14, జులై 2021, బుధవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సంతానం..సంతోషం..*


చాలా రోజుల క్రిందట సంగతి ఇది..శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించడానికి బెంగుళూరు నుండి ఒక కుటుంబం వచ్చారు..తల్లీ తండ్రీ ఇద్దరు కుమారులు..వారి భార్యలు.. ..మొత్తం ఆరుగురు..నిజానికి వాళ్ళు మాలకొండ లోని శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం కోసం వచ్చారు..అక్కడికి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దగ్గరే అని తెలుసుకొని..చూసిపోదామని వచ్చారు..ఆరోజు శనివారం..వీళ్ళు మందిరానికి చేరే సరికి సాయంత్రం నాలుగు గంటల సమయం అయింది..


ఎలాగూ వచ్చారు కనుక పల్లకీ సేవ చూసి వెళ్ళండి అని చెప్పాము..అందరూ ఒకరినొకరు సంప్రదించుకొని..సరే అన్నారు..వాళ్ళ ఉద్దేశ్యం లో పల్లకీ సేవ అయిపోగానే..ఆలస్యం గా నైనా నెల్లూరు వెళ్ళిపోయి..రాత్రికి అక్కడ బస చేయాలని..అందుకే మమ్మల్ని రూము కూడా అడగలేదు..


పెద్దవాళ్ళిద్దరూ శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు..ఆసక్తిగా విన్నారు..ముఖ్యంగా పెద్దవాళ్ళిద్దరూ ఓపికగా శ్రీ స్వామివారి మందిరం అంతా తిరిగి చూసారు..


"శ్రీ స్వామివారు తపస్సు చేసుకునేటప్పుడు.. ఈ పులిచర్మం మీద కూర్చున్నారు కదా..ఆయన శరీర స్పర్శ పొందింది కదా!.." అని ఆ పెద్దాయన తన భార్యకు చెప్పి..మనసారా నమస్కారం చేసుకున్నారు..అలానే శ్రీ స్వామివారు నేలమాళిగ లో సాధన చేసుకునే ముందు..ఆ నేలమాళిగ పైన మూత లాగా వాడిన చెక్కపలక ను ముట్టుకుని కళ్లకద్దుకున్నారు..శ్రీ స్వామివారి గురించి మరింతగా తెలుసుకోవాలని వున్నదనీ..వీలైతే చెప్పమని నన్ను అడిగారు..ఆ సమయం లో పల్లకీ సేవ ఏర్పాట్ల లో కొద్దిగా పనిలో వున్నాను..అదే మాట వారికి చెప్పి..మా అమ్మగారు శ్రీ స్వామివారి గురించి వ్రాసిన పుస్తకం ఆయన కు ఇచ్చాను..భక్తిగా తీసుకున్నారు..


పల్లకీ సేవ లో కుటుంబం యావత్తూ పాల్గొన్నారు..ప్రసాదం తీసుకొని..ఇవతలికి వచ్చి..వారిలో వారే ఏదో మాట్లాడుకుంటున్నారు..ఒక పది నిమిషాల తరువాత నా దగ్గరకు వచ్చి.."ఏమండీ రాత్రికి ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాము..చూసారు కదా మేము మొత్తం ఆరుగురం వున్నాము..ఏదైనా రూము వుంటే..అందులో సర్దుకుంటాము.."అన్నారు..ఒక చిన్న గది ఉందనీ..అందులో ఆడవాళ్లు అందులో సర్దుకుంటే..మొగవాళ్ళు మందిర ప్రాంగణం లో పడుకోవచ్చనీ తెలిపాను..సరే అన్నారు..


ఆ రాత్రికి అందరూ నిద్ర చేసి..తెల్లవారి ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి కి అర్చన చేయించుకొని..సమాధికి నమస్కారం చేసుకొని..ఇక బయలుదేరి పోబోతూ..నా దగ్గరకు వచ్చి.."రాత్రి..పల్లకీ సేవ వద్ద కొందరు భక్తులతో మాట్లాడానండీ.. ఇక్కడ మనస్ఫూర్తిగా మ్రొక్కుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు..పెద్దవాడికి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయింది.. శ్రీ స్వామివారికి మ్రొక్కు కున్నాము..అందుకోసమే రాత్రి ఇక్కడ నిద్ర చేసాము..అదృష్టం బాగుండి.. వాళ్లకు సంతానం కలిగితే..మళ్లీ ఇక్కడికి అందరం వచ్చి మ్రొక్కు తీర్చుకుంటాము.." అన్నారు..ఆ వెంటనే సెలవు తీసుకొని వెళ్లిపోయారు..


దాదాపు సంవత్సరం తరువాత.. ఒక ఆదివారం నాడు మళ్లీ వాళ్ళందరూ వచ్చారు..నేరుగా శ్రీ స్వామివారి అర్చన టికెట్ కొనుక్కొని..పూజ చేయించుకొని..నా దగ్గరకు వచ్చి.."శ్రీ స్వామివారు మహిమ చూపారండీ..పెద్దవాడికి అమ్మాయి పుట్టింది..శ్రీ స్వామివారికి మ్రొక్కు కున్న విధంగా..హుండీ లో నేననుకున్న మొత్తం సమర్పించుకున్నాను..శ్రీ స్వామివారి పేరు కలిసి వచ్చేటట్లు గా పాపకు పేరు పెట్టుకుంటాము..ఆయన ప్రసాదం కాబట్టి..ముందుగా ఇక్కడికి వచ్చాము.." అన్నారు..


వాళ్ళందరి ముఖాల్లో సంతోషం తాండవిస్తోంది..అందుకు కారణభూతుడైన ఆ స్వామివారు మాత్రం సమాధినుంచి చిద్విలాసంగా చూస్తూవున్నారు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: