6, జులై 2021, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము *931వ నామ మంత్రము *

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*931వ నామ మంత్రము* 06.07.2031


*ఓం మానవత్యై నమః*


చిత్తసమున్నతి గలిగినది జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మానవతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మానవత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ పరమేశ్వరి సర్వదా ఆపదలందు కాపాడుచు, ధనకనకవస్తువాహన సమృద్ధి కలుగజేస్తూ, పరమాత్మపై ఎనలేని భక్తిప్రపత్తులను సుస్థిరముచేసి తరింపజేయును.


పరమేశ్వరి అభిమానవతి. ఉత్కృష్టురాలననే చిత్తౌన్నత్యము కలిగినది. నవదుర్గలుగాను, వివిధ గ్రామదేవతలుగా అవతరించినను, జన్మజన్మలయందును కూడా పరమేశ్వరునే భర్తగా పొందిసయంతటి మహాపతివ్రత. *కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత* కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్యమృదుత్వాలతో కూడిన ఉరుద్వయంగలిగి  శివశక్త్యౌక్యము నిరూపితమైనంతటి మహాపతివ్రత. గనుకనే శ్రీమాత *మానవతీ*. యని అనబడినది. శివునిలో సగందేహమును తన సొంతము చేసుకొనినంతటి  *స్వాధీనవల్లభ* గనుకనే ఆ శ్రీమాత *మానవతీ* యని అనబడినది. భండాసుర, మహిషాసురాది రాక్షసులను సంహరించి, దేవతలను కాపాడినది *(దేవకార్యసముద్యత)* గనుకనే *మానవతీ* యని అనబడినది.


వాడవాడలా, కొండలలోను, వనములందు - ఎల్లెడల లలితాపరమేశ్వరిగా, అష్టాదశ శక్తిపీఠాధీశ్వరిగా, గ్రామదేవతగా కొలువబడిన విశేషమైన కీర్తిప్రతిష్ఠలు గలిగినది గనుకనే *మానవతీ* యని అనబడినది.


మువురమ్మలకు మూలపుటమ్మయై, కుడియెడమలందు లక్ష్మీసరస్వతులు చామరములచే సేవింపబడినంతటి గౌరవాదరణములుగలిగి *మానవతీ* యని స్తుతింపబడుచున్నది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: