28, నవంబర్ 2020, శనివారం

మనుషులున్నారు జాగ్రత్త...!

 ************""**************

భలే గమ్మత్తుగా వుంటారు ఈ జనం

పరిగెడుతుంటే పడదోస్తారు ,

చచ్చి పడుంటే భుజాలకెత్తుకుంటారు  .

ఏడిస్తే ఓదారుస్తారు ,

ఊరుకుంటే గిల్లిపోతారు.

నిలబడిపోతే నీరుగారిపోయానంటారు ,

నడవడం మొదలెడితే కాళ్ళడ్డుపెడతారు.

బాగుంటేనే అడుగుతారు "బాగున్నవా....!"  అని

అడగకపోతే బాగోదని ,

కాదు మరి ..నువ్వు బాగోవాలని, బాగుపడాలని ,

ఎక్కడ బాగుపడిపోయావో తెలుసుకోవాలని .

అదే బాగోకపోతే తొంగి కూడా చూడరెవ్వరు నీ వైపు  .

పొరలు పొరలుగా ప్లాస్టిక్ ముఖాలు తగిలించుకుని

రక రకాల నవ్వుల్ని నటిస్తుంటారు.

అలాంటి మనుషులు

మందలు మందలుగా మూల్గుతున్న

మహారణ్యంలో మసలుతున్నాం మనం.

ఇక్కడి చిత్రాలన్ని మహా విచిత్రాలు...

తెలివి మీరిపోయిన గొర్రెలు

బుర్ర తక్కువ సింహాలు

బల పరీక్షకు రంకెలేస్తున్న జింకలు

బింకమేదని బొంకుతున్న గజరాజులు

రకానికో తీరు...తీరుకో తర్కం.

వెలుగుల్ని వెలివేసిన చీకటి రాత్రులు

నీడల్ని నిలబడనీయని పరిగెత్తే పగళ్ళు

నిశ్చల చలనాన్ని

జఢ చైతన్యాన్ని

పోతపోసినట్టు తిరుగుతున్న

నిలువెత్తు శవాలు

నిజమండి ఇక్కడ ఏవరూ బ్రతికిలేరు

బ్రతికుండడాన్ని నటిస్తుంటారు

బ్రతికుల్ని భరిస్తుంటారు

ఇక్కడ ప్రతి మనిషిలో ఒక మయుడున్నాడు

తనని తాను అంతుపట్టని సౌధంగా నిర్మించుకుంటున్నాడు

ఎవరి అంచనాలకి అందని చిక్కు ముళ్ళని అల్లుకుంటున్నాడు

అయినా తాడి తన్నె వాడు ఒకడుంటే వాడి తల దన్నేవాడు ఒకడుంటాడు ....

ఎవడి లెక్కలు వాడివి.

ఇప్పుడంతా...

మనిషికి మనిషి అవసరం మాత్రమే

మరి "ప్రేమ" అంటారా?

ఆ పదార్దం తన అస్తిత్వాన్ని కొల్పోయి చాల కాలమయ్యింది.

దేహం లేని అనాధ ప్రేతంలా మన మధ్యే తిరుగుతూ

ఆదరించే మనసు కోసం ఆశగా ఎదురు చూస్తుంది

అయిన తన పేరు మాత్ర0 వాడుకలోనే వుందండోయి

ఎందుకంటే,

నిన్ను నేను వాడుకుంటున్నాను అనడం కన్నా

నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోడానికి బావుంటుంది కదా!

అన్నీ మారుతున్నై

రూపాలు మార్చుకుని, రూపాంతరాలు చెందుతున్నయి

మారలేక మార్పు ఒంటపట్టక

సత్తె కాలం మనిషిలా నేను మాత్రం ఇలా వుండిపోతున్నాను.

ఏదేమైనా ...

పది మంది.. పది రకాలు

నువ్వు 11వ రకం,

నేను 12వ రకం

ఎవడి బలం వాడిది.

అయితే

ఈ పరిణామ క్రమంలో మనిషి తరువాతి జాతి ఎలా వుంటుందో...?

అన్న ఊహకే వణుకొస్తుంది

కామెంట్‌లు లేవు: