నందు ప్రతిష్ఠించెను. ఆయా దేవతల వారములలో వారిని పూజించుట వలన ఆయా ఫలములు కలుగును . ఆరోగ్యము, సంపదలు, వ్యాధి నాశము, పుష్ఠి, ఆయుర్దాయము, భోగము, అమృతత్వము అను ఫలములు క్రమముగా కలుగును.


ఆయా దేవతలు సంతసించినచో, క్రమముగా ఆయా వారఫలములు కలుగును. ఇతర దేవతలను పూజించిననూ, ఫలము నిచ్చువాడు శివుడు మాత్రమే . దేవతల ప్రీతి కొరకు ఐదు విధముల పూజ కల్పించబడినది. ఆయా మంత్రముల జపము, హోమము, దానము తపస్సు , మరియు సమారాధనము అనునవి ఐదు విధములు. సమారాధన మనగా వేదిని, ప్రతిమను, అగ్నిని, లేక బ్రాహ్మణుని షోడశోపచారములతో పూజించవలెను . ఈ నాలుగింటిలో ముందు దాని కంటె తరువాతది గొప్పది గనుక, పూర్వము లేకున్ననూ ఉత్తరమును పూజించవలెను.


నేత్రరోగము, శిరోరోగము, మరియు కుష్ఠురోగము తగ్గుట కొరకై  ఆదిత్యుని పూజించి, బ్రాహ్మణులకు భోజనమిడవలెను. ఈ విధముగా ఒక దినము, మాసము, సంవత్సరము, లేక మూడు సంవత్సరములు చేయవలెను . అపుడు రోగము నిచ్చిన ప్రారబ్ధము బలీయమైననూ, రోగము, వృద్ధాప్యము మొదలగునవి తొలగిపోవును. ఆయా వారములలో ఇష్టదేవత నుద్దేశించి జపాదులను చేసినచో, ఆయా ఫలములు లభించును . ఆదివారమునాడు ఆదిత్యుని, ఇతర దేవతలను, బ్రాహ్మణులను పూజించినచో, పాపములు తొలగి గొప్ప ఫలము లభించును .


వివేకి సోమవారము నాడు సంపద కొరకై లక్ష్మి మొదలగు దేవతలను ఆరాధించి, బ్రాహ్మణ దంపతులకు నేయి అన్నమును భోజనము పెట్టవలెను . మంగల వారము నాడు రోగములు తగ్గుట కొరకై కాళి మొదలగు దేవతలను పూజించి, మినుము, కంది, పెసర పప్పులతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను . బుధవారమునాడు పండితుడు పెరుగు అన్నమును నైవేద్యమిడి విష్ణువును ఆరాధించవలెను. అట్లు చేసినచో, కుమారులు, మిత్రులు, భార్య మొదలగు వారికి అన్ని కాలముల యందు ఆరోగ్యము కలుగును . ఆయుష్షును, ఆరోగ్యమును కోరే వివేకి గురువారమునాడు దేవతలను ఉపవీతముతో, వస్త్రములతో, పాలతో, నేయితో అర్చించవలెను . శుక్రవారమునాడు శ్రద్ధ గలవాడై దేవతలను పూజించినచో, భోగములు కలుగును. బ్రాహ్మణుల తృప్తి కొరకు షడ్రుచులతో కూడిన అన్నమును ఇచ్చుటయే గాక , స్త్రీల తృప్తి కొరకు శుభమగు వస్త్రములు మొదలగు వాటిని ఈయవలెను.


శనివారము నాడు రుద్రాది దేవతల నారాధించు వివేకి అపమృత్యువు నుండి తప్పించుకొనును . ఆనాడు తిలలతో హోమము చేసి, తిలలను దానమిచ్చి, తిలాన్నముతో పండితులకు భోజనము నిడినచో, ఆరోగ్యము మొదలగు ఫలములు లభించును . దేవతలను నిత్యము ఆరాధించవలెను. తీర్థములో స్నానమాడి, జప హోమ దానములను చేయవలెను. బ్రాహ్మణులను సంతోషపెట్టవలెను . ఆది మొదలగు వారములలో తిథి నక్షత్రములు కలిసి వచ్చినప్పుడు ఆయా దేవతలను పూజించవలెను. సర్వజ్ఞుడు, జగత్ర్పభువు నగు శివుడు ఆయా దేవతల రూపములో భక్తులందరికీ ఆరోగ్యము మొదలగు ఫలముల నిచ్చును.


దేశము, కాలము, పాత్రల కనుగుణముగా , ద్రవ్యము, శ్రద్ధ, మరియు లోకములకు, తారతమ్యములకు అనురూపముగా మహాదేవుడు ఆరోగ్యము మొదలగు ఫలముల నిచ్చును . గృహస్థుడు తన గృహములో శుభకర్మలకు ఆదియందు, అశుభకర్మలకు అంతము నందు, జన్మ నక్షత్రము నాడు ఆరోగ్యాది సమృద్ధులు సిద్ధిం చుట కొరకు ఆదిత్యాది గ్రహములను పూజించవలెను . దేవతారాధనము కోరిన ఫలముల నన్నిటినీ ఇచ్చును. బ్రాహ్మణులు మంత్రయుక్తముగను, ఇతరులు తంత్రయుక్తముగను దేవయజ్ఞమును చేయవలెను . శుభ ఫలమును గోరు మానవులు ఏడు వారములలో తమ శక్తికి అనురూపముగా దేవపూజను చేయవలెను.


దరిద్రుడు తపస్సుతో దేవతల నారాధించవలెను. ధనికుడు ధనమును వినియోగించి, శ్రద్ధతో దేవపూజనము మొదలగు ధర్మముల ననుష్ఠించినచో పరలోకములో వివిధ భోగముల ననుభవించి, మరల భూలోకములో జన్మించును. నీడనిచ్చే చెట్లను పాతుట, చెరువులను తవ్వించుట, వేద పాఠశాలలను స్థాపించుట ఇత్యాది అనేక ధర్మ కార్యములను  ధనవంతుడు చేసినచో, అనేక భోగములను పొందును. అట్టి దాత కాలక్రమములో పుణ్య ప్రభావముచే జ్ఞానసిద్ధిని కూడ పొందును . ఓ ద్విజులారా! ఏ మానవుడైతే ఈ అధ్యాయమును వినునో, పఠించునో, వినుటకు సహకరించునో, అతడు దేవయజ్ఞ ఫలమును పొందును .



*శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యాందు పదునాలుగవ అధ్యాయము ముగిసినది.*




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

కామెంట్‌లు లేవు: