6, జులై 2021, మంగళవారం

మార్తాండ భైరవారాధ్యా

 785. 🔱🙏  మార్తాండ భైరవారాధ్యా  🙏🔱

ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *మార్తాండ భైరవారాధ్యాయై నమః* అని చెప్పాలి.

మార్తాండ భైరవ = మార్తాండ భైరవునిచే, 

ఆరాధ్యా = ఆరాధింపబడునది. ఈ భైరవుల గురించి మరికొన్ని విశేషాలు 276 నామం అయిన 'భైరవీ' అనే నామ వివరణలో కూడా ఇవ్వబడినాయి.

ఎనిమిది మంది భైరవుల సమష్టి రూపాన్ని 'మహాభై రవుడు' గా అర్థం చేసుకోవచ్చును. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుడ్లే ' మహాభైరవుడు' అంటారు. మహాభైరవుడు - అమ్మవారిని చక్కగా ఆరాధించి, అమ్మవారి అనుగ్రహం వలన సూర్య తేజస్సును పొందాడు. అప్పటి నుండే మార్తాండ భైరవుడనే నామంతో పిలవబడ్డాడు. ఈ మార్తాండ భైరవునిచే ఆరాధించబడింది కాబట్టి - అమ్మవారు, 'మార్తాండ భైరవారాధ్యా'.

శ్రీమన్నగర వర్ణనలో చెప్పబడినట్లు ఇరువది రెండవ ఆవరణానికి దేవత ఈ మార్తాండ భైరవుడే ! ఈ మార్తాండ భైరవుడు తన ఇద్దరు భార్యలైన చక్షుష్మతీ, ఛాయాదేవిలతో కలసి అమ్మవారిని ఆరాధిస్తాడు.

ఉచ్ఛ్వాస నిశ్వాసలకు, మనం పలుకుదామన్న ఇచ్ఛకు మధ్య ఉన్నవారే భైరవులు. మనం పలక బోయే మాటకు ఉత్పత్తి కేంద్రంగా ఉండే వాడు మార్తాండ భైరవుడైతే, వాక్కులాగా బయటకు వచ్చేవాళ్ళు భైరవులు అవుతారు. అందుకే భైరవులకు సమష్టి రూపం మార్తాండ భైరవుడౌతాడు. ఈ మార్తాండ భైరవ మంత్రానికి “సయశ్చాయం పురుషే యశ్చాసావా దిత్యే సఏక!' అనేవి మూలమంత్రాలుగా తైత్తిరీయంలో చెప్పబడతాయి. గ్రామాల్లో ఈ మంత్ర ఉపాసన చేస్తే - త్వరితంగా వ్యాపించే అంటు వ్యాధులు, తరుణ వ్యాధులు త్వర త్వరగా దూరమై గ్రామ ప్రజలు కాపాడబడతారు. ఈ ఉపాసనలో తెల్ల జిల్లేడు, ఉమ్మెత్తల వాడకం కూడా ఉంటుంది. ఉమ్మెత్త (ఉన్మత్త) మానసిక రుగ్మతలను కూడా పోగొడుతుంది. (ఈ విషయం276 నామ వివరణలో విపులంగా చెప్పబడినది).

‘మార్తాండ భైరవునిచే ఆరాధింపబడునది' అని ఈ నామానికి అర్థం.


🙏ఓం ఐం హ్రీం శ్రీం మార్తాండ భైరవారాధ్యాయై నమః🙏

🌷శ్రీ  మాత్రే  నమః 🌷

కామెంట్‌లు లేవు: