5, ఏప్రిల్ 2021, సోమవారం

నిత్యాత్ముడై యుండి

 నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు....


భావము :


- శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు


త్రైమూర్తులు = బ్రహ్మవిష్ణుమహేశ్వరులనబడు త్రిమూర్తులు; 

విగ్రహంబు = శరీరము;

ఇనచంద్రులు  = సూర్యచంద్రులు;

అవ్యక్తుడు = ప్రకాశము గానివాడు;

అద్వంద్వుండు = ద్వంద్వము లేనివాడు అద్వితీయుడు;

భువనైక హితమనోభావకుడు =  లోకమునకు ముఖ్య హితమునే మనస్సున భావించువాడు


     శ్రీవేంకటేశ్వరుడు నిత్య స్వరూపుడై యుండుట వలననే 'నిత్యుడు' అనబడి ప్రకాశించుచున్నాడు. సత్యస్వరూపుడగుటవలననే తాను 'సత్యుడు' అనబడుచున్నాడు. లోకములో ఎల్లవారికి ప్రత్యక్షమై యుండి పరబ్రహ్మముగా నున్నాడు గావుననే భక్తులచే స్తుతింపదగి యున్నాడు.  


1. ఏ దివ్యమూర్తి లోకములనెల్ల పాలించుచున్నాడో, ఎవనిని బ్రహ్మాది దేవతలెల్ల అన్వేషింతురో, ఎవడు ప్రపన్నులకు తనదైన (నిక్కమైన) మోక్షము నొసంగ జాలియున్నాడో, ఎవడు లోకమునకు ముఖ్యహితము గూర్తువాడో ఎవడు ఏ ఆకారమునూ తన ఆకారముగా కలిగియుండుట లేదో (నిరాకారుడో), ఎవడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులనబడు త్రిమూర్తులు ఏకమైన మూర్తిగానున్నాడో, ఎవడు

సర్వాత్ముడో, ఎవడు పరమాత్ముడో ఆ దివ్యమూర్తియే శ్రీవేంకటగిరి నాథుడు. 


2. ఏ దేవుని శరీరమున ఈ సమస్త భువనములు పుట్టినవో, ఎవని శరీరమున ఇవన్నియు లయమగుచున్నవో, ఈ చరాచరమైన సృష్టియంతయు ఎవ్వని శరీరమో, సూర్యచంద్రు లెవ్వని నేత్రములో, ఎవడు ఈ సర్వజీవులలో అంతరాత్ముడైయున్నాడో, ఎవని చైతన్యమీ చేతనముల కెట్లనాధారమో, ఎవడు ప్రకాశముగానివాడో ఎవడు అద్వితీయుడో, ఆ దేవుడే ఈ వేంకటాచల నాథుడు. 


3. భూమి, ఆకసము ఏ వేల్పు పాదయుగ్మమో ఎవని పాదముల తుదియు, కేశముల తుదియు అంతము లేనివో, ఈ మహావాయువెవ్వని నిట్టూర్పో, పరమ భాగవతులైన ఈ పుణ్యాత్ములెవ్వనికి నిక్కమైన దాసులో, ఎవడు సర్వేశ్వరుడో, ఎవడు పరమేశ్వరుడో, ఎవడు ప్రపంచమునకు ముఖ్య హితమునే మనస్సున భావించువాడో, ఎవడు మిక్కిలి సూక్ష్మమైన వాడో, ఎవడు మిక్కిలి స్థూలమైన వాడో, ఆ దేవుడే శ్రీ వేంకటేశ్వరుడు.

కామెంట్‌లు లేవు: