6, జులై 2021, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..


*పుప్పాల లక్షమ్మ ..*


దాదాపు 12 సంవత్సరాల క్రితం సంఘటన ఇది..చావు బతుకుల్లో ఉన్న ఓ యువతిని తీసుకుని..ఆమెకు దగ్గర సంబంధీకులు మొగలిచెర్ల గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికొచ్చారు..వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందేమో..ఆమె పరిస్థితి చూస్తే.. కొద్ది రోజులకన్నా ఎక్కువకాలం బ్రతికేటట్లుగా అనిపించడం లేదు..కుడి దవడ మీద పెద్ద పుండు..లోపలి భాగానికి రంధ్రం పడివుంది..మాట లేదు..కేవలం ఎముకల గూడు లాగా బక్కచిక్కిపోయి ఉన్నది..

నోటి కాన్సర్ వచ్చిన వాళ్ళ లాగా భయానకంగా ఉన్నది..పూర్తిగా ఆశ వదిలేసి, చివరి ప్రయత్నంగా శ్రీ దత్తాత్రేయుని సన్నిధికి చేర్చారు..ఒకరంగా ఈమెను  వదిలించుకునే ప్రయత్నం లోనేే వాళ్ళు వచ్చారు..ఎలాగూ ఈమనిషి బ్రతకడం కష్టం..ఈ స్వామి దగ్గర వదిలేసి వెళ్లిపోదామని వాళ్ళు అనుకున్నారు..బ్రతికిఉన్న నాలుగు రోజులూ చూడటానికి ఎవరో ఒకరు దగ్గరుంటే చాలు..అని నిర్ణయించుకున్నారు..తమలోనే ఉన్న ఒక ముసలామెను ఈ మనిషి కి తోడుగా ఉంచాలని నిర్ణయించుకున్నారు..అది వాళ్ళ ఆలోచన..కానీ దైవ తలంపు వేరుగా ఉంటుంది కదా!..


వివరాల్లోకి వెళితే... ఆమె పేరు పుప్పాల లక్ష్మీదేవి, నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, వెలిగండ్ల గ్రామ నివాసి..


ఇక లక్షమ్మ ఏ నిమిషంలో ఆ స్వామి సన్నిధిలో అడుగుపెట్టిందో తెలీదు కానీ, త్వరలోనే చనిపోతుంది, ఎక్కువ రోజులు  బ్రతుకదు అనుకున్న లక్ష్మీ దేవి లో మార్పు కనబడసాగింది..తాను బ్రతకాలంటే తనకు ఉన్న ఏకైక మార్గం..ఆ దత్తాత్రేయుడిని మనసా వాచా నమ్మడమే..సర్వస్య శరణాగతి చెందడమే..అని లక్షమ్మ నిశ్చయించుకున్నది..శ్రీ స్వామివారి తీర్ధాన్ని తీసుకునేది..రోజులు గడుస్తున్నాయి..లక్షమ్మ తన మనసులో ఎంతగా ప్రార్ధించిందో..ఏయే మ్రొక్కులు మ్రొక్కుకున్నదో..ఆ దత్తాత్రేయుడి కే తెలియాలి..శ్రీ స్వామివారి కరుణ జాలువారింది..ఎప్పుడూ స్వామి మంటపంలో పడుకునే ఉండే లక్ష్మీ దేవి మెల్లగా ఒక్కొక్క అడుగు వేయసాగింది..దవడ నుంచి నోటిలోకి ప్రాకి, భయంకరంగా కనపడే ఆ పుండు మానడం మొదలుపెట్టింది..ఏ మందు వాడటం లేదు..కేవలం స్వామి వారి వీభూది తప్ప..మూడుపూటలా హారతి, తీర్ధం తీసుకునే అలవాటు చేసుకున్నది..మేమంతా లక్షమ్మా అని పిలిచేవాళ్ళం..(ఈ క్షణం లో ఆమె గురించి ఇలా పోస్ట్ పెడదామని అనుకున్నప్పుడే ఆమె పూర్తీ పేరు లక్ష్మీ దేవి అని నేను తెలుసుకున్నాను..)


కొన్నాళ్ళకు ఆ నోటి పుండు క్రమంగా తగ్గుముఖం పట్టింది..కొద్దీ కొద్దిగా ఆహారం తీసుకోసాగింది..మాట్లాడటం మర్చిపోయిన  లక్షమ్మ కు మాటలూ స్పష్టంగా వచ్చాయి..స్వామి వారి భజనలో ఇతరులతో కలిసి గొంతు కలిపి పాడటం చేయసాగింది..ప్రతిరోజూ నియమానుసారంగా శ్రీ స్వామివారి గుడి చుట్టూ..ఎవరి చేయూతా లేకుండా తానే ప్రదక్షిణాలు చేయసాగింది..


మేమందరమూ లక్షమ్మ కోలుకోవడం కళ్ళారా చూస్తూనే ఉన్నాము..ప్రస్తుతం లక్షమ్మ అని మాచేత పిలువబడే ఆ పుప్పాల లక్ష్మీదేవి శాశ్వత చిరునామా శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరమే..ప్రతిరోజూ శ్రీ స్వామివారి ప్రభాత సేవకు తులసి, పూలూ కోసుకొచ్చి ఇస్తుంది.. భజనలో స్వామి వారి పాటలు గొంతెత్తి పాడుతుంది.. శ్రీ స్వామివారి మండపం లోనే నిద్ర పోతుంది..


ఆప్తులు అనుకున్న వాళ్ళు..చివరకు కట్టుకున్న వాడు కూడా  అనారోగ్యంతో ఉన్న తనను  అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినా...తను మాత్రం ఆ దత్తాత్రేయుడి పాదాలే నమ్ముకున్నది..ఆ స్వామి వద్దే తన శేష జీవితమని నిశ్చయించుకున్నది..ప్రతి సంవత్సరం దత్తదీక్ష తీసుకుంటుంది..సర్వకాల సర్వావస్థలయందూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి స్మరణే ధ్యాసగా జీవిస్తున్నది..


శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో ఉన్న మేమమందరమూ మామూలుగా మాటల సందర్భంలో చెప్పుకునే ఓ మాట.."అంతెందుకు, మనమంతా లక్షమ్మను చూడటం లేదూ..అంతకంటే స్వామి లీల చెప్పుకోవాలా"? అని..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: