3, ఏప్రిల్ 2021, శనివారం

సిద్ధర్ సిద్ధులు

 సిద్ధర్ సిద్ధులు


శ్రీహరిః శరణం

ఈ సంఘటన నాకు కాశి నుండి వచ్చిన ఒక వేదపండితుడు చెప్పాడు. అతను మహాస్వామి వారి దర్శనార్థమై కంచి శ్రీమఠానికి వెళ్ళాడు. దేవుడిని, గురువుని, రాజుని దర్శించేప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు అనే నియమాన్ని అనుసరించి తనతో పాటు కొన్ని టెంకాయలు, పళ్ళు పట్టుకుని వెళ్ళాడు. మహాస్వామి వారికి సాష్టాంగం చేసేప్పుడు వారి ముందు ఉంచడానికి. 


అక్కడ ఉన్న వరుసలో ఒక “సిద్ధర్” (సిద్ధులు పొందినవాడు) కూడా ఉన్నాడు. అతను వొట్టి చేతులతో నిలబడి ఉన్నాడు. ఈ వేదపండితుడు అతణ్ణి, స్వామివారికి సమర్పించడానికి ఏమి తీసుకురాలేదేమని అడిగాడు. అతడు ఆ పండితునితో “వేచి చూడు” అని అన్నాడు. అతని వంతు రాగానే పరమాచార్య స్వామివారికి నమస్కరించి గాల్లో చేతులని ఆడించి ఒక బుట్ట పళ్ళు తీసాడు. 


స్వామివారు చిన్నగా నవ్వి, ఎన్ని సంవత్సరాలుగా ఈ సిద్ధులను అభ్యసిస్తున్నావు అని అడిగారు. చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను అని చెప్పి గాలిలోనుండి పూలు కూడా తీసాడు. మహాస్వామి వారు నవ్వి ఆ పూలు, పళ్ళ వంక చూసారు. వేంటనే అవి వాటి స్వరూపాన్ని కోల్పోయి, చెత్తగా మారిపోయాయి. 


స్వామివారి లాగా చేయుటకు ప్రయత్నించి ఆ సిద్ధుడు విఫలుడయ్యాడు. స్వామి వారు అతనితో, ఇటువంటి లోకవిహితమైన సిద్ధులను వదిలి ప్రజలకు సమాజానికి ఉపయోగపడే వాటిని చెయ్యమని సలహా ఇచ్చి పంపించారు. 


[అష్టసిద్ధులు(అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశిత్వ, ఈశిత్వ) లభించడం సాధకులకు తొలిమెట్టు. చాలామంది వాటితోనే ఆగిపోతారు. అక్కడితో ఆగకుండా సాధన కొనసాగించాలి. జ్ఞానులకు ఆ సిద్ధులన్నీ వశవర్తులైనా వాటిని ఎన్నడూ ప్రదర్శించరు. ఒకవేళ ప్రదర్శిస్తే అది మరొకరి శ్రేయస్సుకే చేస్తారు. రామకృష్ణ పరమహంస, రమణమహర్షి మొదలుగువారికి ఇవన్నీ కరతలామలకం. కాని అనవసరంగా వాటిని ప్రదర్శించినట్టు ఎక్కడా లేదు]


--- డాక్టర్ యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై

కామెంట్‌లు లేవు: