29, మే 2021, శనివారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*మహనీయుని మాటలు..బోధ..*


*(నలభై రెండవ రోజు)*


ఆశ్రమ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి..శ్రీ స్వామివారు ఒక వైపు తన ధ్యానం కొనసాగిస్తూనే విడి సమయాలలో నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు..శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు ప్రతి పక్షం రోజులకు ఒకసారి మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారిని కలిసి విచారించి వెళ్లడమూ యధావిధిగా జరుగుతున్నది..అటు మీరాశెట్టి దంపతులు గానీ..ఇటు పద్మయ్య నాయడు గానీ..ఎవరు వచ్చినా..శ్రీధరరావు గారిని ప్రభావతి గారిని కలవకుండా తిరిగి వెళ్లేవారు కాదు..అప్పుడప్పుడూ శ్రీ చెక్కా కేశవులు గారు కూడా శ్రీ స్వామివారి కోసం విజయవాడ నుంచి వచ్చి..కొంత సమయం శ్రీ స్వామివారి సమక్షంలో గడిపి వెళ్లేవారు..శ్రీ స్వామివారి పరిచయం వలన వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరి కలిసిపోయారు..


క్రమంగా మొగలిచెర్ల చుట్టుప్రక్కల గ్రామాల్లో ..శ్రీధరరావు గారి స్నేహితుల, బంధు వర్గంలో..శ్రీ స్వామివారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరగసాగింది..శ్రీ స్వామివారిని చూడాలనే కుతూహలం తో కొంతమంది మొగలిచెర్ల రావడం..వాళ్లకు భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేయడం..ప్రభావతి గారి మీద పరోక్షంగా శారీరిక భారం పడసాగింది..వచ్చేవారిని వద్దని చెప్పలేరు..కొంతమంది రెండు మూడు రోజులు తిష్ట వేసి..కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపసాగారు..వాళ్ళను వదిలించుకోవడం శ్రీధరరావు దంపతులకు తలకుమించిన భారంగా మారింది..


ఒకరోజు సాయంత్రం వేళ, శ్రీధరరావు ప్రభావతి గార్లు..శ్రీ స్వామివారి వద్దకు వెళ్లారు..ఆ సమయానికి శ్రీ స్వామివారు ఆశ్రమం కోసం కడుతున్న గోడల మధ్య నిలబడి వున్నారు..వీళ్లద్దరినీ చూడగానే..నవ్వుతూ..


"రండి!..రండి ..మీరొస్తున్నారని అంతర్వాణి చెప్పింది..అందుకే బైటకు వచ్చి నిలుచున్నాను..!..ఆశ్రమవాసానికి అన్నీ  అమరుతున్నాయి..ఏమ్మా!..జటాఝూటం గురించిన చింత పూర్తిగా తీరిపోయిందా?..ఎంత బెంగ పడ్డావు తల్లీ!.." అంటూ..పూరి పాకలోకి వెళ్లి మంచం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నారు..దంపతులిద్దరూ శ్రీ స్వామివారి కెదురుగా బల్ల మీద కూర్చున్నారు..


శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు..ఏదో చెప్పబోతున్నారని శ్రీధరరావుగారు, ప్రభావతి గారు గ్రహించి..సావధానంగా వినడానికి ఉద్యుక్తులయ్యారు..


"జటాఝూటం గురించి నువ్వు ఎంతో ఆరాటపడ్డావమ్మా..ఎందుకు?..ఆ జుట్టు నా ఈ శరీరం తో పాటు నేను చేసిన జప తపాదులలో ఒక భాగమనీ..అందులో మహిమలుంటాయనే ఒక ఆలోచన నీలో బలంగా ఉండిపోవడం వల్ల..అదీకాక నన్ను ఒక గురుస్తానం గా భావించడం వల్ల..నీలో ఆ తపన కలిగింది..ఇందులో కొంత వాస్తవం వున్నా..గురువు యొక్క పరిపూర్ణ అర్ధం ఎంతమంది తెలుసుకుంటున్నారు?..గురువు వాడిన వస్తువులతోనే మనకు మోక్షం సిద్ధిస్తుందా?..లేక గురు వచనాలను బట్టీ పెట్టటం వలన కోరికలు సిద్ధిస్తాయా?..గురు ఉపదేశాన్ని ఆచరించకుండా..ఎన్ని ప్రయత్నాలు చేస్తే.. ఏమి ఫలితం?.."


"గురు శిష్యులలో ఎన్నో రకాలున్నారు..కొంతమంది గురువు నామాన్నే తలుస్తూ వుంటారు..మరికొంత మంది గురువు పాదాలను పదే పదే స్పృశిస్తూ వుంటారు..ఇంకొందరు క్షణానికొకసారి గురువు రూపాన్ని తలుచుకుంటూ నమస్కారం చేసుకుంటూ వుంటారు..ఇవేవీ నీకు గురు కృప ను సంపూర్ణంగా అందచేయవు.."


"గురువు ఒక పుణ్య తీర్ధం వంటి వాడు..గురువు మనసు ఉల్లాసమై, శిష్యుని పట్ల ప్రేమతో..దయతో..వాత్సల్యం తో నిండిపోయి..తన శరీరము, మనస్సు దైవీ భావం తో పొంగిపోతూ వున్నప్పుడు పలికే పలుకులు..లేదా ఉపదేశించే బోధలను శిష్యులు మంత్రాలుగా గ్రహించాలి..ఉత్తమ శిష్యుడి పై గురుకృప ఎల్లవేళలా ప్రసరిస్తూ ఉంటుంది..అలాగే గురువు యందు శిష్యుడికీ అనన్య భక్తి ప్రపత్తులుండాలి..శిష్యుడి నుంచి గురువు ఏదో గొప్ప గొప్ప ధనరాసులు కోరుకోడు!..సద్గురువు ఆశించేది శిష్యుని యొక్క శ్రద్ధ!..ఆ శ్రద్ధ లేనినాడు గురువు సమీపం లో వుండే అర్హత కూడా ఉండదు!.."


"నేను, ఆ దత్తాత్రేయుడి తత్వాన్ని అనుసరిస్తూ వుంటాను..దత్తాత్రేయుడు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ఎన్నో జీవరాసుల నుంచి ఉపదేశం పొందానని చెప్పుకున్నాడు..ఆయన దృష్టిలో పీపీలికాది బ్రహ్మపర్యంతమూ గురు స్వరూపమే..చిన్న పెద్ద తేడా లేకుండా..ఉచ్చ నీచ బేధం పాటించకుండా...ఎందులో ఏ సందేశం వుందో.. దానిని నిష్కర్షగా గ్రహించాడు..తాను గ్రహించిన దానిని తన శిష్యులకు ఉపదేశం చేసాడు.."


"సద్గురుని సేవించటం అంటే..ఆ గురుతత్వాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోవటం..మనసా వాచా కర్మణా గురూపదేశాన్ని ఆచరించటం.."


"కొన్నాళ్ళు ఒక గురువును సేవించటం..మరి కొన్నాళ్ళు ఇంకొకరిని నమ్మడం..ఇది పరిపక్వత అనిపించుకోదు..సద్గురువును నమ్మి అందుకనుగుణంగా నడుచుకోండి..ఆ గురువే మీకు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలను ఇచ్చి..మీ సంచిత పాపాన్ని తొలగించి..మోక్ష మార్గాన్ని సుగమం చేస్తాడు.." అని చెప్పారు..


శ్రీ స్వామివారి ఉపదేశం..వారికి అమృతధారలా అనిపించింది..తమ పూర్వజన్మ సుకృతం మూలానే..తమకు ఇటువంటి అయాచిత భాగ్యం కలిగిందని ఆ దంపతులకు తోచింది..ఈనాటి రోజుల్లో..ఇటువంటి సద్గురు సేవ పొందడం కేవలం దైవ కృపే గాని మరొకటి కాదు అని నిశ్చయానికి వచ్చారు..


పండితులు..పరామర్శలు..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: