5, ఏప్రిల్ 2021, సోమవారం

మీనం, కమఠం,

 మీనం, కమఠం, వరవారాహం

నరహరి, వామన, రామం, రామం,

కృష్ణం, బుద్ధం, కల్కిమ్ విష్ణుం..

దశవిధ రూపం దర్శనభాగ్యం..


దశావతారాలకు దశ కంద కదంబం.🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


కం.

ఝషమై కరమున నిమడక

విషధిని మీనముగ నిండు విషరుహ నయనా

విషయమ్ముల నడగించుము

విషయాతీతా విలసిత విషధర శయనా!


కం.

మందరగిరిధర కచ్ఛప

కుందనపీఠా భవహర కూర్మాకారా

అందించుము కరకమలము

బందీలై యున్న యెడల భవబంధములన్!


 కం.

భూమీధర సూకరముఖ

స్వామీ క్షీరాబ్ది శయన  స్వారస్య గుణా

రోమశ నీ ఘట్టనచే

కామక్రోధాదులన్ని ఖండించుమయా!


కం.

స్తంభంబందున వెడలిన

శుంభద్జ్యోతివి నరహరి శోణిత దంష్ట్రా

దంభానల గర్వములే

కుంభినినుంభితమయినవి కొఱుకుము తండ్రీ!


కం.

అడుగొక్కటి మేదినిపై

నడుగొక్కటి నభమునంత నడుగిడ బలిపై

నడుగొక్కటి వేయుమయా

వడుగా షడ్వర్గతతుల వామన రూపా!


కం.

జనకుని పలుకుల వీనుల

వినినంతనె ఆచరించు విశ్రుత రామా!

అనితర బల విక్రమమున

గొనకొని వేయవె మదమును గొడ్డలితోడన్!


కం.

ఒక సతియే నొక రాముని

కొక బాణము, నొక పలుకట, నొక మార్గమదే

ఒకటే గద పరమాత్ముడు

ఒకటే పరమాణువందు నొక్కొక్కరిలో!


కం.

నిర్మల గీతాచార్యా

ధర్మము కొరకై వెలసిన దాక్షిణ్యనిధీ

కర్మవు కర్తవు క్రియవై

మర్మము బోధించి కృష్ణ మము బ్రోవుమయా!


కం.

సత్యమునే పలుకుమనెడు

చైత్యుని మార్గము నడచిన చైతన్యంబున్

ప్రత్యహమున ప్రత్యయమై

ప్రత్యక్షంబగును నిత్య ప్రస్థానంబున్


కం.

లోకములెల్లను పాపపు

భీకర కలి జలధి మునిగి భీతిల్లంగన్

చేకూర్చుటకై హితమును

కాకోదర శయను వచ్చి కల్క్యై తేల్చున్!


కం.

పదియవతారములందున

సదమల హృదయుని ఘనతర  సంస్తుతి జేయన్

విదళించుచు పాపమ్ముల

కుదురుగ జేయును మనసుకు కుశలమునొసఁగున్!

కామెంట్‌లు లేవు: