🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
)
🌷🌷🌷
అవ్యాజ కరుణామూర్తి ( పాతకథ)
" రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా
రంజనీ రమణీరస్యా రణత్కింకిణి మేఖలా"
అనునిత్యపఠనంగా అలరారే లలిత.. రాగబద్ధంగా సాగిపోతోంది గణపతి పెదవులపైన.
తమకలవాటయిన తమదైన పరదేవతానామం తమ జీవనాడుల అమృతం పోస్తుంటే, ఆ అమృతపాన పునీతులైన ఆ పుష్పగుల్మాలన్నీ, అమ్మకు అంకితంగా తమ సుమహృదయాలను పరమానందంగా అర్పిస్తున్నాయి ఆ కెంజాయ సంజెవేళ!
రాజరాజేశ్వరి దేవతార్చనకు ముందురోజే సాయంత్రం మల్లెలూ, గులాబీలూ, సంపెంగెలూ, మరువం, ధవనం కోసి ఉంచుకుంటాడు. మందారాలూ, నందివర్ధనాలూ , పారిజాతాలూ మర్నాడు ఉదయమే తామూ తయారు! అంటాయి. ఆ పూబాలలను పలకరిస్తూ, సున్నితంగా వాటిని కొమ్మనుండి వేరుచేస్తాడు.
అమ్మపొదుగు నుండి బొజ్జనిండా పాలుతాగిన తువ్వాయి లేలేత గడ్డిలో గెంతులేస్తోంది. చీకటిఛాయలు పరుచుకుంటున్న వేళ... దూరంగా పొదల్లో ఏదో అలజడి. పాము కాదు కదా! అటు పరుగెడుతున్న ఆవుదూడను సంభాళించడానికి వడివడిగా అడుగులేసాడు గణపతి.
సన్నని ఆర్తనాదం. పొదల మాటున ఇద్దరు యువతులు. పెద్దింటి అమ్మాయిలేమో! దూరంగా పెద్ద కారు! ఏడుస్తున్న అమ్మాయి చేతిలో ఏదో మూట. " నావల్ల కాదు వదినా! నేను పాపాయిని తీసుకుని ఎక్కడికయినా పారిపోతా! నేను విడువలేక పోతున్నా".... హృదయవిదారకంగా ఏడుస్తోంది. పద్దెనిమిది వుంటాయో ఏమో!
" లాభం లేదు లతా! తప్పుచేసినపుడు ఆలోచించలేదా ఇవన్నీ. ఎంత అజాగ్రత్త! ఐదునెలలకు కళ్లు తెరిచావ్! వాడేమో మీనాన్నకు భయపడి పారిపోయాడు. హాస్టల్ నుంచి నిన్ను తెచ్చి ఈవూళ్లో రహస్యంగా వుంచి, డెలివరీ పూర్తిచేసేటప్పటికి నాతల ప్రాణం తోకకొచ్చింది. మంత్రసాని ఏ పొరపాటు చేసినా నీ ప్రాణం మీదికొచ్చేది. మీ అన్నయ్యకు తెలిస్తే నా తల తెగుతుంది. ఇది మనవల్ల అయ్యేది కాదమ్మా. నాతల్లి కదూ! ఇక్కడ పెట్టేద్దాం బిడ్డను. ఆయుష్షుంటే బతుకుతుంది. ఎవరో ఆదరిస్తారు. నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. నాకియ్యమ్మా బిడ్డను. "..... పాతికేళ్లుంటాయేమో వదినగారికి. ఆడపడుచుకు ధీటుగా పచ్చనిఛాయలో మెరిసిపోతోంది. ఆ ఇద్దరి వంటిమీద రవ్వల ధగధగలు వారి చెక్కిళ్లపై జాలువారుతున్న కన్నీటిని మరింత మెరిపిస్తున్నాయి.
బిడ్డను అక్కడే ఓ మొగలిపొద మొదలులో పెట్టి , ఆడబిడ్డను లాక్కుపోయింది ఆమె.
" అయ్యో! ఎంత అఘాయిత్యం!" ఆపడానికి పరుగుపెట్టి రోడ్డు మీదకొచ్చాడు గణపతి.
కారెక్కబోతున్న ఆ నిర్భాగ్యమాతృమూర్తి , ఒక్కసారి తిరిగి, కన్నీళ్లతో నమస్కరించి వెళ్లిపోయింది. ఎంత అభ్యర్ధనో! ఎంత వేడుకోలో! ఆ పెద్దకళ్లల్లో!
తెల్లారితే విజయదశమి. చేతిలో పొత్తిళ్లలో పాపాయి. కళ్లుమూసుకుని చిన్మయముద్రలో బాలాలీలావినోదినిలా!
" రాజరాజేశ్వరీ దేవి"...... " నను పాలించగ నడచీ వచ్చితివా తల్లీ! పాదాల తలలనే పారిజాతములుంచి, మోదాన భాష్పాల ముద్దుపూసరులిచ్చి.... ఓ దేవి! నీమ్రోల ఒదిగి ఉన్నానమ్మా"! ..... ఏదో పరవశత్వం! ఏదో ఉన్మాదం! వివశత్వం బిడ్డను చూస్తుంటే! బాలాత్రిపురసుందరిని కళ్లారా చూస్తున్నట్టు!
తన కుటీరానికి తెచ్చాడు. భార్యను పిలిచాడు. ప్రశ్నించే తెలివిలేని ఆ అమాయకురాలు అపురూపంగా బిడ్డను గుండెకు పొదువుకుంది. కుటీరానికి ఆనుకుని చిన్న మందిరంలో తాను ప్రాణప్రదంగా ప్రతిష్టించుకున్న శ్రీచక్రసహిత రాజరాజేశ్వరీదేవి పంచలోహవిగ్రహం పాదాల చెంత బిడ్డను పెట్టాడు. కళ్లువిప్పిన బిడ్డ కనులారా నవ్వింది. పెద్దపెట్టున ఏడ్చింది. " భావాభావ వివర్ధిని"
బిడ్డనెలా పెంచాలన్న భయం లేదు ముప్ఫైయేళ్ల గణపతికి. పుష్కలంగా పాలిచ్చే గోవుంది. అమ్మవారు వుండనే ఉంది. పుష్కరకాలం క్రితం తనకు " వినిపించిన తల్లి" ఈరోజు కనిపించింది! " అమ్మా! నీ దయ! "
గణపతి సత్సాంప్రదాయ, సంపన్న కుటుంబంలో ఆరవకొడుకు. తాతతండ్రులు మంచిపేరున్న ప్లీడర్లు. చదువులో చురుకుగా ఉండే గణపతి చిన్నప్పటినుండి తాతగారితో పాటూ దేవతార్చనలో కూర్చుండేవాడు. పద్దెనిమిదో యేట ఉపనయనం జరిగింది. గాయత్రీ మహామంత్రోపదేశం తీసుకోగానే అతనికి బ్రహ్మానందం కలిగింది.
ఆరోజు అర్ధరాత్రి ఇంట్లో చిరుగజ్జెల చప్పుడు. ఎంత మరలిద్దామన్నా మనసుకు గాలం వేస్తున్న మంజీరకింకిణీ నాదం! ఒంటిపై కొస్తున్న మైమరుపు! మొగలి, మల్లెలు , చందన సుగంధం. పిలుస్తున్న దివ్యకాంతిని అనుసరించి వెళ్లిన గణపతి , దేవుడిగది పక్కగదిలో చిన్న సందువాపెట్టి దగ్గర నియంత్రించబడ్డాడు. పెట్టె తెరవగానే గుప్పున సాంబ్రాణిధూపం. జీర్ణమైపోతున్న పట్టువస్త్రంలో చుట్టబడి శ్రీచక్ర మేరువు, అష్టభుజాంకిత, అఖిలాధారిణి రాజరాశేశ్వరీ దేవి దివ్యవిగ్రహం.
గాయత్రితో ఆవహించిన మైమరుపు ఇప్పుడు అతని ఆత్మను ఆలింగనం చేసుకుని, అలౌకికమైన స్థితికి తీసుకుపోయింది.
తమ పూర్వీకులు కొన్నితరాల క్రితం పూజించిన రాజేశ్వరీపీఠం అతన్ని వరించింది.
కొన్నినెలలు అదే అలౌకికస్థితిలో, పరదేవతా ధ్యానంలో ఉన్మత్తుడయిపోయిన గణపతిని ఐహికస్థితికి తీసుకురావడం అసాధ్యమని గ్రహించిన అతని తాతగారు , కంచి గురుస్వాములచే శ్రీచక్రార్చన చేయించి, అమ్మవారిని ఆహ్వానించి, సద్గురువులచే మంత్రోపదేశం చేయించారు. అనంతరం కొద్దిగా బుద్ధిమాంద్యమున్న అతని మేనత్తకూతురుతో వివాహం జరిపించి, అతనికోరిక మీద ఆ చిన్న ఉపవనం, అమ్మవారి అర్చనకు ఏర్పాటు చేసారు.
సన్యసించకపోయినా, అవధూతలా విరక్తితో, నిర్గుణ నిశ్చల మార్గంలో తపోధనంతో వెలిగిపోయే గణపతి జీవితంలోకి పెనుమార్పులా ఈ "బాల రాజరాజేశ్వరి" !
స్వయాన వైష్ణవి, వైభవోపేత ఆతల్లి. ఆ పూరికుటీరానికి అష్టైశ్వర్యాలూ వచ్చి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు.
ఒకరోజు నామినేషన్ కు వెళుతూ ఆ కుటీరం దగ్గర దాహానికాగి, అమ్మవారికి దండం పెట్టుకున్న ఒక పెద్దమనిషిని ఏకంగా కీలకమంత్రిపదవి వరించడం , ఆ చిన్నమందిరం రూపురేఖల్నే మార్చేసింది.
స్వయాన పీఠాధిపతులు, గణపతి సచ్చిదానంద స్వాములు, యతీంద్రుల అధ్వర్యంలో రాజరాజేశ్వరీదేవి విగ్రహస్థాపన జరిగింది.
ఆగమశాస్త్రానుసారం భూకర్షణ చేసి, అద్భుతమైన శిల్పకళతో, అందమైన పాలరాతి ఆలయం నిర్మింపచేసుకుంది తల్లి.
ఆలయంతో పాటూ దినదినప్రవర్ధమానమైన రాజరాజేశ్వరికి అందరూ తల్లులే. అందరికీ అపురూపమే! పదిమంది పిల్లలున్న తల్లి కూడా మాతృభావన ఉప్పొంగి, ఆలింగనం చేసుకునే అద్వితీయ ఆకర్షణ ఆపిల్లది.
ఆ శ్వేతపద్మాసని విద్యాధరి శారదాంబ పిల్లకు విద్యలు అలవోకగా కట్టిపెట్టింది.
తనప్రమేయం లేకుండానే అఖండమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీరాజరాజేశ్వరీదేవి సంస్థానం పురోగమించడం గణపతి నిశ్చలభక్తికి ఏ ఆటంకం కలుగచేయలేదు. సాక్షీభూతుడిగా తన తపోనిష్ట సాగించుకుంటూ ఆయన తన కుటీరంలో తన శ్రీవిద్యోపాసనలో మహాయోగిలా తేజోవిరాజిల్లుతూ!
అది ఇరవై ఒకటో విజయదశమి రాజరాజేశ్వరికి. ముగ్గురమ్మలూ పోటీపడి చేసిన ఆ పిల్ల పెళ్లి ప్రస్థావనా , ప్రయత్నమూ గణపతిని కణ్వుణ్ణే చేసింది.
ఆమె అకులా సమయాంతస్థ అయినా మానుషరూపిగా ఆమెకు తనకులంలో కాకుండా కులేతర వివాహం చెయ్యలేడు. పైగాఆమె చెయ్యికోరి వచ్చిన వారికి సంస్థానం మీద దురాశ అదనం! "అమ్మా! నీ దయ!" దీర్ఘంగా నిశ్వసించి విశ్రమించాడాయన నవమిరాత్రి.
పోటెత్తిన జనసంద్రసమక్షంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవికి శాంతికవచం ధరింపచేసి, పూర్ణాహుతి, అఖండ అన్నదానానంతరం.... రాత్రి పదింటికి అమ్మవారికి భార్యాపుత్రీ సమేతంగా మణిహారతులిచ్చి, మొట్టమొదటిసారిగా ఒకేఒక్క కోర్కె కోరాడు అమ్మను!
కార్తీకపౌర్ణమి! ప్రత్యూష శీతలపవనాలు హిమగిరితనయ చల్లనిచూపుల్లా ఉన్నాయి. పచ్చనిగరికెలమీద తుహిణకణాలపై లేత అరుణకిరణాలు వక్రీభవనం చెంది, లక్షల ఇంద్రధనుసులు ఆ వనమంతా! అతిసుకుమారంగా పారిజాతాలు ఏరుకుని మొగలిపొదవేపు కెళ్లాడు గణపతి. కేతకీ పుష్పం శివుడికి నిషిద్ధమైనా , ఆయన గణపతి కదా! అమ్మకు ఇష్టంగా ఒకరేకు పెడతాడు రాజరాజేశ్వరి వచ్చినప్పటినుండి.
సంస్థానాన్ని విస్తరించి, సంరక్షించే గణపతి అన్నలపిల్లలూ, ధర్మకర్తలూ ఆయన ప్రపంచాన్ని ఏమాత్రం స్పర్శించకుండా ఆయనకేది ప్రియమో ఆ తోటంతా అలాగే ఉంచారు.
మొగలిపొద దగ్గర ఇద్దరు స్త్రీలు! ప్రౌఢలు! ఆయన అక్కడకు చేరగానే " స్వామీ!" అని మంద్రంగా పిలిచింది ఆమె.
ఆయనది సూక్ష్మబుద్ధి ! ఇట్టే కనిపెట్టాడు!
" ఏమ్మా! జగన్మాతను నాకు వదిలి నువ్వు వెళ్లిపోయావా తల్లీ?"
కన్నీరుమున్నీరే అయింది ఆ దొరలపిల్ల!
" మీ జగన్మాత చెయ్యి పట్టుకోడానికే వచ్చాము స్వామీ!".... కొంత ఠీవి. మరింత వినయం! ఆమె వదిన!
స్వామీ! నాపేరు శ్రీలలిత, ఈమె మా వదిన మణిదీప. ఆ కారు దగ్గరున్నాడే శైలేష్. మా అన్నకొడుకు. హైదరాబాద్ లో డాక్టర్ ! తన అంశను మోసిన గర్భంలో మరొకరికి స్థానం ఇవ్వలేదు ఆ తల్లి. వదిన పెద్దకొడుకు శైలేష్ ను నేనే పెంచుకున్నా!
నా పాప మీదగ్గర సవ్యంగా పెరుగుతోందని తెలుసు. ఏమిచ్చి మీరు పెంచగలరు అని కూడా ఆలోచించలేదు. మీ ఋుణం ఎప్పటికీ తీరనిది. వైవాహికజీవితం అల్లకల్లోలమవుతుందని నా గతాన్ని పాతిపెట్టేసాను. కానీ అనుక్షణం నా పాపం వెంటాడుతూనే ఉంది. పాపను మీరు చూడకపోతే! ఆ వూహే భయంకరం!
నా పాపభారంతో ఈ పవిత్రసన్నిధిలోకి అడుగుపెట్టే సాహసం చెయ్యలేకపోయా! జీవనసహచరుడు అకాలమృత్యువు పాలయ్యారు. రెండేళ్లయ్యింది నా జీవితం నాచేతిలో కొచ్చి. అందుకే ఈరోజు ధైర్యంచేసి మీకుమార్తెను నా దత్తపుత్రుడికి చేసుకోమని అర్ధించడానికి వచ్చా స్వామి.
పిల్లాడు శాఖాహారి. దైవభక్తితో సవ్యంగా పెరిగినవాడు" ...... మాటలూ-దుఖం కలగలుపుగా మాట్లాడుతుంటే, ఆమె కెంపుల కర్ణాభరణాలమెరుపులు ఆమె చెక్కిళ్ల దుఖపు ఎరుపులో ప్రతిఫలిస్తున్నాయి!
" అరుణాం కరుణాతరంగితాక్షీం"..... అమ్మనామం ఆయన నోటంట అప్రయత్నంగా జాలువారింది.
"రండమ్మ! మందిరంలోకి వెళ్దాం. అమ్మ సమక్షంలో పిల్లతో, ఆమె తల్లితో ఓ మాట చెప్పాలి కదా!
" మరోమాట స్వామి! ఏతండ్రికి భయపడి నాబిడ్డను వదిలేసి వెళ్లిపోయానో, ఆయన్నే స్వయంగా అమ్మ తన కాళ్లదగ్గరకు తెప్పించుకుంది. అవునండి ! మినిస్టర్ మృత్యుంజయరావు గారు మా నాన్నగారు. ఆయనకు పాప విషయం ఏమీ తెలియదు. అంతా ఆ దేవి దయ"
ఆ తరువాత వచ్చిన మాఘమాసంలోనే రాజరాజేశ్వరీదేవి కల్యాణం తను మెచ్చిన శైలేష్ తో ఆదిత్యనారాయణుడు ప్రత్యక్షసాక్షిగా , ముక్కోటిదేవతల ఆశీస్సులతో శ్రీరాజరాజేశ్వరీ సుందరేశుల సమక్షంలో అంగరంగ వైభవంగా అయింది.
పిల్లకు అప్పగింతలు పెట్టి పంపించేసారు అత్తవారింటికి.
ఏడుస్తున్న భార్యతో
" పిచ్చిదానా! తల్లి విశ్వమాత! జగద్ధాత్రి! పుట్టిల్లేంటి? మెట్టినిల్లేంటి? ఆమే బంధాలనిస్తుంది. బంధమోచనీ ఆమే!"అంటూ ఓదార్చారు గణపతి స్వామి!
ఆరోజు రాత్రి అమ్మవారికి ఒంటరిగా హారతిచ్చి, " కల్యాణీ జగతీకందా కరుణారససాగరా! పిల్లకల్యాణంతో నీవిచ్చిన బంధం ముగిసింది తల్లీ! రాజమ్మను చేర్చాలిసిన చోటికే చేర్చావు. నీలీలలు వర్ణించతరమా..!"అని కన్నీళ్లు పెట్టుకుని.... పిల్ల నీ సన్నిధిలోకి వచ్చింది కనుక నువ్వు చూసుకున్నావు, కానీ ఇలా ఎంతమంది పిల్లలు పురిటిగుడ్లుగా రాలిపోతున్నారో! ఎన్ని పసిబతుకులు ఛిద్రమైపోతున్నాయో! రక్షాకరీ! కాపాడుతల్లీ! నువ్వు కలికల్మషనాశినివి! దౌర్భాగ్యతూల వాతూలా! జరాధ్వాంత రవిప్రభవు! కటాక్షకింకరివి. రక్షించు తల్లీ పసిపిల్లలను! రక్షించు! మాతృరక్షణనుండి దూరం చెయ్యకమ్మా!"
ఆ అవ్యాజకరుణామూర్తి , అన్నీ తానయిన కర్మసాక్షి అమ్మ ముఖారవిందంలో అదే మందహాసం. ఆ చూపుల్లో అదే కరుణ! "
ఓలేటి శశికళ
8-10-2019
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి