నిరంతర సంఘర్షణ// ఇది నా ఒక్కడికేనా? అసల సంఘర్షణ ఎందుకు వస్తోంది, ఎందుకీ ఆరాటం, ఏది దొరికితే, ఏది సంపాదిస్తే ఇక ఈ ఆరాటం, పోరాటం తగ్గుతుంది? డబ్బా, పదవా, పేరా...అబ్బే ఇవి అవసరాలు. కేవల సుఖాలు ఇచ్చేవి. ఇవన్నీ వచ్చి పోయేవే కదా. ఇవి కాదు, ఎప్పటికీ శ్రేయస్సు నిచ్చేది, తరగని ఆనందం ఇచ్చేది కావాలి. అంటే శ్రేయోదాయకాలు కావాలి. ఇవి నాకు ఎక్కడ దొరుకుతాయి? ఎలా దొరుకుతాయి, నా అన్వేషణ, ఘర్షణ ఆగేదెప్పుడు? లీలగా స్ఫురించింది. మాధవా అనుకో రా అని, కృష్ణా అనుకోరా అని. కృష్ణా..అనేశాను అప్రయత్నంగా. ఆ అనుభూతి ఇదని కచ్చితంగా చెప్పలేను కానీ, అందరిలో ఉన్నా నేను ఒక్కడినే, నాతో ఆయన ఒక్కడే అనిపించింది. ఆ రూపం, ఆ మురళీ రవం..గోలోకం అంటే అదే కావచ్చు. ఎప్పటికీ ఇక్కడే ఉంచెయ్ స్వామీ, ఇక వెళ్లను.. అంటుంటే..ఆయన నవ్వుతున్నాడు. ఆ చిదా నందం శాశ్వతం కావాలనిపించింది. ఠక్కున మాయమయ్యాడు. మళ్లీ సంఘర్షణ మొదలైంది. కాకపోతే ఒక్కటి అర్థమైంది. ఎవరి స్మరణ చేస్తే క్షణకాలం ఆనందం కలిగిందో ఆయనను క్షణం కూడా మరువకుండా ఉంటే ఆ ఆనందం క్షణికం కాదని, శాశ్వత మవుతుందని, ఇక సంఘర్షణకు తావులేదని. ఇది స్వగతమో, స్వానుభవమో, రచనో, పైత్యమో, నా వెర్రితన మో నాకే తెలియదు.// ఆదూరి వేంకటేశ్వర రావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి