శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము
సుత మాటలు వినినంతనె
వ్రత విషయము గుర్తు కొచ్చె వర్తకు సతికిన్
పతి జేసిన తప్పిదముకు
మతి యందున నొచ్చు కొనియు మఱి యిటు దలచెన్
101
"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
సల్పె దనునేను వెనువెంట సత్య ముగను "
యనుచు సంకల్ప మొందియు యను క్షణంబు
వలయు సామాగ్రి సమకూర్చె వణిజు పత్ని 102
"గతమందున నా నాథుడు
వ్రతమును తా జేతునంచు వరుసగ బలికీ
మతిచెడి వ్రతమును మానెను
గతినీవె సత్యదేవ ! కరుణించు మమున్ 103
నా నాథుడు నా యల్లుడు
నానా విధ బాధలందు నలుగుచు నుండన్
నే నీ పేదరికంబున
నీ నామము దలచు చుంటి నిక్కము స్వామీ ! 104
ఎన్నో పర్యాయంబులు
నిన్నును నీ వ్రతము మఱచి నిలచితి మకటా !
యెన్నక మాయీ తప్పులు
సన్నుత రక్షించు మమ్ము సత్యస్వరూపా " 105
అనియు పరిపరి విధముల యార్తి తోడ
"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు"
భక్తి యపరాధ భావంబు పరిఢ విల్ల
సల్పె కూతురు తోడను సాధుపత్ని. 106
వ్రతమును సల్పియు దుహితతొ
పతి తప్పులు కావుమనుచు ప్రార్ధించి మదిన్
సతతము తమ్మిక బ్రోవగ
శతవందన మాచరించె సత్యప్రభుకున్ 107
బంధు మిత్రుల తోడను భక్తి తోడ
సల్పగా నట్లు వ్రతమును సాధుపత్ని
సత్యనారాయణస్వామి స్వాన్త మందు
యంత సంతుష్టు డయ్యెను సాంతముగను 108
వసుధ భక్తుల పాలిటి వరదుడైన
సత్యనారాయణస్వామి సత్వరంబె
చంద్రకేతుమహారాజు స్వప్న మందు
భవ్య దర్శన మిచ్చియు పల్కె నిట్లు 109
"ఓయి రాజేంద్ర! నీ చఱ నుండినట్టి
సాధు వాతని యల్లుడు సత్త్వగుణులు
నిరపరాధులు వారలు నిక్కముగను
వదలి పెట్టుము వారల వలదు శిక్ష 110
విడువుము వారల వెంటనె
యిడుముల నున్నట్టి వారి కివ్వుము ధనముల్
యుడుపులు బెట్టియు వారికి
కడు మన్నన జేసి పంపు కామిత పురికిన్ 111
అట్లు సేయక నీవున్న యవనినాథ!
నీదు రాజ్యంబు పుత్రుల నిఖిల సిరుల
లిప్త కాలంబు నందునే లీల గాను
సర్వమును నాశ మొనరింతు సత్య మిదియె " 112
సశేషము
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి