31, జులై 2021, శనివారం

ఉద్యోగము

 ఉద్యోగము

ఉద్యోగము! ఉద్యోగము!! ఉద్యోగము!!! ఈ రోజులలో ప్రతి చదువుకున్నవ్యక్తి ఉద్యోగమును ఆశించేవాడే, ఉద్యోగముకొరకు ప్రయత్నించేవాడే. కానీ ఆశించి, ప్రయత్నించిన వారిలో ఏ కొద్దిమందికో ఉద్యోగాలు దొరుకుతున్నవి. మిగతావారికి అంతే సంగతులు! ఎందుకంటే ప్రభుత్వమువారు ఉద్యోగములు ఇవ్వడము లేదు అంటారు. ప్రభుత్వము ఎందుకు ఉద్యోగములు ఇవ్వడము లేదు అనేది చాలామంది విచారించరు. ప్రభుత్వము ఉద్యోగములు ఇవ్వకపోవడానికి వారి కారణాలు వారికున్నాయి అయితే, వాటిని పైకి చెప్పరు. పైకి మాత్రం ఇస్తాం, ఇస్తాం అంటారు…


దానితో నిరుద్యోగులు దినములు, నెలలు, సంవత్సరములు ఉద్యోగముల కొరకు ఎదురుచూస్తూనే కాలాన్ని గడుపుతారు. అట్లు ఎదురుచూసిన వారిలో అతి కొద్ది మందికే ఉద్యోగాలు వస్తున్నాయి, మిగతావారు ఎదురుచూసి, ఎదురుచూసి… అందులో కొంతమంది డిప్రెషనుకు లోనై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తద్వారా వారి తల్లిదండ్రులకు మరియు వారిమీద ఆధారపడ్డవారికి తీరని దుఃఖమును కలిగిస్తున్నారు. ఇది మనందరము నిత్యము చూస్తున్నదే, వింటున్నదే, తెలిసినదే. 


అయితే, మనము ఇప్పుడు ఉద్యోగము అంటే ఏమిటో తెలుసుకుందాం. “ఉద్యోగము” అనే సంస్కృత పదములో రెండు పదములున్నవి “ఉత్+యోగము=ఉద్యోగము “ఉత్” అనగా ఉన్నతమైన. “యోగము” అనగా కలయిక అంటే ఉన్నతమైన విషయముతో కలయిక. ఉద్యోగమునకు ఇంకొక అర్థము “ప్రయత్నము” అందువలననే పూర్వము మన ఋషులు “ఉద్యోగం పురుష లక్షణం” అని అన్నారు. అనగా, ప్రయత్నమే పురుషలక్షణం, అంతేగాని ఏదో ఒక ఉద్యోగము చేయుట కాదు. మరి అట్లయితే ఈ కాలములో స్త్రీలు కూడా ఉద్యోగము చేస్తున్నారు కదా! వారు కూడా పురుషులేనా? మరి ఎందఱో పురుషులు ఉద్యోగము చెయ్యని వారున్నారు కదా! వారు పురుషులు కారా? 

  

అది కాదు సరియైన అర్థము, ప్రయత్నము చేసేవారందరూ పురుషులే! అని. “ఇంకా పురుషుడు అనే పదమునకు సరియైన అర్థము మన శరీరము అనే పురములో నఖశిఖ పర్యంతము ఉన్న దివ్య చైతన్యమునకే పురుషుడు అని పేరు. అంతేగాని గడ్డము మీసము ఉన్నవాడు పురుషుడు అని కాదు”. మనము ప్రొద్దున నిద్రలేచినది మొదలు ప్రతి చిన్న విషయమునకు ప్రయత్నము చేస్తూనే ఉంటాము. పళ్ళు తోముకోవడానికి, స్నానము చెయ్యడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, అన్నము వండుకోవడానికి ఇట్లా అనేక విషయములకు ఎంతో ప్రయత్నము చేస్తూనే ఉంటాము.

ఆ ప్రయత్నము చేయడమునే “సాధన” అంటారు. అందుకే “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్నారు. కనుక, ఇట్టి నిత్యకృత్యములకే ఎన్నో ప్రయత్నములు చెయ్యవలసి వచ్చినప్పుడు, మన కుటుంబ పోషణకు మనము ఇంకా ఎంత ప్రయత్నించాలి. 

 మన భారత దేశము కర్మభూమి! త్యాగభూమి!! యోగభూమి!!! కానీ, భోగభూమి మాత్రము కాదు. మన పూర్వీకులు ఎవ్వరు కూడా సోమరిగా జీవితమును గడపలేదు. వారు పడ్డ కష్టములను తలచుకుంటే మనవి ఒక కష్టాలేనా అనిపిస్తుంది. పూర్వపు రోజులలో వారికి ఇప్పుడున్న సౌకర్యాలు లేవు. అనగా, రోడ్లు సరిగా లేవు, ఆటోలు, బస్సులు, ద్విచక్రవాహనములు లాంటివి లేవు. ఒక సైకిల్ ఉంటే, మహాగొప్ప! ఆ రోజులలో. ఇంకా, కట్టెలపొయ్యి మీద వండుకోవడము. బియ్యము కావాలంటే వడ్లు దంచుకోవాలి, పిండి కావాలంటే విసురుకోవాలి మరియు కారము కావాలంటే దంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళవలసిననూ నడచి వెళ్ళేవారు. మరియు ఈ రోజులలో ఉన్నట్లు వారికి రేడియోలు, టి.వి.లు, సినిమాలు, ఫోన్లు, కంప్యూటర్లు లేవు. వారికి ఇవేవీ లేకపోయినా, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి వారు ఎంతో తృప్తిగా, ఆనందముగా, ఆరోగ్యముగా జీవితమును గడిపినారు.     


మన పూర్వీకులు ఎవ్వరు కూడా ప్రభుత్వ ఉద్యోగముకొరకు పాటుపడలేదు, వారికి అట్టి ఆలోచన కూడా లేదు. మరి, ఏమి చేసి బ్రతికినారు? అంటే మన భారత దేశములో ప్రధానమైనది వ్యవసాయము, కనుక చాలామంది వ్యవసాయము చేసుకొని బ్రతికేవారు. ఇంకా కొంతమంది వ్యవసాయ ఆధారితమైన పనులు మరియు కులవృత్తులు అనగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి. మంగలి, స్వర్ణకారులు, పద్మశాలీలు మొదలగు వారు వారియొక్క పనులను చేస్తూ జీవించేవారు. 


మన పూర్వీకులు ఉద్యోగములను కోరకపోవడానికి కారణము, ఆ రోజులలో ఇప్పుడున్నంత పెద్ద మొత్తములో జీతాలు లేకపోవడము కూడా ఒక కారణముగా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్య కారణము ఏమనగా, అప్పుడన్నీ ఉమ్మడి కుటుంబాలు కావడము. ఎట్లనగా, ఉద్యోగము చేస్తే ఎక్కడనో నా కుటుంబమునకు, బంధువులకు దూరముగా వారిని వదలి ఉండవలసి వస్తుందని, వారిని విడిచి ఉండలేనని ఈ ప్రేమాభిమానములకంటే నాకు డబ్బు ప్రధానము కాదని అనుకునేవారు. కానీ, ఇప్పుడు అట్లాకాదు, ఉద్యోగమువస్తే చాలు! డబ్బు వస్తే చాలు! ఎక్కడైనా ఉంటాను, ఎవ్వరికైనా దూరంగా అంటే తల్లిదండ్రులకే కాదు చివరికి భార్యాబిడ్డలకైనా సరే దూరంగా ఉంటాను. అది ఎంత దూరమైనా సరే అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, చివరకు అండమాన్ అయినా సరే! అని. అప్పటికి ఇప్పటికి ఆలోచనలలో ఎంత తేడా?


ఉద్యోగము కోరుకునే వారికి ఒక చిన్న మనవి: అదేమంటే, మీరు ఉద్యోగము కొరకు ప్రయత్నించండి. తప్పు లేదు! కానీ ఈ రోజులలో ఉద్యోగము రావడమనేది కష్టమని, రికమండేషనో, ఇంకేదో... ఇంకేదో... ఉంటేనే ఉద్యోగము వస్తున్నదని వింటున్నాము. కనుక, మీరు ఉద్యోగమును ఆశించే బదులు, మీరే నలుగురికి ఉద్యోగము ఇచ్చే స్థాయికి ఎందుకు ఎదగకూడదు? ఆలోచించండి!


నలుగురికి ఉద్యోగమివ్వడమంటే మాటలా! అని మీరు అనుకోవద్దు. నలుగురికి పని చూపెట్టడమంటే, పెద్ద పెద్ద సంస్థలు, ఫ్యాక్టరీలను స్థాపించవలసిన అవసరము లేదు. ఉదాహరణమునకు ఒక పిండి గిర్ని పెట్టుకోవచ్చు, నాలుగైదు బర్రెలతో పాలు పెరుగు తయారు చేసి అమ్ముకోవచ్చు, ఒక కిరాణ షాపు పెట్టుకోవచ్చు లేదా టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ పని, ప్లంబర్ పని, మెకానిక్ పని, డ్రైవర్ పని, కంప్యూటర్ పని, కుట్టుమిషన్ పని... ఈ విధముగా అనేక మార్గాలలో తాను తన కాళ్ళమీద నిలబడవచ్చు, నలుగురికి పని చూపెట్టవచ్చు. కనుక, ప్రతివ్యక్తి ఉద్యోగము! ఉద్యోగమని, ఉద్యోగము కొరకని ప్రభుత్వమును ఒత్తిడి చేస్తే వారు కూడా ఎంత మందికి ఉద్యోగాలు ఇవ్వగలరు? చెప్పండి!.


ఉద్యోగుల గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఇలా అన్నారు:          

ఉద్యోగములో చేరిన తరువాత కూడను ఒక విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. దేశము యొక్క గౌరవాన్ని కూడను చక్కగా మనము చూడాలి. మన దేశ గౌరవమే లేకపోతే, మన దేహ గౌరవము ఏ రీతిగా ఉంటుంది? ఉద్యోగాల్లో ప్రవేశించినపుడు ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి. మనము ఎంత జీతము డ్రా చేస్తున్నాము. ఈ జీతమునకు తగిన పని మనము చేస్తున్నామా? నీ అంతరాత్మను నీవు ప్రశ్నించుకోవాలి. నీ అంతరాత్మ నిన్ను అంగీకరించనపుడు, తిరిగి నీవు మరింత ఎక్కువ పని చెయ్యాలి. అట్లు లేకుండా, “జీతము ఎక్కువ - పని తక్కువ” అయిపోతే, దేశ ద్రోహులుగా మారిపోతారు! దేశ ద్రోహులు. ఇంతింత జీతాలు తీసుకొని పని తక్కువ చేస్తే దేశానికి ఎంత కీడు చేసినవారమౌతాము. మీ జీతాల కోసమని ప్రభుత్వము అన్ని దేశాలనుండి అప్పు తీసుకొస్తున్నారు. ఆ తెచ్చినటువంటి అప్పంతాకూడను మీ జీతాలకే ఇచ్చేస్తున్నారు. ఈ అప్పు తీర్చేదెప్పుడు? అప్పు యొక్క వడ్డీ తీర్చేదెప్పుడు? మీరు అధికమైన పని చేసినప్పుడే, అభివృద్ధికి అవకాశము ఉంటుంది. కానీ, ఈనాటి ఉద్యోగులు అధిక జీతాలు తీసుకొంటూ కూడా ఇంకా కావాలి! ఇంకా కావాలి!! ఇంకా కావాలి!!!. దురాశ దుఃఖమునకు చేటు! కనుక మనము తృప్తిఅలవరచుకోవాలి, “అసంతృప్తో ద్విజో నష్ట” అసంతృప్తునకు రెండు నష్టాలు కూడా కలుగుతుంటాయి. కనుక మనము తీసుకున్న జీతమునకు తగిన పని చెయ్యాలి. అప్పుడే Self satisfaction అవుతుంది. లేకపోతే Self satisfaction మనకు ఏ ప్రయత్నము చేసినా రాదు. బంగారు కొండను తెచ్చి నీ నెత్తిమీద పెట్టినా నీకు Self satisfaction రాదు. నీవు తృప్తికరంగా పనిచేస్తే అదే చాలు. (03-06-1993 దివ్యోపన్యాసము నుండి)

కామెంట్‌లు లేవు: