6, జులై 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది ఏడవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు సాళ్వుని వధించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*77.9 (తొమ్మిదవ శ్లోకము)*


*వీక్ష్య తత్కదనం స్వానాం నిరూప్య పురరక్షణమ్|*


*సౌభం చ శాల్వరాజం చ దారుకం ప్రాహ కేశవః॥11491॥*


శ్రీకృష్ణుడు ద్వారకకు చేరినంతనే తనవారికిని సాల్వసైన్యములకును మధ్య జరుగుచున్న యుద్ధమును గమనించెను. సౌభము, పురరక్షణమునకై బలరాముని నియమించి, దారుకునితో (సారథితో) ఇట్లనెను-


*77.10 (పదియవ శ్లోకము)*


*రథం ప్రాపయ మే సూత శాల్వస్యాంతికమాశు వై|*


*సంభ్రమస్తే న కర్తవ్యో మాయావీ సౌభరాడయమ్॥11492॥*


"సారథీ! నా రథమును వెంటనే సాల్వుని సమీపమునకు చేర్చుము. ఈ సాల్వుడు గొప్ప మాయావి. ఇతని పోకడలను చూచి నీవు ఏమాత్రమూ తొట్రుపడవద్దు"


*77.11 (పదకొండవ శ్లోకము)*


*ఇత్యుక్తశ్చోదయామాస రథమాస్థాయ దారుకః|*


*విశంతం దదృశుః సర్వే స్వే పరే చారుణానుజమ్॥11493॥*


శ్రీకృష్ణప్రభువు ఇట్లు ఆదేశించినంతనే దారుకుడు రథమును సాల్వుని కడకు నడపెను. గరుడధ్వజముగల రథముపై ఆ స్వామి రణరంగమున ప్రవేశించుటను అచటనున్న యాదవవీరులను, సాల్వుని యోధులు చూచిరి.


*77.12 (పండ్రెండవ శ్లోకము)*


*శాల్వశ్చ కృష్ణమాలోక్య హతప్రాయబలేశ్వరః|*


*ప్రాహరత్కృష్ణసూతాయ శక్తిం భీమరవాం మృధే॥11494॥*


*77.13 (పదమూడవ శ్లోకము)*


*తామాపతంతీం నభసి మహోల్కామివ రంహసా|*


*భాసయంతీం దిశః శౌరిః సాయకైః శతధాచ్ఛినత్॥11495॥*


పరీక్షిన్మహారాజా! సాల్వుడుగూడ శ్రీకృష్ణుని చూచెను. అప్పటికే గదుడు మున్నగువారిచే అతని బలములు  దాదాపు హతమైయుండెను. అంతట అతడు కృష్ణుని రథసారథియగు దారుకునిపై *శక్తి* ని ప్రయోగించెను. అది యుద్ధరంగముస భీకరధ్వనులను గావించుచు విజృంభించెను. ఆకాశమున ఉల్కవలె తన కాంతులను దశదిశలను నింపుచు, అతివేగముగా సారథిపై బయటకు వచ్చుచున్న ఆ శక్తిని జూచి, శ్రీకృష్ణుడు తన శరాఘాతమలచే దానిని వందలకొలది ముక్కలు గావించెను.


*77.14 (పదునాలుగవ శ్లోకము)*


*తం చ షోడశభిర్విద్ధ్వా బాణైః సౌభం చ ఖే భ్రమత్|*


*అవిధ్యచ్ఛరసందోహైః ఖం సూర్య ఇవ రశ్మిభిః॥11496॥*


పిమ్మట ఆ ప్రభువు సాల్వునిపదునాఱు బాణములతో కొట్టెను. మఱియు సూర్యుడు తన కిరణములచే ఆకాశమును వలె, గగనతలమున పరిభ్రమించుచున్న ఆసౌభవిమానమును,  ఆ స్వామి తన బాణజాలముచే కప్పివేసెను.


*77.15 (పదిహేనవ శ్లోకము)*


*శాల్వః శౌరేస్తు దోః సవ్యం సశార్ఙ్గం శార్ఙ్గధన్వనః|*


*బిభేద న్యపతద్ధస్తాచ్ఛార్ఙ్గమాసీత్తదద్భుతమ్॥11497॥*


అంతట సాల్వుడు శారఙ్గ ధనుస్సుతో విలసిల్లుచున్న శ్రీకృష్ణునిఎడమభుజమును తన బాణముతో కొట్టెను. వెంటనే ఆ ధనుస్సు ఆ స్వామి చేతినుండి క్రింద పడిపోయెను.  మెఱుపు వేగముతో జరిగిన ఆ దృశ్యము అద్భుతావహమైయుండెను.


*77.16 (పదహారవ శ్లోకము)*


*హాహాకారో మహానాసీద్భూతానాం తత్ర పశ్యతామ్|*


*వినద్య సౌభరాడుచ్చైరిదమాహ జనార్దనమ్॥11498॥*


గగనతలమునందును, భూతలమునందును ఉండి ఆ అద్భుత సంఘటనను చూచినవారు అందఱును హాహాకారములు చేయసాగిరి. అప్పుడు సాల్వుడు బిగ్గరగా గర్జించుచు కృష్ణునితో ఇట్లనెను-


*77.17 (పదిహేడవ శ్లోకము)*


*యత్త్వయా మూఢ నః సఖ్యుర్భ్రాతుర్భార్యా హృతేక్షతామ్|*

.

*ప్రమత్తః స సభామధ్యే త్వయా వ్యాపాదితః సఖా॥11499॥*


*77.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*తం త్వాద్య నిశితైర్బాణైరపరాజితమానినమ్|*


*నయామ్యపునరావృత్తిం యది తిష్ఠేర్మమాగ్రతః॥11500॥*


"మూర్ఖుడా! మాకు మిత్రుడు, సోదరుడు ఐన శిశుపాలుని భార్యను (శిశుపాలునికి ఇచ్చి పెండ్లిచేయుటకై నిశ్చయింపబడిన రుక్మిణిని మేము అందరము చూచుచుండగనే అపహరించితివి. అంతేగాక ధర్మరాజుయొక్క రాజసూయ యాగసభలో మా మిత్రుడైన శిశుపాలుడు ఏమరుపాటుతో సుండగా అతనిని అన్యాయముగా పొట్టనబెట్టుకొంటివి. నిన్ను నీవు అజేయునిగా భావించుకొనుచున్నావు. నేడు నీవు నా యెదుట నిల్చినచో, నా నిశిత శరములతో నిన్ను తిరిగిరాని లోకములకు పంపెదను".


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: