మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*సాధన..సందేహ నివృత్తి..*
శ్రీ స్వామివారు సాధన చేసుకునే సమయంలో..ఆశ్రమం ప్రధాన గదిలో తన సాధన కోసం ప్రత్యేకంగా త్రవ్వించుకున్న నేలమాళిగ లోపల కూర్చుని, దానిమీద ఒక చెక్క పలకను మూతగా పెట్టుకొని..ధ్యానం చేసుకునేవారు..
నేను, అమ్మా నాన్న గార్లతో శ్రీ స్వామివారు దాదాపు వారం రోజులపాటు తీవ్ర ధ్యానం లో ఉండిపోయారనీ..ఆహారం కూడా తీసుకోలేదనీ చెప్పిన తరువాత..అమ్మా నాన్న శ్రీ స్వామివారి గురించి ఆందోళన చెందారు..లోపల ఊపిరాడుతుందా?..స్వామివారికి ఏ ఆపదా కలుగదు కదా?..కనుక్కుందాము అని అమ్మా నాన్న గార్లకు తోచింది..ఒకసారి ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకుందామని అనుకుని..గూడు బండి సిద్ధం చేయించుకొని ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆశ్రమానికి చేసురుకున్నారు..ప్రహరీ దాటి లోపలికి అడుగు బెట్టేసరికి.. శ్రీ స్వామివారు బావి వద్ద నిలబడి..సూర్యనికి నమస్కారం చేసుకుంటున్నారు..ఒక్క రెండు మూడు నిమిషాల లోనే వీళ్ళిద్దరిని చూసి..సంతోషంతో నవ్వుతూ..
"అమ్మా!..మీరిద్దరూ మనసులో తల్లడిల్లిపోతున్నారా?..నాకు ఆ జగన్మాత ఆశీస్సులు ఉన్నంతవరకూ ఏ ఆపదా రాదు..మాలాటి అవధూతలకు ఇటువంటి కఠోర సాధన అవసరం..దానిని మేము చేసి తీరాలి..మోక్షానికి దగ్గర మార్గాలు లేవు!..మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి..సరే..మీరిద్దరూ సందేహంతో ఇక్కడిదాకా వచ్చారు..ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను..నాతో రండి.." అన్నారు..
అత్యంత ఆశ్చర్యం తో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ..తాము ఎందుకోసం వచ్చిందీ ముందుగానే చెప్పేసారు శ్రీ స్వామివారు..ఇక తమ ఇద్దరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు..స్వామివారి వెనకాలే ప్రధాన గది వద్దకు వెళ్లారు..
"శ్రీధరరావు గారూ..నేను ఈ క్రింద ఉన్న గది లోపలికి వెళ్లి కూర్చుంటాను..మీరు పైన ఆ చెక్క పలకతో మూసివేసి..ఒక ప్రక్కగా కూర్చోండి..తరువాత మీకు అన్నీ అవగతం అవుతాయి..సరేనా?.." అని చెప్పి..శ్రీ స్వామివారు లోపలికి దిగి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..నాన్న గారు ప్రక్కనే ఉన్న చెక్క పలకను ఆ నేలమాళిగ పైన మూతగా పెట్టి..ఆ గదిలోనే ఒక మూలనున్న చాప పరచుకొని దానిమీద అమ్మ తో సహా కూర్చున్నారు..
సుమారు ఓ పదిహేను ఇరవై నిమిషాల తరువాత..అమ్మా నాన్న గార్లకు ఏదో మైకం లాగా వచ్చేసింది..తమకు తెలీకుండానే నిద్రలోకి జారిపోయారు..ఆ గదిలోనే చాప మీద వాలిపోయారు.. గంట..రెండు గంటలు..ఇలా కాలం గడిచిపోతోంది.. ఉదయం తొమ్మిది, తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లిన మా తల్లిదండ్రులకు మెలకువ వచ్చేసిరికి..సమయం చూసుకుంటే..సాయంత్రం నాలుగు దాటుతోంది..ఒక్కసారిగా ఇద్దరికీ గుండె గుభేల్ మంది..
దాదాపు ఏడు గంటల పాటు తాము దిక్కుతెలీనంత గా నిద్రపోయారు.. తమ ఒళ్ళు తమకు తెలీదు..క్రింద నేలమాళిగ లో కూర్చున్న ఆ స్వామివారు ఎలా ఉన్నారో?..ఏమిటో?..అనుకుంటూ..గబ గబా లేచి చాప చుట్టి పక్కన పెట్టి..నేలమాళిగ పైన మూతగా పెట్టిన చెక్క పలకను తొలగించి.."స్వామీ..స్వామీ!.." అంటూ మా నాన్నగారూ.." నాయనా!..నాయనా!." అంటూ అమ్మా పిలిచారు ఆతృతగా..
అరవవద్దు అన్నట్లు చేతితో సైగ చేస్తూ..శ్రీ స్వామివారు లేచి నిలబడ్డారు.. తన రెండుచేతులు ఆసరాగా పెట్టుకుని..ఆ గోతిలాంటి గది నుంచి ఒక్క ఉదుటున బైటకు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసిన తరువాత గానీ వీళ్ళిద్దరికీ ఆత్రుత తగ్గలేదు..
కానీ..చిత్రం..కనీసం గాలికూడా చొరబడని ఆ చిన్న గోతి లాంటి గదిలో దాదాపు ఏడు గంటల పైగా ధ్యానం లో ఉన్న శ్రీ స్వామివారి శరీరం పై ఒక్క చెమట బిందువు లేదు..ఉదయం ఎంత స్వచ్ఛంగా ఉన్నారో..ఇప్పుడూ అంతే స్వచ్ఛతతో..చిరునవ్వుతో..వున్నారు..ఆ ముఖం లో దేదీప్యమైన కాంతి కనబడుతోంది..అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించారు..
శ్రీ స్వామివారు చప్పున..నమస్కరించవద్దన్నట్లు వీరిని వారించి.."అమ్మా..మీ ఇద్దరి సందేహమూ తీరిపోయిందా?..ఇది సాధనలో ఒక భాగం అమ్మా..అవధూత సంప్రదాయం లో ఇటువంటి తీవ్ర సాధన కూడా ఒక భాగం..ఆ సాధన సక్రమంగా చేస్తే..అణిమాధ్యష్ట సిద్ధులూ వశం అవుతాయి..కానీ వాటిని సక్రమంగా సమాజహితానికి వాడుకోవాలి..అప్పుడే ఆ సాధనకు ఫలితం..స్వార్ధానికి ఉపయోగిస్తే..తాత్కాలిక భోగాలు లభించి..చివరకు పతనం అవుతారు.."
"శిరిడీ లోని సాయిబాబా..అరుణాచలం లోని శ్రీ రమణులు ఉత్తమ సాధకులకు అత్యుత్తమ ఉదాహరణలు..వారు తమను తాము తరింపచేసుకొని..తమతో పాటు ఈ సమాజానికి మార్గదర్శనం చేసారు.. ప్రస్తుతం శ్రీ పరమాచార్య వారూ వారి పంథాలో వారు జాతిని ఉద్ధరిస్తున్నారు..
(శ్రీ స్వామివారు ఈ మాటలు చెప్పేనాటికి అంటే..1974 సంవత్సర ప్రాంతంలో..మన ఆంధ్రప్రాంతంలో కొంతమందికి మాత్రమే శిరిడీ లో ప్రకటమైన శ్రీ సాయిబాబా గురించి అవగాహన ఉన్నది..నేటి లాగా విపరీత ప్రాచుర్యం లేదు..అలాగే శ్రీ రమణమహర్షి గురించి కూడా..కానీ..శ్రీ స్వామివారు ఆ ఇద్దరినీ ఉదహరించారు..అవధూత లు "ద్రష్ట" లు అనడానికి..వారికి కుల, మత, జాతి విబేధాలు లేవు అనడానికి..ఇదొక నిదర్శనం..)
"శ్రీధరరావు గారూ తపస్సులో అనేక మార్గాలున్నాయి..ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పంథా..మీరు నా గురించి ఏ విషయం లోనూ చింత పడవద్దు..అన్నీ సక్రమంగా జరిగిపోతాయి..అమ్మా!..ఏ నిమిషంలో మీకు సందేహం వచ్చినా..నిరభ్యంతరంగా నా వద్దకు రండి..ఇప్పటికే కాలాతీతమైనది..వెళ్ళిరండి!.." అన్నారు..
అమ్మా నాన్న ఇద్దరూ శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని బైట ఉన్న తమ బండి వద్దకు వచ్చారు..చిత్రం..అప్పటికి కూడా బండి తోలే మనిషి..నిద్ర లోనే వున్నాడు..ఎద్దులు కూడా జోగుతున్నాయి..వీళ్ళు లేపేదాకా ఆ పనివాడు లెయ్యలేదు.."మొద్దు నిద్ర పట్టింది స్వామీ!..ఎప్పుడూ ఎరగను!..ఎద్దులకు నీళ్లు కూడా పెట్టలేదు.."అంటూ ఎద్దులను అదిలించి..బండి సిద్ధం చేసాడు.. శ్రీ స్వామివారు తమకోసం చూపిన ఈ చిత్కళ ను తలుచుకొని మనసులోనే నమస్కరించి ఇంటికి చేరారు..ఇంటికి వచ్చిన తరువాత తాము పొందిన అనుభవాన్ని మాతో చెప్పుకొని..అదే విషయాన్ని పదే పదే తలచుకొన్నారు..
శ్రీ స్వామివారితో నా సంభాషణ రేపటి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114...సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి