7, జులై 2021, బుధవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి లీలలు..


*మగ పిల్లవాడు..*


దాదాపు ఐదు సంవత్సరాల క్రిందట..కందుకూరు వాస్తవ్యులు శ్రీ తుమ్మపూడి సురేష్ , అయన భార్య, కూతురుతో కలిసి, శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనార్థం మొగలిచెర్ల లో గల స్వామివారి మందిరానికి వచ్చారు.. సురేష్ కు కందుకూరులో సిమెంట్, స్టీల్ వ్యాపారం ఉన్నది..ఆర్ధికంగా స్థితిపరులే..శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధిని దర్శించుకొని..పూజాదికాలు పూర్తైన తరువాత..శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చున్నారు..సురేష్ ముఖంలో ఒక విధమైన ఆందోళన ప్రస్ఫుటంగా గోచరిస్తోంది..


కొద్దిసేపు మౌనంగా ఉన్న తరువాత..ఆ దంపతులు తమ మనసులోని మాట చెప్పారు.. "ఒక కోరిక స్వామిని కోరుకున్నామండీ...నెరవేరితే, ఇక్కడ నలుగురికీ ఉపయోగపడే కార్యం ఏదైనా చేస్తాము.." అన్నారు...వాళ్లకు మొదటి సంతానం అమ్మాయి...ఆ పాప పుట్టి పదమూడు సంవత్సరాలయింది..ఆ తరువాత సంతానం లేదు..మళ్లీ ఇన్నేళ్లకు..సురేష్ గారి భార్య గర్భవతి.. మగపిల్లవాడు కావాలని ఆ దంపతుల ఇద్దరికీ మనసులో ప్రగాఢమైన కోరిక..ఆ దంపతుల ఆందోళనకు కారణమేమంటే..ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందని పరీక్ష చేసిన డాక్టర్ గారు తేల్చి చెప్పారట!..ఆ దంపతుల ఆందోళనకు మరో కారణం కూడా ఉంది..ఏమిటంటే..తాము గురువుగా భావించే ఒకానొక స్వామివారు కూడా ఈసారి వీళ్లకు ఆడపిల్లే పుడుతుందని ఘంటాపధంగా తేల్చి చెప్పేశారు..సురేష్, అతని భార్యా ఈ మాటలు విని హతాసులయ్యారు..


"మేము ఎన్నో చోట్ల తిరిగాము..మాకు పుట్టబోయేది ఆడపిల్లే అని అందరూ చెప్పారు..ఆఖరి ప్రయత్నంగా ఈ స్వామివారిని వేడుకుందామని వచ్చాము..మరి మా కోరిక తీరుతుందా?.." అని మమ్మల్ని అడిగారు..


"మనస్పూర్తిగా..సంపూర్ణ విశ్వాసం తో ఆ స్వామివారిని వేడుకొనండి..ఆ పై దైవ కృప.." అని చెప్పాము..


ఐదు వారాలపాటు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని క్రమం తప్పకుండా దర్శించుకున్నారు..ప్రతి వారమూ మనసారా శ్రీ స్వామివారిని తమకు మగబిడ్డను ప్రసాదించమని వేడుకున్నారు..


  ఈలోపల సురేష్ కు స్వప్నంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహం కనబడింది..ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది..ఆ మరుక్షణమే..ఒక యోగి కనబడి.."అంతా శుభమే జరుగుతుందని" చెప్పినట్లు అనిపించింది..లేచి చూస్తే..ఏమీ లేదు..తనకొచ్చిన కల గురించే ఆలోచించాడు..సరే..ఆ దైవ నిర్ణయం ఎలా వుంటే అలా జరుగుతుందనే నిర్ణయానికి వచ్చారా దంపతులు..ఆడపిల్ల పుట్టినా దైవప్రసాదంగా భావిస్తామని ఆ దంపతులు స్థిర చిత్తంతో చెప్పారు..


ఆ తరువాత మూడు నెలలకు ఆ దంపతులకు పండంటి మొగ పిల్లవాడు జన్మించాడు..ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు..తమ కోరికను స్వామివారు తీర్చారని మహదానందపడ్డారు..బిడ్డనెత్తుకుని స్వామివారి మందిరానికొచ్చి, ఆ దత్తాత్రేయుని సమాధి వద్ద మనసారా నమస్కారం చేసుకున్నారు..


           అన్నమాట ప్రకారం, కొద్దికాలం తరువాత, సురేష్ దంపతులు..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో, 20X24 అడుగుల విస్తీర్ణంతో మంటపం నిర్మించారు..సుమారు 150 మంది భక్తులు కూర్చుని ప్రతి శనివారం రోజు..శ్రీ స్వామివారి పల్లకీ సేవ చూసుకోవడానికీ..మిగిలిన రోజులలో భక్తులు భజన చేసుకోవడానికి ఆ మంటపం చక్కగా సరిపోతోంది..


భగవంతుడి మీద అచంచల విశ్వాసం వుంటే, భక్తుని కోరికలు ఆయనే తీరుస్తాడు..


మరో అనుభవం రేపటి భాగం లో...


సర్వం...

శ్రీ దత్త కృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: