28, జూన్ 2021, సోమవారం

భగవంతుని సూచన

 *ఇంద్రియ నియంత్రణ ... భగవంతుని సూచన..*

 

శరీరం ఇల్లు అని నవరంధ్రాలు నవ ద్వారాలని చెపుతూ భగవంతుడు మన శరీరాన్ని నిర్మించేటప్పుడు బేసి సంఖ్యలో ద్వారాలు పెట్టి వాస్తు పాడు చేసాడని  దానికి పరిష్కారము ఏమిటనేది ఇంతకు ముందు చర్చించాము. అందులో "భగవంతుడు నిర్లక్ష్యంగా చేశాడా కావాలనే అలా చేశాడో తెలీదు". అని రాసాను. అది హాస్యం కోసం వ్రాసినది.


ఈ నవరంధ్రాల ఈ విషయంలో వాస్తు అనేది పెద్ద విషయమే కాదు. ఈ శరీరాన్ని ఇల్లు అని మనమే అనుకోవడం. నవరంధ్రాల ను ద్వారాలు అని మనమే అనుకోవడం.   అలా అనుకున్న తర్వాత అందులో వాస్తు తప్పింది అనుకోవడం అన్నీ మన ఊహలే. భగవంతునికి సంబంధం లేదు.


ఈ నవరంధ్రాల విషయంలో సరైన విమర్శ వేరే ఉన్నది. తొమ్మిది రంధ్రాలు ఎనిమిది పనులు లెక్క తేలుతాయి. మలవిసర్జన కు ఒకటి. దాని విషయంలో పేచీ లేదు.


వాసన చూడడం బయటి శబ్దాలు వినడం బయటి దృశ్యాలు చూడడం ఈ మూడు పనులకు ఆరు రంధ్రాలు ఏర్పా టయ్యాయి. రెండు ముక్కులు రెండు చెవులు రెండు కళ్ళు.


నోటికి భోజనం చేయడం మాట్లాడడం రెండు పనులు. అలాగే సంతానమూ మూత్రం వదిలి పెట్టడమూ రెండు పనులూ ఒకే చోట ఉన్నాయి. 


ఒకే పనికి రెండు రంధ్రాలు రెండు పనులకు ఒకే రంధ్రము ఎందుకు. ఒక్కో పనికి ఒక్కో రంధ్రం పెడితే ఇంకా ఒకటి మిగులుతుంది కదా. ఇలా ఎగుడు దిగుడు గా పెట్టడం పొరపాటు  అనేది ఆ విమర్శ. 


ఒకే పనికి రెండు రంధ్రాలు :: ఒక చెవి  ఉంటే శబ్దం ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఒక కన్ను ఉంటే దూరంగా ఉన్న వస్తువులు ఏది ముందు ఉన్నదో ఏది వెనక ఉన్నదో తెలీదు. ముక్కు కూడా అంతే. మనం దాన్ని అంత సరిగా ఉపయోగించు కోము.  వాసన పసిగట్టే జంతువులు రెండు ముక్కులను సరిగా వాడు  కుంటాయి. అవి రెండు రెండు ఉండడం మన సౌకర్యం కోసమే.


ఇక మిగిలింది ఒకే రంధ్రానికి రెండు పనులు పెట్టడం. ఇది పైకి తప్పు లాగా కనిపిస్తుంది. దీన్ని లోతుగా పరిశీలిస్తే దాని అంతరార్థం తెలుస్తుంది. ఈ విషయంలో భగవంతుడు మనుషులకు ఒక సూచన చాలా నర్మగర్భంగా చేస్తున్నాడు. ఆ సూచన ఏమిటో తెలియడానికి ఆ రెండు రెండు పనులలో ప్రాధాన్యతను నిర్ణయించాలి. 


మనిషి మాట్లాడకుండా ఎన్ని రోజులైనా ఉండవచ్చు భోజనం చేయకుండా అలా ఉండలేడు. మాటలు రాని జీవులు ఆహారం తింటూ హాయిగా బతుకుతున్నాయి. కాబట్టి నోటికి ఉన్న రెండు పనులలో ఒకటి ప్రధానం రెండవది అప్రధానం. ఇలాగే తరువాతి  విషయంలో కూడా.  సంతానము కామము ఇవి లేకున్నా చాలాకాలం  బతకొచ్చు. అందువల్ల ఆ పని అప్రధానమైనది. మూత్ర విసర్జన చాలా అవసరము. దానికి ఏదన్న అడ్డు తగిలితే గంటా రెండు గంటల్లో మరణిస్తాము. కాబట్టి ఏది ప్రాధాన్యము ఏది అప్రాధాన్యము ఇప్పుడు తెలుసు కున్నాము. 


ఇందులో భగవంతుడి సూచన ఏమిటంటే :: "జీవితానికి ప్రధానమైనవి  ముఖ్యమైనవి అయిన పనులు చేసుకోండి. జీవితానికి అప్రధానమైనవి అవసరం లేనివి మానుకోండి కనీసం తగ్గించుకోండి. " మనం మన మధ్యలో మామూలుగా మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే "ఎక్సట్రాలు చెయ్యవద్దు" అని భగవంతుడు చెబుతున్నా డన్న మాట.


ఇలా చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. మనిషి ఉన్నతికి ఇంద్రియ నిగ్రహం చాలా అవసరము. 


*ఇంద్రియాల లోకెల్లా అత్యంతంగా కొంప ముంచేవి  రెండే రెండు. అవి వాక్కు ఉపస్తు. కింది శ్లోకంలో రెండో పాదం చూడండి.*


*ఇంద్రియాణాం హి సర్వేషాం*

*వాగుపస్తౌ మహాబలౌ*

*తయార్జయస్తు సిద్ధ శ్చేత్*

*కో న ము త్చ్యేత బంధనాత్.*


అవి రెండూ గెలిచిన మనిషి మిగతా ఇంద్రియాలను సులభంగా గెలవగలడు. అట్లాంటి వాడు సులభంగా అన్ని బంధనాల నుంచి విముక్తుడు అవుతాడు అని అర్థము.


వాక్కు మీద నియంత్రణ మౌనానికి దారి తీస్తుంది. ముని యొక్క ముఖ్య లక్షణం మౌనం. ( మౌనం అనే పదం అసలు ముని అనే పదం నుంచి వచ్చింది). కామవాంచ మీద నియంత్రణ బ్రహ్మచర్యానికి దారి తీస్తుంది. అది బ్రహ్మచారి  లక్షణం. బ్రహ్మచర్యం అంటే స్త్రీ పురుష సంబంధమైన కామము ఒకటే కాదు. మనసును బ్రహ్మ యందు లగ్నం చేసి మిగతా అన్ని విషయాలను వదిలిపెట్టి ఉండడం. కామవాంచ మీద నియంత్రణ అనేది దానికి మొదటి మెట్టు మాత్రమే. 


*ఇంకో మాటలో చెప్పాలంటే ఈ అప్రధానమైన రెండు విషయాల మీద సరైన నియంత్రణ ఉంటే మనిషి ముందు ముని తరవాత బ్రహ్మచారి (బ్రహ్మజ్ఞాని) అవుతాడు. మనలనందరినీ అలా అవమని భగవంతుడు చెబుతున్నాడు...* 


ఇంద్రియాలను కల్పించే టప్పుడే వాటి నియంత్రణ మార్గాలను కూడా భగవంతుడు మనకు సూచనగా అందులోనే ఉంచి పెట్టాడు. ఆ సూచన కనిపెట్టి దానికి తగినట్టుగా నడుచుకోవడము మన బాధ్యత.


*పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: