*📖 మన ఇతిహాసాలు 📓*
*దుర్యోధనుడు*
(మహాభారతంలో పాత్ర)
మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రథముడు, కౌరవాగ్రజుడు. సుయోధనుడు అని ఇతనికి మరొక పేరు.
*జననం*
ఇతడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి, ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరువాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురత వలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది. ఈ విషయం విన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరువాత నూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనుడు జన్మించాడు. తరువాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక, దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.
*దుశ్శకునములు,పెద్దల సూచన*
దుర్యోధనుని జననకాలములో రాక్షసులు మిక్కుటముగా అరచారు, నక్కలు ఊళలు పెట్టాయి, గాడిదలు ఓండ్ర పెట్టాయి, భూమి కంపించింది, మేఘములు రక్త వర్షాన్ని కురిపించాయి. ఇవి కాక అనేక దుశ్శకునములు సంభవించినట్లు భారతంలో వర్ణించబడింది. ఇవి గమనించిన భీష్ముడు, విదురుడు ధృతరాష్ట్రునికి "రాజా! దుర్యోధనుడు వంశనాశకుడు కాగలడని శకునములు సూచిస్తున్నాయి. ఇతనివలన కులనాశనం కాగలదు. ఈ పాపాత్ముని విడిచి కులమును రక్షింపుము " అని సూచించారు. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో వాటిని పెడచెవిన పెట్టినట్లు భారత వర్ణన.
*భారతంలో దుర్యోధనుని పాత్ర*
దుర్యోధనుడు అసూయకు మారుపేరు. అతడు పాండవులపై అకారణ శతృత్వాన్ని పెంచుకున్నాడు. ముందుగా భీముని బలము అతనికి భయాన్ని కలిగించింది. అతణ్ణి ఎలాగైనా తుదముట్టించాలనుకున్నాడు. భీముని ఒకసారి లతలతో కట్టి నదిలో పారవేయించాడు, ఒకసారి సారధిచే విష్నాగులతో కాటు వేయించాడు, మరి ఒకసారి విషాన్నాన్ని తినిపించాడు. భీముడు వీటన్నిటిని అధిగమించి అధిక బలాన్ని సంపాదించాడు. అలా అంతఃపుర కుట్రలకు చిన్నతనంలోనే పాల్పడ్డాడు.
అర్జునునికి ప్రతిగా తన పక్షంలో ధనుర్విద్యాయోధుడు ఉండాలని దుర్యోధనుడు భావించాడు. యుద్ధ విద్యా ప్రదర్శన సమయంలో ప్రవేశించిన కర్ణుని అర్జునునికి ప్రతిగా తనకు బలం చేకూర్చుకొనే విధంగా కర్ణునికి అంగ రాజ్యం ఇచ్చి అతడి మైత్రిని సంపాదించుకున్నాడు. ధర్మరాజుకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి సహించలేక తండ్రిని ఒప్పించి వారణావతానికి పాండవులను పంపించి, వారిని అక్కడే హతమార్చాలని పథకం వేసాడు. శకునితో కుట్ర జరిపి పాండవులను వారణావతములో లక్క ఇంట్లో ఉంచి వారిని దహించివేయాలని పధకం వేశాడు. కానీ విదురుని సహాయంతో వారు తప్పించుకున్నారు.
ద్రౌపది స్వయంవర సమయంలో హాజరైన రాజులలో దుర్యోధనుడు ఒకడు. ద్రౌపది అర్జునుని వరించినందుకు కోపించి ద్రుపదునితో యుద్ధానికి దిగి భీమార్జునుల చేతిలో పరాజితుడై వెనుదిరిగాడు. ద్రుపదుని ఆశ్రయంలో ఉన్న పాండవుల మధ్య పొరపొచ్చాలు సృష్టించి పాండవులను తుదముట్టించాలని తలపెట్టి, కర్ణుని సలహాతో వారిని తిరిగి హస్తినకు రప్పించాడు. భీష్ముని సలహా, కృష్ణుని ప్రోద్బలంతో రాజ్యవిభజన జరిగింది. ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకుని కృష్ణుని సహాయ సలహాలతో రాజ్యవిస్తరణచేసుకొన్న పాండవుల వైభవాన్ని చూసి ఓర్వలేక పోయాడు. మేనమామ శకుని కుతంత్రంతో పాండవులను మాయాజూదంలో ఓడించి వారిని అవమానించాడు. ద్రౌపదిని నిండు సభకు పిలిపించి ఆమె వస్త్రాపహరణానికి ప్రయత్నించాడు.
ధృతరాష్ట్రుని నుండి పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి వరంగా పొందారు. ఆ రాజ్యాన్ని తిరిగి మాయాజూదంలో అపహరించి వారిని అరణ్యవాసానికి, తరువాత అజ్ఞాతవాసానికి పంపి వారిని కష్టాలకు గురిచేసాడు. మైత్రేయుని హితవచనాలను అలక్ష్యం చేసినందుకు భీముని చేతిలో తొడ పగుల కలదని అతడి శాపానికి గురయ్యాడు. దుర్యోధనుని మరణం భీముని చేతిలో ఉన్నదన్న విషయం దానితో మరింత బలపడింది. సంజయుని ద్వారా కిమ్మీరుని వధ వృత్తాంతం విని, భీముని పరాక్రమానికి వెరచి, అరణ్యవాస సమయంలో పాండవుల మీదకు దండయాత్రకు వెళ్ళాలన్న ప్రయత్నాన్ని కొంతకాలం విరమించుకున్నాడు. పాండవులను పరిహసించి అవమాన పరచాలన్న దురుద్దేశంతో వచ్చి గంధర్వరాజు చిత్రసేనుని చేతిలో సకుంటుంబంగా బందీ అయ్యాడు. తుదకు ధర్మరాజు సౌజన్యంతో, భీముడి పరాక్రమంతో ఆ గంధర్వుని నుండి విడుదల పొందాడు. ధర్మరాజు సౌజన్యాన్నికూడా అవమానంగా ఎంచి ఆత్మహత్య తలపెట్టాడు. కానీ, రాక్షసుల సలహాననుసరించి ఆత్మహత్యను విరమించుకున్నాడు.
అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనిపెట్టి వారిని తిరిగి అరణ్యవాసానికి పంపాలన్న దురుద్దేశంతో విరాటరాజ్యం పై దండెత్తి అర్జునిని చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూశాడు. యుద్దకాలంలో సంధికి వ్యతిరేకంగా వ్యవహరించి యుద్ధానికి కాలుదువ్వాడు. దురహంకారంతో కృష్ణుని సహాయాన్ని వదులుకుని దైవబలాన్ని జారవిడుచుకున్నాడు. మాయోపాయంతో శల్యుని తనవైపు యుద్ధం చేసేలా చేసుకున్నాడు. తద్వారా కర్ణుని పరాజయానికి పరోక్షంగా కారణమైనాడు. పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కిన అభిమన్యుని అధర్మ మరణానికి కారకుల్లో ఒకడైనాడు. యుద్ధాంతంలో మరణభయంతో సరస్సులో జలస్తంభన చేసిన దుర్యోధనుడు భీముని చేతిలో నిస్సహాయంగా మరణించాడు.
ఈ విధంగా కౌరవకుల నాశనానికి దుర్యోధనుడు కారణమయ్యాడు.
*ప్రవృత్తి*
శ్రీకృష్ణుడు రాయబారం కోసం హస్తినకు వెళ్ళినపుడు దుర్యోధనుడు స్వయంగా తానే చెప్పుకున్న మాట, అతడి ప్రకృతిని తెలియజేస్తుంది.
*జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః*
*జానామి అధర్మం న చ మే నివృత్తిః*
నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ నాకది చెయ్యాలనిపించదు...
అధర్మం ఏమిటో కూడా తెలుసు, నాకు అదే చెయ్యాలనిపిస్తుంది.
*వివాహం*
దుర్యోధనుడు భానుమతిని వివాహమాడాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి