*💎 ఆణిముత్యం 💎*
తనయూరి తపసి తనమును
తన పుత్రుని విద్య పెంపు దన సతి రూపున్
తన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ!31
*భావం :* ఎంత వివేకం ఉన్న మనుష్యులయినప్పటికీ సొంత ఊరికి చెందిన తపశ్శక్తి సంపన్నుడినీ, కన్న కొడుకు ప్రదర్శించే తెలివితేటలను, సొంత భార్య అందచందాలను, ఇంటి పెరడులో ఉన్న చెట్టుయొక్క ఔషధగుణాలను మనస్సులో కూడా మెచ్చుకోరు.
*ప్రతిపదార్థం :* తన + ఊరి అంటే తను నివసించే గ్రామానికి చెందిన. తపసి అంటే తపస్సు చేసే వాని యొక్క. తపమును అంటే తపస్సును. తన పుత్రుని అంటే తన సొంత కుమారుని యొక్క. విద్య పెంపున్ అంటే చదువులో గల తెలివితేటలను. తన సతి అంటే తన భార్య యొక్క. రూపున్ అంటే సౌందర్యాన్ని. తన పెరటి అంటే తన ఇంటి పెరడులో ఉన్న. చెట్టుమందును అంటే ఔషధ వృక్షాలను. ఎట్టి అంటే ఎంత వివేకం ఉన్న. మనుజులున్ అంటే మనుష్యులు అయినప్పటికీ. మనసునన్ అంటే చిత్తంలో. వర్ణింపరు అంటే ప్రశంసించరు లేదా మెచ్చుకోరు.
పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది... అని సామెత ఉండనే ఉంది. తమ కుమారుడు ఎంత తెలివిగలవాడైనప్పటికీ, పక్కింటి అబ్బాయిని మెచ్చుకుంటారు. తమ గ్రామంలోనే ఎంతో పండితుడు ఉన్నప్పటికీ అతడిని గుర్తించరు. తన భార్య ఎంత అందంగా ఉన్నా కూడా పక్కింటి భార్య అందాన్నే పొగుడుతారు. అలాగే తమ ఇంట్లోనే ఔషధవృక్షం ఉన్నా కూడా దానిని ఔషధంగా అంగీకరించరు. అందుకే పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదు అని, దూరపుకొండలు నునుపు అని అంటారు. అందుబాబులో ఉన్నవాటిని నిర్లక్ష్యం చేసి అందని ద్రాక్షల కోసం ప్రయత్నించడం మానవ లక్షణం. ఈ పద్యంలో కవి ఆ విషయాన్ని వివరించాడు.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి