14, జులై 2021, బుధవారం

మన గోదావరి ""మన అయినవిల్లి

 మన గోదావరి  ""మన  అయినవిల్లి""


అయినవిల్లిలో కొలువైన సిద్ధివినాయకుడు కాశీలోని సాక్షిగణపతికే సాటి అయిన వాడని చెబుతారు. 

మరో ప్రత్యేకమైన పూజ కూడా ఇక్కడి వినాయకుడికి జరుగుతుంది. . అదేంటో తెలుసా, పెన్నులతో అభిషేకం. అవునండీ పెన్నులతో స్వామికి అభిషేకం చేసి వాటితో 

పరీక్ష రాస్తే తప్పకుండా పాస్ అవుతామని భక్తులు నమ్ముతారు.


స్వయంభు గణపతి క్షేత్రాలలో ఈ అయినవిల్లి ఆలయం ఒకటి.అయినవిల్లి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామము. దీనిని చేరుకోవాలంటే సమీప పట్టణమైన అమలాపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోనసీమగా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామం పరిసర ప్రాంతాలు చాల అందంగా ఉంటాయి. కొబ్బరి తోటలు  ,గోదావరి ఒడ్డు ,పచ్చని పొలాలు,కాలువలు ఇంకా చాల ఉన్నాయ్. అయినవిల్లి  అమలాపురానికి 12 కి.మీ. వయాముక్తేశ్వరం) రాజమండ్రికి 55 కి.మీ (వరావులపాలెం,కొత్తపేట,వానపల్లి) కాకినాడకు 72 కి.మీ.(వయా యానాం,అమలాపురం,ముక్తేశ్వరం) దూరంలో ఉంది.ఈ ప్రాంతం దేవాలయాలు ఉండటానికి చాల అనువైన ప్రదేశం.


అత్యంత పురాతనమైన శ్రీ విగ్నేశ్వర ఆలయములలో అయినవిల్లి క్షేత్రం చాల ప్రసిద్ధి చెందినది. ఇది తూర్పు గోదావరి జిల్లాలో గల అమలాపురం పట్టణానికి అత్యంత చేరువలో ఉన్నది .పూర్వము దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞము నిర్వర్తించే ముందు ఈ వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణమును బట్టి తెలియచున్నది. తొలుత ఈ ఆలయ నిర్మాణమును దేవతలే  చేసారని పెద్దలు చెబుతూ  ఉంటారు. ప్రతినిత్యం శ్రీ స్వామివారికి శివాగమ ప్రకారం విశేషార్చనలు సహస్రాధికములుగా నారికేళ ఫలోదకములతో అభిషేకములు చేయించుకుని వేలాది మంది భక్తులు శ్రీ స్వామి వారి కరుణ కటాక్షములు పొందుతారు. భక్తుల పాలిట కోర్కెలు తీర్చే గణనాధుడిగా స్వామి ప్రత్యక్ష నిదర్శనాలు చూపిస్తారు. భక్తులు వేయి నూట పదహార్లు వరకు నారికేళములతో  అభిషేకాలు చేయించుకుని తమ మొక్కులు  స్వామి వారికీ సమర్పించుకుంటారు.


ఇక ప్రతి మాసము ఉభయ చవితి తిధులు దశమి,ఏకాదశి,'వినాయచవితి,నవరాత్రులలోను' శ్రీ స్వామి వారి వైభవములు వర్ణింపలేము. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణములో శివకేశవులకు బేధము లేదని చాటిచెప్తున్నట్లు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి,శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ విశ్వేశ్వరాలయం ప్రక్క ప్రక్కనే ప్రతిష్టించబడిన ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీకాలబైరవస్వామి కొలువై ఉన్నారు.


ఇది భక్తులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం అలాగే దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం.

కామెంట్‌లు లేవు: