*విషానికి విరుగుడు..*
"ఏమైంది కొండయ్యా?..చాలా బాధపడుతున్నావు..?" అని అడిగాను.."గంట క్రితం చేతి మీద తేలు కుట్టిందయ్యా..భుజం దాకా నొప్పి పెడుతున్నది..స్వామి దగ్గరకు వచ్చేసాను.." అని చెప్పాడు..ఈ లోపల మా అర్చకస్వామి స్వామివారి సమాధి వద్ద వెలిగించిన దీపపు ప్రమీదలోని నూనె కొద్దిగా తీసుకొచ్చి..కొండయ్య కు తేలు కుట్టిన ప్రదేశం లో దానిని పూయమని చెప్పారు..కొండయ్య ఆ నూనె తీసుకొని..స్వామివారికి నమస్కారం చేసుకొని..తన చేతిమీద పూసుకున్నాడు.."పో..పోయి..ఆ మంటపం లో పడుకో..మరి కొద్దిసేపటిలో నొప్పి తగ్గిపోతుంది.." అని అర్చకస్వామి చెప్పారు.."అలాగే స్వామీ.." అని కొండయ్య వెళ్లి స్వామివారి సమాధికి ఎదురుగా ఉన్న మంటపం లో పడుకున్నాడు..అతని భార్య అతని ప్రక్కనే కూర్చున్నది..ఒక గంట కాలం గడిచింది..కొండయ్య లేచి కూర్చున్నాడు.."ఎలా ఉంది?" అని భార్య ఆతురత తో అడిగింది..నొప్పి చాలా వరకూ తగ్గిపోయిందనీ..కేవలం తేలు కుట్టిన ప్రదేశం లోనే కొద్దిగా నొప్పి పుడుతున్నదనీ కొండయ్య చెప్పాడు..మరో అరగంట తరువాత..ఆ నొప్పి కూడా తగ్గిపోయిందని చెప్పి.. తన భార్యతో కలిసి..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని..నా దగ్గరకు వచ్చి.."అయ్యా..వెళ్ళొస్తాను.." అన్నాడు.."సరే కొండయ్యా..జాగ్రత్త గా ఉండు.." అని చెప్పాను..
ఇటువంటి సంఘటనలు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద ప్రతి వారమూ ఒకటి రెండు సార్లు చూస్తూనే ఉంటాము..తేలు కుట్టినా..పాము కరచినా..మొగిలిచెర్ల..ఆ చుట్టుప్రక్కల గ్రామాల లోని ఎక్కువ మంది గ్రామస్తులు మరే వైద్యమూ చేయించుకోరు..నేరుగా శ్రీ స్వామివారి మందిరం వద్దకు వస్తారు..అటువంటి వారు రాగానే..ఆ సమయం లో స్వామివారి మందిరం లో ఉన్న అర్చకస్వాములు..గబ గబా స్వామివారి సమాధి ప్రక్కనే వెలుగుతున్న దీపపు ప్రమిద లోని నూనె కొద్దిగా తీసుకొచ్చి..వారికి ఇచ్చి..ఆ విషపు పురుగు కుట్టిన చోట ఆ నూనె రాయమని చెపుతారు..అదొక్కటే వైద్యం..మరో గంటా..రెండుగంటల్లో..ఆ వచ్చిన వ్యక్తి తనకు నొప్పి తగ్గిపోయిందని చెప్పి..స్వామివారి సమాధికి నమస్కరించి..తిరిగి తన పనికి వెళ్లిపోతూ వుంటారు..కానీ ఒకటి రెండు గంటల సేపు ఆ బాధ పడాలి..నొప్పి ని భరించాలి..తప్పదు..
ఇలాటి సంఘటన గురించి ఒక అనుభవాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను..పది పన్నెండేళ్ల క్రితం..విజయవాడ నుంచి మారుతీరావు గారని ఒక వ్యక్తి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆరోజుల్లో స్వామివారి మందిరం వద్ద ఉండటానికి కనీస వసతులు కూడా లేవు..ఉన్న రేకుల షెడ్ లోనే పడుకోవాలి..లేదా స్వామివారి మందిరం లో ఉన్న ఒక్క మంటపం లోనే ఉండాలి..మారుతీరావు గారు వచ్చింది శనివారం నాడు..వారు వస్తూ వస్తూ దారిలో మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని..అక్కడినుంచి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మొగిలిచెర్ల స్వామివారి వద్దకు వచ్చారు..అదే సమయం లో మొగిలిచెర్ల ను ఆనుకొని ఉన్న నారసింహాపురం గ్రామం లో గల ఒక రెడ్డి గారి అబ్బాయికి తేలు కుట్టి..ఆ అబ్బాయిని కూడా స్వామివారి మందిరానికి తీసుకొచ్చారు..ఆ అబ్బాయి వయసు పన్నెండేళ్ళు..నొప్పి భరించలేక ఏడుస్తున్నాడు.."ఊరుకో నాయనా..స్వామి దగ్గరకు వచ్చాము..నూనె పూస్తారు..నొప్పి తగ్గిపోతుంది.." అని ఆ పిల్లవాడి తండ్రి కుమారుడిని ఓదారుస్తున్నాడు..ఈ లోపలే అర్చకస్వామి స్వామివారి సమాధి ప్రక్కన ఉన్న దీపపు ప్రమిద లోని నూనె తీసుకొచ్చి..ఆ పిల్లవాడి తండ్రి చేతికి ఇచ్చారు..ఆ నూనె ను ఆ పిల్లవాడికి తేలు కుట్టిన చోట రాశారు..మంటపం లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు..
"ప్రసాద్ గారూ..ఇలా స్వామివారి వద్ద ఉన్న నూనె రాయడం..తేలు విషానికి అది విరుగుడు గా పనిచేయడం..అనేది నమ్మశక్యం గా లేదు..మీరేమో నిశ్చింతగా చూస్తూ వున్నారు..నా మాట విని ఏదైనా ప్రాథమిక వైద్యం అందించే మార్గం చూడండి..నాకు ఆయుర్వేద వైద్యంలోను, హోమియో వైద్యం లోనూ ప్రవేశం ఉన్నది..మీ వద్ద కొన్ని మాత్రలు పెడతాను..ఎవరైనా ఇలా వస్తే..వారికి ముందుగా ఆ మాత్రలు ఇవ్వండి..ప్రాణహాని జరుగకుండా ఉంటుంది.." అన్నారు.."ఇంతవరకూ ఒక్కసారి కూడా ఇక్కడ తేలు, పాము ఇట్లాటి విషపు పురుగుల బారిన పడ్డ ఏ వ్యక్తికీ ప్రాణహాని జరుగలేదు.." అని చెప్పాను.."మీరు చదువుకున్న వారు..కొంచెం ఆలోచించండి.." అన్నారు.."ఏమీ వద్దండీ..మా అందరికీ స్వామివారి మీద అపార నమ్మకం.." అని చెప్పాను..మారుతీరావు గారు ఇక ఏమీ మాట్లాడలేదు..
ఆరోజు రాత్రికి మారుతీరావు గారు నిద్ర చేసి..ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చారు..అక్కడే ఉన్న అర్చకస్వామితో ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతూ వున్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..నిన్న రాత్రి ఈ మంటపం లోనే పడుకున్నానండీ..నిన్న తేలు కుట్టిన పిల్లవాడు కూడా రాత్రి ఇక్కడే వున్నాడు..వాడు చాలా ఉషారుగా వున్నాడు..నాకే ఆశ్చర్యం వేసింది..కేవలం స్వామివారి వద్ద ఉన్న నూనె పూయగానే తేలు తాలూకు విష ప్రభావం మాయమై పోయిందా?..రాత్రంతా ఆలోచించాను..కొన్ని విషయాలను తార్కికంగా ఆలోచించకుండా..కేవలం భక్తి తో చూడాలి అని అనిపించింది..అందుకే అర్చకస్వామి వారిని అడిగి ఆ నూనె కొద్దిగా చిన్న సీసా లో తీసుకున్నాను..నేను మీ వద్ద మాత్రలు ఉంచడం కాదు..నేనే నా వద్దకు ఇలాటి సమస్యతో వచ్చేవాళ్లకు..స్వామివారి వద్ద ఉన్న ఈ నూనెను ఇస్తాను.." అన్నారు..
మారుతీరావు గారిలో ఉన్న అనుమానం అనే విషానికి కూడా స్వామివారే విరుగుడు చూపించారు అని మాకు అర్ధం అయింది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి