18, జూన్ 2021, శుక్రవారం

*ముక్తి*

 *ముక్తి*..


ముక్తి అనే మాట వినని వాళ్లే ఉండరు. మోక్షం కావాలని ప్రతి వాళ్లు కోరుకుంటారు. మోక్షం అంటే ఏమిటి ప్రతి వాళ్ళు ఒక్కో అర్ధం చెపుతారు. దీనికి కారణం హిందూ మతంలో ఏది ముక్త స్థితి అనే విషయంలో  వివిధ రకాలైన అభిప్రాయభేదాలు ఉండడమే. 


ముక్తి మోక్షము అనే మాటలకు బంధాల నుంచి విడిపోవడం అని సాధారణ అర్థం. జైలు నుంచి బయటకు రావడం కానీ గొలుసుతో కట్టివేసి ఉంటే దాని నుంచి బయట పడడం గాని సంస్కృత భాషలో ముక్తి లేదా మోక్షము అంటారు.


వేదాంతులు అజ్ఞానము మాయ మొదలైన విషయాలు జీవుడిని బంధిస్తాయి అని ఆ బంధాల నుంచి జీవుడు జ్ఞాన మార్గం ద్వారా విముక్తుడు అవడమే మోక్షము అని చెబుతారు. వేదాంతులు జీవుడికి భగవంతుడికి నిజానికి బేధం లేదని మాయ అవిద్య వల్ల బంధం ఏర్పడుతుందని జ్ఞానంతో ఆ బంధాన్ని నాశనం చేయవచ్ఛని భావిస్తారు. వీళ్ళు అసలు పరబ్రహ్మ (భగవంతుడు) నిరాకారుడని ఏ గుణాలు లేని వాడిని భావిస్తారు. స్వర్గ నరకాలు కూడా వీళ్ళ దృష్టిలో బ్రాంతి లేదా మాయ మాత్రమే. జీవుడు తన అజ్ఞానాన్ని మాయను విడిచిపెట్టి తాను భగవంతుడిని అని తెలుసుకోవడమే మోక్షము అని వేదాంతులు భావిస్తారు. ఈ విధమైన మోక్షానికి శరీరాన్ని వదిలి పెట్టవలసిన అవసరం కూడా లేదు. శరీరం ఉన్నప్పుడే బ్రాహ్మజ్ఞానాన్ని సాధించి ఆస్థితిలో ఉండగలగడం మే మోక్షం అన్నమాట.


*ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి, రామకృష్ణ  పరమహంస ఇతర అవధూతలు ఈ కోవకు చెందిన వాళ్ళు. వీళ్లను జీవన్ముక్తులు అంటారు.*


కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఈ జన్మ తరువాత ఉత్తమ లోకాలకు లేదా  ఉత్తమ జన్మలలోకి పోవడం మోక్షమని భావిస్తారు. సత్కర్మలకు ఫలితంగా మంచి జన్మలు లేదా ఉత్తమలోకాలు చెడు కర్మలకు ఫలితంగా చెడ్డ జన్మలు లేదా నరకము మొదలైన లోకాలు లభిస్తాయని వీరి నమ్మకం.  తర్వాత ఎక్కడికి పోతారు అనే విషయాన్ని పక్కన పెడితే శరీరాన్ని వదిలి పెట్టడం కూడా విదేహముక్తి అని కొందరు అంటుంటారు.


భగవంతుడికి నామ రూపాయలు ఉన్నాయని ఆయన వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ మణిద్వీపంలో గాని ఉంటాడని నమ్మేవాళ్ళు అక్కడికి వెళ్లడమే మోక్షము అని భావిస్తారు. కానీ ఇందులో కూడా చాలా తారతమ్యాలు ఉన్నాయి.


భగవంతుడికి దగ్గరగా ఉండడం ఆయనను నిత్యం చూడగలగడం సేవించుకోగలగడం అనే స్థితిని సామీప్య ముక్తి అంటారు. ఈ విధమైన ముక్తి లో జీవుడికి తన నామ రూపాలు ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ కూడా అవి తెలుస్తూ ఉంటాయి. ఈ స్థితిలో బ్రహ్మ లోకం వెళ్లినా ఈయన అత్రి మహర్షి ఈయన దూర్వాసుడు అని అందరూ గుర్తుపడతారు. ఆ విషయం వాళ్లకూ తెలుసు.


భగవంతుడి చిహ్నాలను ధరించి అదే విధమైన ఆకారంతో ఆలోకం లో భగవంతుని కి దగ్గరగా ఉండగలగడం సారూప్య ముక్తి అంటారు. ఈ విధమైన ముక్తి లో జీవునికి తన నామ రూపాలు ఉండవు. కానీ జీవుడికి తన అభిజ్ఞ ఉంటుంది. అలాగే తన చరిత్రకు సంబంధించిన జ్ఞాపకాలు తను చేసిన తపస్సు పడిన కష్టాలు అన్నీ గుర్తుంటాయి.


*భగవంతుడు శరీరంలో ఒక ఆభరణంగా గాని ఆయుధంగా గాని ఆయన వాహనంగా గాని శరీరంలో ఒక గుర్తుగా గానీ కలిసి ఉండడం సాయుజ్య ముక్తి అంటారు. యోజించడం అంటే దేనితోనైనా కలవడం. ఉదాహరణకు విష్ణుమూర్తి శంఖము చక్రము నందకము వన మాల గరుత్మంతుడు శ్రీవత్సము మొదలైన వాటిని / వారిని కూడా విడిగా దేవతలుగా భావించి పూజిస్తారు. ఆ దేవతలు  సాయుజ్య ముక్తిని పొందిన వాళ్లు. వాళ్ళు అప్పుడప్పుడు భూలోకంలో  అవతరి స్తుంటారు. ఉదాహరణకు పన్నిద్దరు ఆళ్వారులను శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలు ఆభరణాలు వాహనము మొదలైనవాటి అవతారాలుగా భావిస్తుంటారు. వాళ్లకు అప్పుడప్పుడూ గర్వం కలగడం, తర్వాత మళ్లీ భగవంతుడు వాళ్లకు గర్వభంగం కావించడం వీటికి సంబంధించిన కథలు పురాణాల్లో చాలా ఉన్నాయి. వీళ్ళను దేవతలుగా పూజించడం వీళ్లు భక్తులను అనుగ్రహించడం జరుగుతుంటుంది. వీళ్లకు ఇంతకుముందు జన్మల లో ఎక్కడ ఉన్నారు ఏం తపస్సు చేశారు ఏ పనులు చేశారు మొదలైన జ్ఞాపకాలు ఏమీ ఉండవు.*


సార్ష్టి ముక్తి అని ఇంకోటి చెప్తారు. భగవంతుడు తనకున్న కొన్ని శక్తులను (వీటిని విభూతులు అంటారు) కొందరికి ఇచ్చి కొంత పరిధి వరకు కొన్ని పరిమితులకు లోబడి ఆ శక్తులను వినియోగించుకునేటట్లు అనుగ్రహిస్తాడు. వీరు వివిధ దేవతల గా ఆయన యొక్క అనుమతి కి లో బడి సృష్టిలో పరిపాలన చేస్తుంటారు. ఉదాహరణకు ఇంద్రుడు చంద్రుడు అంకాలమ్మ పోలేరమ్మ మొదలైన దేవతల స్థితి. శ్రీ చక్రం లో వివిధ ఆవరణ లలో చాలామంది పరివార దేవతలు అమ్మవారి రూపాలతో ఉంటారని చెబుతారు. వాళ్లకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి. ఇవన్నీ సార్ష్టి ముక్తి కి ఉదాహరణలు. వీళ్ళను కూడా దేవతలుగా పూజించడం వీళ్లు భక్తులను అనుగ్రహించడం జరుగుతుంటుంది. వీళ్లకు కూడా పూర్వజన్మ వాసనలు ఉండవు. 


పైన చెప్పిన వివిధ మైన ముక్తులన్నీ భగవంతుని అనుగ్రహాన్ని బట్టి ఉంటాయి. పైన చెప్పిన వివిధ మైన ముక్తులలో దేవుడికీ జీవుడికి ఇద్దరికీ బేధం  ఉంటుంది. జీవుడికి తన సొంత వ్యక్తిత్వము, అహంకారం ఉంటాయి. 


*భగవంతుడికి పంచకృత్యాలు అనేవి ఉంటాయి. అవి సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరోధానాలు.*   *ఈ శక్తులు భగవంతుడికే ఉంటాయి.  ఆయన్ని విడిచి ఎన్నడూ వేరే వారిని ఆశ్రయించవు. సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానాల తో కలసి ఉన్న పూర్ణ స్వరూపుడైన భగవంతునిలో పూర్తిగా కలిసిపోయి తనదంటూ వ్యక్తిత్వం గాని నామరూపాలు గాని ఏమీ లేకుండా జీవుడు తిరిగి రాకుండా ఐక్య మవడం కైవల్య ముక్తి. ఇది ఆఖరి స్థితి.*


బౌద్ధులకు జైనులకు ముక్తి మోక్షము మొదలైన పదాలకు వేరే అర్థాలు ఉన్నాయి. వాళ్లలో కూడా హిందూ మతం లాగానే బోలెడు శాఖలు అభిప్రాయభేదాలు ఉన్నాయి.


ఇతర మతాలలో  జీవుడికి శరీరానికి శాశ్వత సంబంధం ఉంటుంది. వాళ్లు పునర్జన్మ లను నమ్మరు. అందువల్ల ఆ మతాల వాళ్లకు ముక్తి మోక్షము మొదలైన పదాలకు వేరే అర్థాలు ఉన్నాయి...  

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳గీతా సారాంశం

విఙ్ఞానం,ప్రఙ్ఞానం,సుజ్ఞానం

పదునెనిమిది అధ్యాయాలలో ఏడువందల శ్లోకాలతో భగవద్గీత వ్రాయబడింది. ఇందులో విఙ్ఞానం, సుఙ్ఞానం, ప్రజ్ఞానం గురించి చెప్పారు. ఈ మూడు జ్ఞానులు మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుచున్నవో చూద్దాం.

      భగవద్గీత ను కర్మ, భక్తి, జ్ఞాన యోగాలుగా విడదీసారు. మానవుడు బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి. అలా చేసిన కర్మ నుండి వివిధ 'వి' కారాలు ద్వారా పొందిన జ్ఞానం ని 'విజ్ఞానం' అన్నారు. మానవునికి సుఖజీవనానికి కావలసిన అన్నీ ఈ విజ్ఞానం ద్వారానే పొందుచున్నాడు. Cultivation, Business, Medicine, Engineering, మొదలైనవి ఈ విజ్ఞానం నుండి వచ్చినవే. కర్మ ద్వారా విజ్ఞానం పొంది సుఖాలు పొందమంది గీత.

         భక్తి నుండి వివిధ సూక్తులు ద్వారా పొందిన జ్ఞానంని "సుఙ్ఞానం" అంటారు. మానవుడు సంఘజీవనానికి కావలసిన క్రమ శిక్షణ ను ఈ సుఙ్ఞానం ద్వారా పొందుచున్నాడు. పరులను పోషించడం పుణ్యమని, పరులను హింసించడం పాపమని తెలియజేయుచున్నది. పెద్దలను గౌరవించటము, సాటివారి యందు ప్రేమ, దయ కలిగి ఉండటం ఈ సుఙ్ఞానం నుండి నేర్చుకున్నదే.

             జ్ఞానయోగం నుండి జ్ఞానంలో జ్ఞానంని తెలుసుకోవడమే "ప్రజ్ఞానం" అన్నారు. "నేనెవ్వరిని?" ఎక్కడ నుండి వచ్చేను? ఎవ్వరు నన్ను నడిపించుచున్నారు? "అని ప్రశ్నించుకొంటూ నిన్ను నీవు తెలుసుకుంటూ ఆత్మతత్వాన్ని అలవరచుకోవడమే ప్రజ్ఞానం. దీనివలన మరణ భయం ఉండదు. ఇతరులకు, నీకు తేడా కనిపించదు. అందరిలోనూ ఒకే చైతన్యం కనిపిస్తుంది. అప్పుడు రాగద్వేషాలకు తావుండక నిర్మల హ్రదయంతో త్రుప్తిగా ఉంటారు. 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳



*పవని నాగ ప్రదీప్*

కామెంట్‌లు లేవు: