6, జులై 2021, మంగళవారం

*విష్ణు సహస్ర నామం

 *విష్ణు సహస్ర నామం..* 


*(చివరి భాగం.)*


సహస్రనామం లో ఉన్న వెయ్యి మాటలు 1000 మంత్రాలు అయినప్పటికీ మొత్తం స్తోత్రాన్ని ఒకటే మంత్రం గా కుడా పరిగణిస్తారు. మాలా మంత్రము అనే పేరు విష్ణు సహస్రనామానికి ఒక్క దానికే సరిగ్గా అన్వయిస్తుంది. అంగన్యాస కరన్యాస సహితంగా ఈ మాలా మంత్ర పారాయణ చేస్తారు. అంగన్యాస కరన్యాసాలు అన్ని మంత్రాలకు  ఉంటాయి. ఋషి చందస్సు దేవత బీజం శక్తి మంత్రం కీలకం అస్త్రం నేత్రం కవచం ఇవన్నీ చాలా మంత్రాలకు ఉంటాయి. తర్వాత దిగ్బంధనం ధ్యానం వినియోగం ఉంటాయి. 


*విష్ణు సహస్రనామం లో మాత్రమే " ఆనందం పర బ్రహ్మేతి యోనిః " అనే విలక్షణమైన ప్రయోగం ఉంటుంది. ఆనంద స్వరూపుడు అయిన పరబ్రహ్మమే మూలము అని దాని అర్థం. ఇది సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాంతాన్ని విడిగా చదువుకో అక్కర్లేదు.  అద్భుతమైన భావన..*


 సంధ్యా వందనమప్పుడు ఆచమనం తోపాటూ చెప్పుకునే  కేశవ నామాలు విష్ణు సహస్రనామం లో ఉన్నాయి. అలాగే నారాయణ కవచం లో ఉండే నామాలన్నీ కూడా ఈ విష్ణు సహస్రనామం లో ఉన్నాయి. అందువల్ల విష్ణు సహస్రనామ పఠనం వల్ల నారాయణ కవచంపఠన ఫలితం కూడా వస్తుంది. 


ఆదిశంకరులవారు నేను రాయవలసింది ఇంకేమన్నా మిగిలి ఉందా సూచించండి అని శిష్యులందరినీ అడిగారుట. ఒక్కొక్కరిని వాళ్లకు తోచిన విషయాన్ని ఒక ఆకు మీద రాసి తెమ్మన్నారట. అందరూ రాసింది చూస్తే అన్ని ఆకుల మీద విష్ణు సహస్రనామానికి భాష్యం రాయండి అని ఉందట. అది శంకర భాష్యానికి అదే ప్రాతిపదిక.


శంకరాచార్యులవారు స్తోత్ర లక్షణాలను వివరిస్తూ ప్రతి స్తోత్రం లోనూ నమస్కారము ఆశీర్వాదము సిద్ధాంతము అనంత శక్తి నిరూపణము, దివ్యైశ్వర్య వివరణ, ప్రార్థన అని ఆరు అంగాలు ఉండాలి అని సూత్రీకరించారు. ఆయన చేసిన అన్ని స్తోత్రాలలో నూ అలా ఆరు అంగాలు ఉంటాయి. వ్యాసుడు రచించిన విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రార్థన లేదు.  సర్వ ప్రహరణాయుధ అనేది వ్యాసుల వారు రాసిన 1000 వ నామం. దాని తర్వాత శంకరులవారు "వనమాలీ గదీ.... వాసుదేవోz భిరక్షతు" శ్లోకాన్ని కలిపి 1008 నామాలు చేశారు.  అప్పుడు "అట్టి శ్రీ మహావిష్ణువు మమ్ములను రక్షించుగాక" అనే ప్రార్థన సిద్ధించింది. ఆ శ్లోకం వ్యాస భారతంలో ఉండదు. 


విష్ణు సహస్ర నామాలు విడివిడిగా మంత్రాలుగా కానీ మాలామంత్రం గా గానీ అంగన్యాస కరన్యాసాలు మొదలైన నియమాలేవీ లేకుండా స్త్రీలూ పిల్లలూ అన్ని వర్ణాల వాళ్ళు కంఠతా పట్టి స్తోత్రం లాగా కూడా చదువుకోవడానికి అనువుగా ఉంటుంది.


వ్యాసుడు రచించిన విష్ణు సహస్రనామం లో వెయ్యి విడి నామాలు లేవు. కొన్ని నామాలు రెండుసార్లు కొన్ని నామాల మూడు సార్లు అలా మళ్లీ మళ్లీ వచ్చాయి. ఉదాహరణకు వాసుదేవ నామము వసు ప్రద నామము రెండు రెండు సార్లు వచ్చ్చాయి.  ఒకే అర్థం వచ్చే రెండు మూడు నామాలు  శ్రీపతి శ్రీధర వంటివి వాడారు.  వాటికి ఆదిశంకరులవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త అర్థం చెబుతూ భాష్యం రాసి పునరుక్తి దోషం లేకుండా చేశారు. 


ఆదిశంకరులు తన భజ గోవింద స్తోత్రంలో  "గేయం గీతా నామ సహస్రం" అన్న చోట గీతా అంటే భగవద్గీత అని. నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామం అనీ రూఢి గా చెప్పారు. ఆయన ఉద్దేశంలో వేరే సహస్రనామాలు సహస్రనామాలే  కావు.


*ఉపాసకులకు ఆధ్యాత్మిక వాదులకు సాధారణ భక్తులకు అందరికీ ఉపయోగ పడేది విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం మోక్షానికి సులభమూ సుఖమూ అయిన మార్గము...*


*పవని నాగ ప్రదీప్*

కామెంట్‌లు లేవు: