28, జూన్ 2021, సోమవారం

దశమస్కంధము



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది నాలుగవ అధ్యాయము*


*శ్రీకృష్ణభగవానుని అగ్రపూజ శిశుపాలుని ఉద్ధారము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*74.1 (ప్రథమ శ్లోకము)*


*ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధవధం విభోః|*


*కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా ప్రీతస్తమబ్రవీత్॥11356॥*


*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! మహారాజైన యుధిష్ఠిరుడు జరాసంధునివధను, అనంతశక్తిమంతుడైన కృష్ణప్రభువుయొక్క అద్భుత మహత్త్వమును గుఱించియు మిగుల సంతసించి నుడివెను-


*యుధిష్ఠిర ఉవాచ*


*74.2 (రెండవ శ్లోకము)*


*యే స్యుస్త్రైలోక్యగురవః సర్వే లోకమహేశ్వరాః|*


*వహంతి దుర్లభం లబ్ధ్వా   శిరసైవానుశాసనమ్॥11357॥*


*యుధిష్ఠిరుడు ఇట్లనెను* "పురుషోత్తమా! ముల్లోకములకును అధిపతులైన బ్రహ్మ, శంకరాదులు, ఇంద్రాదిలోకపాలురు దుర్లభమైన నీ ఆదేశము కొఱకు నిరీక్షించుచుందురు. నీ ఆజ్ఞను పొందిన పిమ్మట వారు దానిని శిరసా వహింతురు.


*74.3 (మూడవ శ్లోకము)*


*స భవానరవిందాక్షో దీనానామీశమానినామ్|*


*ధత్తేఽనుశాసనం భూమంస్తదత్యంతవిడంబనమ్॥11358॥*


లోకపూజ్యుడవైన ఓ కమలాక్షా! వాస్తవముగా మేము దీనులము అయ్యును, మహారాజులనుగా తలంచుకొనుచున్నాము. నీవు సర్వశక్తిమంతుడవేయైనను సామాన్యమానవునివలె మా ఆజ్ఞలను మన్నించుచు వాటిని పాలించుచుందువు.


*74.4 (నాలుగవ శ్లోకము)*


*న హ్యేకస్యాద్వితీయస్య బ్రహ్మణః పరమాత్మనః|*


*కర్మభిర్వర్ధతే తేజో హ్రసతే చ యథా రవేః॥11359॥*


పరమాత్మా! నీవు సజాతీయ విజాతీయ స్వగతభేదరహితుడవు. స్వయముగా పరబ్రహ్మవు. ఉదయాస్తమయములలో సూర్యుని తేజస్సు ఎట్టి మార్పును పొందక ఒకేరీతిగా నుండునట్లు ప్రాకృతములైన శత్రుజయాదికర్మలచేత నీ ప్రభావము పెరుగదు, తరుగదు.


*74.5 (ఐదవ శ్లోకము)*


*న వై తేఽజిత భక్తానాం మమాహమితి మాధవ|*


*త్వం తవేతి చ నానాధీః పశూనామివ వైకృతా॥11360॥*


మాధవా! 'నేను, నాది, నీవు, నీది' అను భేద భావములు అనగా అహంకారమమకార వికారములు పశుతుల్యులైన అజ్ఞానులలో ఉండునుగాని, నీ అనన్య (పరమ) భక్తులలో ఉండవు. ఇంక జగద్విజేతవైన నీలో ఎట్లుండును? కనుక నీవు చేయునవి అన్నియును నీ దివ్యలీలలే"


*శ్రీశుక ఉవాచ*


*74.6 (ఆరవ శ్లోకము)*


*ఇత్యుక్త్వా యజ్ఞియే కాలే వవ్రే యుక్తాన్ స ఋత్విజః|*


*కృష్ణానుమోదితః పార్థో బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః॥11361॥*


*శ్రీశుకుడు వచించెను* రాజా! ఇట్లు పలికిన పిమ్మట ధర్మరాజు శ్రీకృష్ణునియొక్క ఆమోదముతో రాజసూయ యాగమును ప్రారంభించుటకు అనువగు వసంతఋతువునందు యజ్ఞకర్మలయందు నిపుణులైన వేదవేత్తలగు బ్రాహ్మణులను, ఋత్విజులను ఆచార్యులనుగా ఎన్నుకొనెను(ఆహ్వానించెను).


*74.7 (ఏడవ శ్లోకము)*


*ద్వైపాయనో భరద్వాజః సుమంతుర్గౌతమోఽసితః|*


*వసిష్ఠశ్చ్యవనః కణ్వో మైత్రేయః కవషస్త్రితః॥11362॥*


*74.8 (ఎనిమిదవ శ్లోకము)*


*విశ్వామిత్రో వామదేవః సుమతిర్జైమినిః క్రతుః |*


*పైలః పరాశరో గర్గో వైశంపాయన ఏవ చ॥11363॥*


*74.9 (తొమ్మిదవ శ్లోకము)*


*అథర్వా కశ్యపో ధౌమ్యో రామో భార్గవ ఆసురిః|*


*వీతిహోత్రో మధుచ్ఛందా వీరసేనోఽకృతవ్రణః॥11364॥*


పిమ్మట యుధిష్ఠిరుని ఆహ్వానమపై యజ్ఞనిర్వహణమునకై వ్యాసమహర్షి, భరద్వాజుడు, సుమంతుడు, గౌతముడు, అసితుడు, వసిష్ఠుడు, చ్యవనుడు, కణ్వుడు, మైత్రేయుడు, కవషుడు, త్రితుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, సుమతి, జైమిని, క్రతువు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, వైశంపాయనుడు, అథర్వుడు, కశ్యపుడు, దౌమ్యుడు, పరశురాముడు, శుక్రాచార్యుడు, అసురి, వీతిహోత్రుడు, మధుచ్ఛందుడు, వీరసేనుడు, అకృతవ్రణుడు మొదలగువారు విచ్చేసిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: