ఆ.వె. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె తాయెతులును సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు.
కం. వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే.
కం. అప్పిచ్చువాడు వైద్యుడు
యెప్పుడు నెడతెగక పారు యేరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి వూరు చొరకుము సుమతీ.
చం. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక లేకయున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
పదనుగ మంచికూర నలపాకము జేసినదైన నందు నిం
పొదవెడి వుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా.
ఆ.వె. కొండనుండు నెమలి కోరినపాలిచ్చు
పశువు చదువుచుండు శిశువు తోడ
వనిత వేదములను వల్లె వేయుచునుండు
బ్రాహ్మణుండు కాకి పలలము తిను.
ఆ.వె. చెరకుతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలపైనవుండును
దీనిభావమేమి తిరుమలేశ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి