1, సెప్టెంబర్ 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*403వ నామ మంత్రము* 1.9.2021


*ఓం మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముద్యై నమః*


మహాకామేశుని నేత్రములనెడి కలువలను వికసింపజేసే వెన్నెలవంటి ఆహ్లాద రూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముదీ* యను పదహారక్షరముల(షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముద్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి చిరునవ్వు వెన్నెలలు వారి జీవితాలలో ప్రసరించి జీవించినంతకాలము శాంతిసౌఖ్యమలు, సిరిసంపదలతో ఆనందముగా విలసిల్లుదురు.


కలువలకు చంద్రుడు, తామరలకు సూర్యుడు ఆనందమునిచ్చే మిత్రులు. కలువలకు సూర్యుడు, తామరలకు చంద్రుడు ఆహ్లాదము నీయరు. ఆహ్లాదము లేకుంటే ఆవేదనయే కదా! పరమేశ్వరుని కన్నులు అనెడి కలువపూలకు, ఆనందమును కలిగించు వెన్నెల వంటిది శ్రీమాత. కనుకనే అమ్మవారు *మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముదీ* యని అనబడినది.


భక్తుల మనస్సులు కలువలవంటివి. అట్టి భక్తుల మనస్సులనే కలువలను వికసింప జేసి ఆహ్లాదమునిచ్చే పరమేశ్వరి వెన్నెలవంటిది. అమ్మవారి కరుణాకటాక్షమలు శరదృతువునందలి వెన్నెలవంటివి. ఆ వెన్నెల చల్లగా ఉంటుంది. ఆహ్లాదమునిస్తుంది. భక్తులు ఆనందంతో పరవశించిపోతారు. 


సాధకుడు మూలాధారమునందు నిద్రాణములోనున్న కుండలినీ శక్తిస్వరూపిణియైన శ్రీమాతను మేల్కొలిపి, సుషుమ్నా నాడిగుండా పయనింపజేస్తూ, షట్చక్రములలో అనేకవిధములుగా అర్చించుతూ, మధ్యలో బ్రహ్మ,విష్ణు,రుద్ర గ్రంథులను ఛేదనముచేయిస్తూ సహస్రారము చేర్చుతాడు. అక్కడ ఆ కుండలినీ స్వరూపిణియైన పరమేశ్వరి చంద్రమండలంలోని పరమేశ్వరుని చేరుటతో, అంతులేని ఆనందమును పొంది, అమృత ధారలను సాధకునిపై కురుపిస్తుంది. ఆ అమృతధారలు సాధకుని డెబ్బదిరెండువేల నాడీమండలముపై పడగా, ఆ అమృత వృష్టికి సాధకుడు తడిసిముద్దయి ఆ అమృతవృష్టియొక్క చల్లదనమునకు ఎనలేని ఆనందమును పొందుతాడు. సాధకుడు ఒక కలువ వంటి వాడు. కుండలినీ శక్తి స్వరూపిణియైన పరమేశ్వరి సహస్రారంలో వెన్నెల వంటిది. ఆ అమృతధారలు వెన్నెల కిరణములవంటివి. 


పరమేశ్వరుని కన్నులనే కలువలకు పరమేశ్వరి స్వరూపము ఆహ్లాదమునిచ్చే (ఆనందమునిచ్చే) చల్లని వెన్నెలవంటిది యగుటచే అమ్మవారు *మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముదీ* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముద్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: