6, జులై 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం*

 *06.07.2021  


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది ఏడవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు సాళ్వుని వధించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*77.30 (ముప్పదియవ శ్లోకము)*


*ఏవం వదంతి రాజర్షే ఋషయః కే చ నాన్వితాః|*


*యత్స్వవాచో విరుధ్యేత నూనం తే న స్మరంత్యుత॥11512॥*


పరీక్షిన్మహారాజా! పూర్వాపర విషయములను ఎరుగని కొంతమందిని గురుంచి కొందరు ఋషులు ఇట్లు పలుకుట స్వవచో వ్యాఘాతమని వారు తలంపకుందురు.


*77.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*క్వ శోకమోహౌ స్నేహో వా భయం వా యేఽజ్ఞసంభవాః|*


*క్వ చాఖండితవిజ్ఞానజ్ఞానైశ్వర్యస్త్వఖండితః॥11513॥*


అజ్ఞానులలో ఉండెడి శోకమోహములు, స్నేహభయములు ఎక్కడ? పరిపూర్ణ విజ్ఞానజ్ఞానైశ్వర్య సంపన్నుడగు శ్రీకృష్ణునిలో అవి సంభవించుట ఎక్కడ? - అది అసంభవము.


*77.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యత్పాదసేవోర్జితయాఽఽత్మవిద్యయా హిన్వంత్యనాద్యాత్మవిపర్యయగ్రహమ్|*


*లభంత ఆత్మీయమనంతమైశ్వరం కుతో ను మోహః పరమస్య సద్గతేః॥11514॥*


శ్రీకృష్ణభగవానుని పాదములను సేవించినవారికి (నామశ్రవణ కీర్తనాది రూపమున సేవించినవారికి)  ఆత్మజ్ఞానము లభించును. అట్టి ఆత్మజ్ఞానులు తమకు అనాదినుండి (అనేకజన్మలనుండి) సంక్రమించిన దేహాత్మ బుద్ధిరూప మోహమును పారద్రోలుదురు. అంతేగాదు వారు అట్టి ఆత్మజ్ఞాన ప్రభావమున అఖండైశ్వర్యమును (మోక్షమును) పొందుదురు. ఇక సత్పురుషులకు పరమగతియైన (పరమాశ్రయుడైన) శ్రీకృష్ణునిలో మోహము ఎట్లుండును?


*77.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*తం శస్త్రపూగైః ప్రహరంతమోజసా శాల్వం శరైః శౌరిరమోఘవిక్రమః |*


*విద్ధ్వాచ్ఛినద్వర్మ ధనుః శిరోమణిం సౌభం చ శత్రోర్గదయా రురోజ హ॰॥11515॥*


సాల్వుడు శ్రీకృష్ణునిపై బలముకొద్దీ శరపరంపరను ప్రయోగించుచు ఆయనను దెబ్బతీయసాగెను. అప్పుడు అమోఘపరాక్రమ సంపన్నుడైన ఆ ప్రభువు తన బాణములతో సాల్వుని గాయపఱచి, అతని కవచమును, ధనుస్సును, కిరీటమును ఛిన్నాభిన్నమొనర్చెను. ఇంకను తన  గదాఘాతముతో శత్రువు (సాల్వుని) యొక్క సౌభవిమానమును తుత్తునియలు గావించెను.


*77.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*తత్కృష్ణహస్తేరితయా విచూర్ణితం పపాత తోయే గదయా సహస్రధా|*


*విసృజ్య తద్భూతలమాస్థితో గదాముద్యమ్య  శాల్వోఽచ్యుతమభ్యగాద్ద్రుతమ్॥11516॥*


శ్రీకృష్ణుని గదాప్రహారములతో సౌభము వేలకొలది ముక్కలై సముద్రజలములలో పడిపోయెను. అది విడిపోకముందే సాల్వుడు భూతలమునకు దిగి, గదను చేబూని, వేగముగా శ్రీకృష్ణునివైపునకు దూసికొనివచ్చెను.


*77.36 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఆధావతః సగదం తస్య బాహుం భల్లేన ఛిత్త్వాథ రథాంగమద్భుతమ్|*


*వధాయ శాల్వస్య లయార్కసన్నిభం బిభ్రద్బభౌ సార్క ఇవోదయాచలః॥11517॥*


గదను తీసికొని పరుగుపరుగున వచ్చుచున్న సాల్వునియొక్క బాహువును శ్రీకృష్ణుడు బల్లెముతో ఛేదించెను. పిమ్మట శౌరి సాల్వుని సంహరించుటకై ప్రళయకాల సూర్యునివలె వెలుగొందుచు అద్భుతముగానున్న తన చక్రమును చేతబట్టెను. అప్పుడు ఆ స్వామి సూర్యునితోగూడిన ఉదయగిరివలె శోభిల్లెను.


*77.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*జహార తేనైవ శిరః సకుండలం  కిరీటయుక్తం పురుమాయినో హరిః|*


*వజ్రేణ వృత్రస్య యథా పురందరో బభూవ హాహేతి వచస్తదా నృణామ్॥11518॥*


కర్ణకుండలములతో, మణికిరీటములతో విలసిల్లుచున్న ఆ మాయావి (సాల్వుని) శిరస్సును శ్రీహరి (శ్రీకృష్ణుడు) ఆ చక్రముతో వృత్రాసురుని శిరస్సును ఇంద్రుడు  వజ్రాయుధముతో వలె ఖండించెను. అప్పుడు సాల్వుని పక్షమునకు చెందిన సైనికులు ఎల్లరును హాహాకారములు గావించిరి.


*77.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*తస్మిన్ నిపతితే పాపే సౌభే చ గదయా హతే|*


*నేదుర్దుందుభయో రాజన్ దివి దేవగణేరితాః|*


*సఖీనామపచితిం కుర్వన్ దంతవక్త్రో రుషాభ్యగాత్॥11519॥*


మహారాజా! శ్రీకృష్ణుని గదాఘాతమునకు సౌభము సముద్రమున కూలిపోగా, పాపాత్ముడు సాల్వుడు నిహతుడుకాగా, ఆకసమున దేవతలు దుందుభులను మ్రోగించిరి. అదే సమయమున దంతవక్త్రుడు తన మిత్రులైన శిశుపాలుడు, సాల్వుడు మొదలగువారిని హతమొనర్చిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకొనుటకు మిగుల క్రుద్ధుడై దాడికి దిగెను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే సౌభవధో నామ సప్తసప్తతితమోఽధ్యాయః  (77)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *శ్రీకృష్ణుడు సాళ్వుని వధించుట* అను డెబ్బది ఏడవ అధ్యాయము (77)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: