1, సెప్టెంబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం*

 *1.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - నాలుగవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*4.11 (పదకొండవ శ్లోకము)*


*క్షుత్తృట్త్రికాలగుణమారుతజైహ్వశైశ్నానస్మానపారజలధీనతితీర్య కేచిత్|*


*క్రోధస్య యాంతి విఫలస్య వశం పదే గోర్మజ్జంతి దుశ్చరతపశ్చ వృథోత్సృజంతి॥12311॥*


కొందరు దుస్సహమైన ఆకలిదప్పులను, శీతోష్ణవర్షములను (తీవ్రమైన చలిని, వేడిని, వర్షములను), సుడిగాలులను సహింతురు. అట్లే జిహ్వోపభోగములను, జననేంద్రియ భోగములను సహింతురు. ఈ విధముగా తపశ్చర్యాది దీక్షలోనున్నవారు కష్టములనెడి ఎంతటి అగాధ సముద్రమునైనను ఇట్లే దాటిపోగలరు. కాని, వారు కోపమునకు వశులై గోష్పాదమంతటి మురుగుకాల్వలోబడి తమ తపస్సునంతటినీ నశింపజేసికొందురు. ఆ విధముగా వారి తీవ్ర తపశ్చర్యాదులన్నియును గంగపాలగును. అవి మోక్షమునకుగాని, భోగములకుగాని ఉపయోగపడక వృథాయగును. అట్టివారు రెంటికి చెడ్డ రేవడియగుదురు.


*4.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఇతి ప్రగృణతాం తేషాం స్త్రియోఽత్యద్భుతదర్శనాః|*


*దర్శయామాస శుశ్రూషాం స్వర్చితాః కుర్వతీర్విభుః॥12312॥*


మన్మథుడు మొదలగువారు భగవంతుని ఇట్లు స్తుతించుచుండిరి. అప్పుడు మన్మథుడు, వసంతుడు, అప్సరసలు మొదలగువారిలో పొడసూపుచున్న రూపలావణ్యాది గర్వములను అణచుటకై శక్తిమంతుడైన శ్రీమన్నారాయణుడు తన యోగబలముచే పెక్కుమంది సుందరీమణులను చూపించెను. వారి లావణ్య సౌకుమార్యములు అత్యంత మనోజ్ఞములు. దర్శనీయములు. వారు ధరించిన వస్త్రాభరణములు, పుష్పమాలాదులు మిగుల మనోహరముగానుండెను. వారందఱును ఆ శ్రీహరికి శుశ్రూషలొనర్చుచుండిరి.


*4.13 (పదమూడవ శ్లోకము)*


*తే దేవానుచరా దృష్ట్వా స్త్రియః శ్రీరివ రూపిణీః|*


*గంధేన ముముహుస్తాసాం రూపౌదార్యహతశ్రియః॥12313॥*


లక్ష్మీదేవివలె తేజరిల్లుచున్న ఆ తరుణీమణుల అందచందముముందు మన్మథాదుల రూపసౌందర్య వైభవములు వెలవెలబోవుచుండెను. వారి దేహములనుండి వెలువడుచున్న పరిమళముల గుబాళింపులకు ఆ దేవానుచరులు పరవశించిపోయిరి.


*4.14 (పదునాలుగవ శ్లోకము)*


*తానాహ దేవదేవేశః ప్రణతాన్ ప్రహసన్నివ|*


*ఆసామేకతమాం వృఙ్ధ్వం సవర్ణాం స్వర్గభూషణామ్॥12314॥*


దేవదేవుడైన శ్రీహరి తనముందు వినమ్రులై ప్రణమిల్లుచున్న మదనాదులను జూచి నవ్వుచు ఇట్లనెను. 'వీరిలో అన్నివిధములుగా మీకు అనురూప వతియైన తరుణీమణిని మీరు ఎన్నుకొనుడు. ఆమె మీ స్వర్గవైభవములను (శోభలను) ఇనుమడింపజేయగలదు.


*4.15 (పదిహేనవ శ్లోకము)*


*ఓమిత్యాదేశమాదాయ నత్వా తం సురవందినః|*


*ఉర్వశీమప్సరఃశ్రేష్ఠాం పురస్కృత్య దివం యయుః॥12315॥*


*4.16 (పదహారవ శ్లోకము)*


*ఇంద్రాయానమ్య సదసి శృణ్వతాం త్రిదివౌకసామ్|*


*ఊచుర్నారాయణబలం శక్రస్తత్రాస విస్మితః॥12316॥*


అంతట ఇంద్రుని అనుచరులైన మన్మథాదులు శ్రీహరియొక్క ఆదేశమును తలదాల్చి, ఆ స్వామికి ప్రణమిల్లి, ఆ యువతులలో శ్రేష్ఠురాలైన *ఊర్వశి* అను అప్సరసను దీసికొని స్వర్గమునకు చేరిరి. పిదప వారు దేవేంద్రునకు నమస్కరించి, సభలోనున్న సకలదేవతల సమక్షమున 'శ్రీమన్నారాయణుని శక్తిసామర్థ్యములను గూర్చి వివరించిరి. అప్పుడు శచీపతి తన అపరాధమును తలచుకొని భయపడెను, సర్వేశ్వరుని మహిమకు విస్మితుడయ్యెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: